ప్రగతిశీల రాష్ట్రాలకు చేటు

9 May, 2018 03:41 IST|Sakshi
మంగళవారం ఉండవల్లిలో జరిగిన సదస్సుకు హాజరైన వివిధ జిల్లాల కలెక్టర్లు, అధికారులు

     పార్లమెంట్‌ సీట్లు తగ్గిపోవచ్చు 

     15వ ఆర్థిక సంఘం ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు

     మరో 5 లక్షల మందికి పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించాం

     అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పారిశ్రామిక పార్కులు

సాక్షి, అమరావతి: ‘‘2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటామని 15వ ఆర్థిక సంఘం ప్రకటించడం దారుణం. దీనివల్ల దక్షిణ భారతదేశంలో పార్లమెంట్‌ సీట్లు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇది ప్రగతిశీల రాష్ట్రాలకు అన్యాయం చేయడమే అవుతుంది’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు  ఆందోళన వ్యక్తం చేశారు. ఉండవల్లిలోని సీఎం నివాసం వద్ద గ్రీవెన్స్‌ హాల్‌లో మంగళవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రజల సంతృప్తే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. అన్ని విషయాల్లోనూ ప్రజల అభిప్రాయాలు తీసుకుంటున్నామని అన్నారు.

రాష్ట్రంలో పోషకాహార లోపాన్ని పూర్తిగా మటుమాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ఇంకా ఏం మాట్లాడారంటే.. ‘క్షేత్రస్థాయి పర్యటనలు, పల్లె నిద్రల ద్వారా ప్రత్యక్షంగా జనంతో మాట్లాడితే ప్రభుత్వ పథకాలు ఎలా అమలవుతున్నాయి? ఎక్కడెక్కడ ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయి? ప్రజలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారనే విషయాలు అధికారులకు తెలుస్తాయి. అందుకే పర్యటనలు, పల్లె నిద్ర కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలి. రాష్ట్రంలో ప్రస్తుతం 47 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. మరో 5 లక్షల మందికి ఇవ్వాలని నిర్ణయించాం. నాలుగేళ్ల క్రితం రాష్ట్ర విభజన వల్ల మనకు తీవ్ర నష్టం వాటిల్లింది. నాలుగేళ్లు కష్టపడి దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధిని సాధించాం. సంక్షేమం, అభివృద్ధి రెండింటిపైనా సమానంగా దృష్టి పెట్టాం. 

6,000 వర్చువల్‌ తరగతి గదులు 
ఈ ఏడాది 6,000 వర్చువల్‌ తరగతి గదులు ఏర్పాటు చేస్తున్నాం. ఐఐటీలో మన పిల్లలకు 12 శాతం ర్యాంకులు వచ్చాయి, ఇది మనకు గర్వకారణం. జీఎస్‌డీపీలో వెనుకబడి ఉన్నా, తెలివితేటల్లో శ్రీకాకుళం జిల్లా ముందుంది. అక్టోబర్‌ 2 నాటికి నూరు శాతం గ్రామాల్లో ఎల్‌ఈడీ వీధి దీపాలు అమర్చాలి. తాగునీటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రతి ఇంటికీ మంచినీటి కొళాయి కనెక్షన్‌ ఇవ్వాలి. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొల్పుతున్న పరిశ్రమలతో 11 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం వుంది. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా(ఎంఎస్‌ఎంఈ) పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలి. యువత టెక్నాలజీ ద్వారా ప్రయోజనం పొందాలే గానీ చెడిపోయే పరిస్థితి రాకూడదు. టెక్నాలజీ వల్ల మంచితోపాటు చెడు కూడా ఉంటుంది. మనం మంచినే వినియోగించుకోవాలి. లక్ష్యాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ కాలానుగుణంగా మార్చుకోవాలి. స్థూలంగా చూస్తే మనమంతా బాగానే పనిచేశాం. మన పనితీరును సూక్ష్మస్థాయిలో ఇంకా మెరుగు పర్చుకోవాల్సి ఉంది. 

సంక్షేమ కార్యక్రమాల అమల్లో నిర్లక్ష్యం వద్దు 
సాధించాలనే తపన, నిరంతర శ్రమ ఉంటే ఏదైనా సాధ్యమే. విద్యార్థులు పరీక్షలు రాసిన తర్వాత ఫలితాల కోసం ఎదురు చూసినట్లే మనం ప్రతి మూడు నెలలకోసారి పనితీరును సమీక్షించుకుని ముందుకెళుతున్నాం. జూన్‌ 2వ తేదీకి నవ్యాంధ్రప్రదేశ్‌లో పాలనకు నాలుగేళ్లు నిండుతాయి. ప్రతిఏటా అదేరోజు నవనిర్మాణ దీక్షను అందరిలో స్ఫూర్తి కలిగించేలా నిర్వహిస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎక్కడా నిర్లక్ష్యం వహించకూడదు’’ అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.  

