కృష్ణా పుష్కరాలు సమష్టి విజయం

25 Aug, 2016 02:04 IST|Sakshi
డీజీపీ ఎన్.సాంబశివరావుకు పుష్కర జ్ఞాపికను అందజేస్తున్న సీఎం చంద్రబాబు

నేను టీమ్‌లీడర్ మాత్రమే  
ఉద్యోగుల అభినందన సభలో సీఎం చంద్రబాబు

సాక్షి, అమరావతి : అందరూ సమష్టిగా పనిచేయడం వల్లే కృష్ణా పుష్కరాలు విజయవంతమయ్యాయని, తాను టీమ్ లీడర్‌ను మాత్రమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అధికారులు, ఉద్యోగులంతా పోటీపడి పనిచేశారన్నారు. బుధవారం ఆయన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పుష్కరాల్లో పనిచేసిన ఉద్యోగులు, అధికారుల కోసం నిర్వహించిన అభినందన సభలో మాట్లాడారు. పుష్కరాల ప్రత్యేక అధికారి రాజశేఖర్, డీజీపీ సాంబశివరావు బాగా పని చేశారని ప్రశంసించారు. టెక్నాలజీని పూర్తిగా వాడుకుని కమాండ్ కంట్రోల్ యూనిట్ నుంచి రియల్‌టైమ్ గవర్నెన్స్ నిర్వహించే స్థాయికి తీర్చిదిద్దామన్నారు.

అక్షయపాత్ర, టీటీడీ, సత్యసాయి సేవా ట్రస్ట్‌తోపాటు 300 స్వచ్ఛంద సంస్థలు పుష్కర సేవలు నిర్వహించాయన్నారు. ఇదే అనుభవంతో ఈ ఏడాది సెప్టెంబర్ 15వ తేదీ కల్లా 110 మున్సిపాల్టీల్లో వీధి లైట్లను సెన్సర్ల ద్వారా కంట్రోల్‌రూమ్ నుంచి పర్యవేక్షించే వ్యవస్థను తీసుకురానున్నట్లు తెలిపారు.  పుష్కర సేవల  స్ఫూర్తితో పనిచేస్తే ప్రపంచంలోనే ఏపీ రోల్‌మోడల్‌గా మారుతుందన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాను అభినందించారు.

 వారికి శుక్రవారం సెలవు..
పుష్కరాల్లో పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా అభినందించిన సీఎం.. విశ్రాంతి కోసం శుక్రవారం వారికి సెలవు ప్రకటించారు. డీజీపీ సాంబశివరావు మాట్లాడుతూ హోమ్‌గార్డు నుంచి డీజీపీ వరకూ అందరూ బాగా పనిచేశారని, 34 వేలమంది పుష్కర విధులు నిర్వర్తించారన్నారు.

మరిన్ని వార్తలు