మాట్లాడేందుకు సీఎం భయపడుతున్నారు

4 Sep, 2015 23:52 IST|Sakshi
మాట్లాడేందుకు సీఎం భయపడుతున్నారు

 వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్
 
 అనకాపల్లి :  అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడేందుకు సీఎం చంద్రబాబునాయుడు భయపడుతున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ఎద్దేవా చేశారు. శుక్రవారం రాత్రి అనకాపల్లి పట్టణ ప్రధాన కార్యదర్శి సూరిశెట్టి రమణ అప్పారావు ఇంటిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల్లో ముగించేయాలనుకోవడంతో అధికార పార్టీ భయం తేటతెల్లమైందన్నారు. రాష్ట్ర ప్రజల సమస్యలపై ప్రతిపక్ష నాయకుని హోదాలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి బాగోతం దేశ ప్రజలందరికీ తెలుసన్నారు. గోదావరి పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో అమాయకులు మృతిచెందారని ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రజలకు అండగా ఉంటామని అమర్‌నాథ్ పేర్కొన్నారు. షుగర్ ఫ్యాక్టరీ రైతుల సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే సమస్యలు పరిష్కరించకుండా మాటలకే పరిమితమవుతున్నారని అమర్‌నాథ్  విమర్శించారు.

 చిన్నారుల కుటుంబాలకు పరామర్శ
 ఇటీవల పట్టణంలోని గవరపాలెంలో ఆటలాడుకుంటూ ఇటుక స్తంభాలు పడి మృతిచెందిన ఇద్దరు చిన్నారుల కుటుంబాలను అమర్‌నాథ్‌తోపాటు వైఎస్సార్ సీపీ నాయకులు పరామర్శించారు. ముందుగా ఏలూరు యశ్వంత్ ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను ఓదార్చారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వెలగా కృష్ణ చైతన్య ఇంటికి వెళ్లి తల్లిదండ్రులు సంతోష్, రూపాలకు సానుభూతి తెలిపారు. అమర్‌నాథ్‌తోపాటు వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, సీనియర్ నాయకుడు మళ్ల బుల్లిబాబు, యువజన అధ్యక్షుడు జాజుల రమేష్, గొర్లె సూరిబాబు, పార్టీ కశింకోట అధ్యక్షుడు గొల్లవిల్లి శ్రీనివాసరావు, పెంటకోట శ్రీనివాసరావు, భీశెట్టి జగన్, శ్రీధర్‌రాజు, ఆళ్ల నాగేశ్వరరావు ఉన్నారు.

మరిన్ని వార్తలు