నాలుగేళ్లలో గణనీయమైన అభివృద్ధి: మంత్రి యనమల
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ వృద్ధి రేటు రెండంకెల స్థాయికి చేరిందని, టెక్నాలజీని ఉపయోగించుకోవడం వల్లే ఇది సాధ్యమైందని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ... ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచుకుంటేనే తలసరి ఆదాయం పెరుగుతుందన్నారు. ‘‘వెనుకబడిన జిల్లాలకు సంబంధించి కేంద్రం విడుదల చేసిన రూ.350 కోట్ల నిధులను వెనక్కి తీసుకుంది. ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వడం లేదు. అయినా ఏ ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి సమర్థంగా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నారు’’ అని వివరించారు. 

అధికారులు సక్రమంగా పనిచేయడం లేదు: కేఈ కృష్ణమూర్తి
రెవెన్యూ శాఖలో ప్రభుత్వం పలు సంస్కరణలు తెచ్చినా అధికారులు ప్రభుత్వ ఆశయాల మేరకు పని చేయడం లేదని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. చుక్కల భూముల సమస్య పరిష్కారం కోసం వచ్చిన చాలా అర్జీలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని అన్నారు. వివాదం లేని ప్రైవేట్‌ భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించాలన్న ఆదేశాలను కూడా అధికారులు సరిగ్గా అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వ నిర్ణయాలను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేసే బాధ్యతను కలెక్టర్లు తీసుకోవాలని కేఈ కృష్ణమూర్తి సూచించారు. 

ఎస్సీలు, మహిళలపై దాడులు ఆందోళనకరం: సీఎస్‌
రాష్ట్రంలో ఎస్సీలు, మహిళలపై ఎక్కువగా దాడులు జరుగుతున్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌ కుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీలపై నేరాల విషయంలో దేశంలోనే ఏపీ ఏడో స్థానంలో ఉందని గుర్తు చేశారు. మహిళలపై నేరాల విషయంలో తొమ్మిదో స్థానంలో ఉందన్నారు. 2017–18లో రోడ్డు ప్రమాదాల్లో ఏకంగా 7,910 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి ప్రాంతంలో భూగర్భ జలమట్టం కలుషితం కావడం ఆందోళనకర పరిణామమని వివరించారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్య అందడం లేదన్నారు. రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేత ప్రారంభోపన్యాసంతో ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో పంచాయతీరాజ్, విద్య, వైద్యం, సంక్షేమం తదితర శాఖల ప్రగతిని సంబంధిత అధికారులు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. 

విద్య, వైద్యంపైనే ఎక్కువ చర్చ
కలెక్టర్ల సదస్సులో ప్రధానంగా విద్య, వైద్యంపైనే ఎక్కువ చర్చ జరిగింది. పిల్లల్లో కొందరు పోషకాహార లోపంతో తక్కువ బరువు, ఎదుగుదల లోపం, రక్తహీనత వంటి సమస్యలతో అల్లాడుతుంటే మరికొందరు ఊబకాయంతో బాధ పడుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య కలెక్టర్ల సదస్సులో ప్రస్తావించారు. అందువల్ల గ్రామీణ ప్రాంతాల్లో పౌరసరఫరాల శాఖ ద్వారా పాలిష్డ్‌ బియ్యం బదులు బ్రౌన్‌ రైస్, రాగులు, కొర్రలు పంపిణీ చేసే విషయాన్ని పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరారు. పిల్లల్లో ట్రైగ్లిజరాయిడ్స్‌ పెరుగుతుండటం సరైన పరిణామం కాదన్నారు. ఉద్దానం బాధితులకు ఉచితంగా మందులు ఇస్తామని ప్రకటించి ఆరు నెలలైనా ఇవ్వడం లేదని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదరణ పోర్టల్, విద్యాశాఖ యాప్, ఆర్టీజీఎస్‌ మొబైల్‌ యాప్, స్మార్ట్‌ ఆంధ్రతోపాటు పలు పుస్తకాలను, క్యాలెండర్లను ఆవిష్కరించారు. 

>
మరిన్ని వార్తలు