గవర్నర్‌తో ఘర్షణ

15 Jun, 2015 02:03 IST|Sakshi
గవర్నర్‌తో ఘర్షణ

చంద్రబాబు కొత్త ఎత్తు
నరసింహన్‌ను కాదని సలహాదారులతో భేటీ
ఓటుకు నోటు వ్యవహారం పక్కదారి పట్టించే ప్లాన్
కేంద్రానికి గవర్నర్ ఇచ్చిన నివేదికను జీర్ణించుకోలేని బాబు
అసహనంతోనే సలహాదారులను ఇంటికి పిలిపించుకున్న వైనం
ఈ సమయంలో కలవడంపై అధికార వర్గాల్లో విస్మయం

 
 సాక్షి, హైదరాబాద్:  ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా దొరికిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వింత చర్యలతో ఇరు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌తో ఘర్షణ వాతావరణానికి దారులు తీస్తున్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఇరుక్కున్న చంద్రబాబు ఆ విషయాన్ని పక్కదారి పట్టిస్తూ, గవర్నర్ నరసింహన్ తమకు సహకరించడం లేదంటూ ఆయనతో ఘర్షణకు దిగుతున్నారు. గవర్నర్ నరసింహన్ ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్‌లపై  కేంద్రానికి వాస్తవ నివేదికను సమర్పించడాన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు ఆయనను కాదని ఆయన సలహాదారులతో భేటీ కావడం ఆదివారం సంచలనం కలిగించింది. సలహాదారులు కూడా చంద్రబాబు నివాసానికి వెళ్లి కలడంపైనా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సలహాదారులు ఇటు గవర్నర్‌కు, అటు కేంద్రానికి జవాబుదారీగా ఉండాల్సి ఉంది.
 
 వాస్తవ నివేదికల వల్లనే
 ఫోన్ ట్యాపింగ్ అభియోగాలతో పాటు ఓటుకు నోటు వ్యవహారంపైన వాస్తవ పరిస్థితులను గవర్నర్ నరసింహన్ రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రులను కలిసి నివేదికలను సమర్పించిన విషయం తెలిసిందే. ఏపీ మంత్రులు శనివారం గవర్నర్‌ను కలిసిన సమయంలోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగిందో లేదో చెప్పలేనని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్- 8 అమలు అవసరం కానీ, చట్టం అమలుకొచ్చిన భంగమేమీ లేదని అటు రాజకీయ, ఇటు అధికార వర్గాల్లో జరుగుతున్న ప్రచారం చంద్రబాబును మానసికంగా కొంత కుంగదీసి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
 ఈ పరిణామాలన్నిటితో తీవ్ర అసహనంతో ఉన్న చంద్రబాబు ఆదివారం గవర్నర్ సలహాదారులు ఏపీవీఎన్ శర్మ, ఏకే మహంతిని తన ఇంటికి రావాల్సిందిగా కోరారు. దీంతో ఏమి చేయాలో పాలుపోని సలహాదారులు, వ్యక్తిగత హోదాలో పిలిచారని గవర్నర్‌కు తెలియజేసి నేరుగా చంద్రబాబు ఇంటికి వెళ్లారు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని, ఓటుకు నోటు విషయంలో రేవంతరెడ్డి బేరసారాలు, ఆ తరువాత చంద్రబాబు ఫోన్ సంభాషణలు వాస్తవమేనని గవర్నర్ నరసింహన్ కేంద్రానికి నివేదికలను సమర్పించినట్టు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయం తెలిసి చంద్రబాబు గవర్నర్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. ఓటుకు నోటు వ్యవహారంలో పూర్తిగా కూరుకుపోయి ఉన్న చంద్రబాబు ప్రస్తుతం గవర్నర్‌ను కలవడానికి వెనుకాడుతున్నారు.
 
 ఏ ముఖం పెట్టుకుని ఆయనను కలవాలో తెలియకే చంద్రబాబు గవర్నర్ సలహాదారులతో సమావేశం అయినట్టుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సలహాదారులతో చంద్రబాబు భేటీ సందర్భంగా రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్- 8 ప్రకారం ఏమి జరగాలి?, ఇప్పుడు ఏమి జరుగుతోందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. సెక్షన్- 8 ప్రకారం కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను, నియమ నిబంధనలను జారీ చేయాల్సి ఉందని సలహాదారులు చంద్రబాబుకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేస్తే గానీ సెక్షన్- 8 అమలు చేయడం గవర్నర్‌కు సాధ్యం కాదని సలహాదారులు వివరించినట్లు తెలిసింది. సెక్షన్- 8 అమల్లోకి వస్తే జంటనగరాల్లో పోలీసు అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు, శాంతిభద్రతలు గవర్నర్‌కు తెలిసి జరుగుతాయని, సెక్షన్ అమల్లోకి రానందున ఆ విషయాల్లో  గవర్నర్ పాత్ర ఉండదని సలహాదారులు వివరించినట్లు తెలిసింది.
 
 వ్యక్తిగత హోదాలో వెళ్లొచ్చా?
 గవర్నర్ సలహాదారులుగా ఉన్న ఏపీవీఎన్ శర్మ, ఏకే మహంతి గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు అత్యంత సన్నిహితులు, ఆ సాన్నిహిత్యం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గవర్నర్‌ను కాదని సలహాదారులను పిలిపించుకుని చంద్రబాబు మాట్లాడటంపై అధికార వర్గాల్లో విస్మయం వ్యక్తం అవుతోంది.  
 

>
మరిన్ని వార్తలు