మా అబ్బాయి సొంత ప్రతిభతోనే చదివాడు

1 Jun, 2017 01:32 IST|Sakshi
మా అబ్బాయి సొంత ప్రతిభతోనే చదివాడు
ముఖ్యమంత్రి చంద్రబాబు 
 
సాక్షి, అమరావతి: మా అబ్బాయి సొంత ప్రతిభతోనే ఉన్నత చదువులు చదువుకున్నాడని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పిల్లలు కేవలం చదువులకే పరిమితం కాకుండా వినూత్నంగా ఆలోచించాలని సీఎం సూచించారు. విదేశీ విద్యా దీవెన పథకానికి ఎంపికైన విద్యార్థులతో ఆయన బుధవారం విజయవాడలోని ఎ–కన్వెన్షన్‌ సెంటర్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన పాలనలో అవినీతి జరగనివ్వనని, లంచాలు తీసుకునే వారిని బజారుకీడుస్తానని హెచ్చరించారు. ఇండియాకు యంగ్‌ దేశంగా పేరుందని, దేశానికి యువతే పెద్ద సంపదని తెలిపారు.

పిల్లలు మట్టిలో మాణిక్యాలని, ప్రపంచాన్ని జయించే శక్తి విద్యకే ఉందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్‌ హబ్‌గా తయారు చేస్తామని చెప్పారు. ప్రపంచంలోని ఉత్తమ విద్యా సంస్థలను రాష్ట్రానికి తీసుకొస్తామని తెలిపారు. విద్యకు వయస్సుతో సంబంధం లేదన్నారు. తాను నిరంతర విద్యార్థినని, నిత్యం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటానని పేర్కొన్నారు. పేద విద్యార్థులను ఉన్నత చదువులు చదివించే బాధ్యతను తీసుకున్నామని తెలిపారు. టెక్నాలజీని వినియోగించడంలో మనమే నంబర్‌ వన్‌గా ఉన్నామని చెప్పారు. యువత కేవలం ఉద్యోగాలే కాకుండా వ్యాపారాలు కూడా చేయాలని సూచించారు.

అమెరికాలో తెలుగువారే ఎక్కువ విజయాలు సాధిస్తున్నారన్నారు. చేతిలో సెల్‌ఫోన్‌ ఉంటే ప్రపంచమే అరచేతిలో ఉన్నట్టని, సెల్‌ఫోన్‌ ద్వారా స్కాలర్‌షిప్‌ స్టేటస్‌ చూసుకునే అవకాశం జ్ఞాన భూమి యాప్‌ ద్వారా కల్పిస్తున్నామని చెప్పారు. టీ అమ్ముకునే వ్యక్తి మన దేశానికి ప్రధాని అయ్యారని, యువత అలాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. త్వరలోనే నిరుద్యోగ భృతిని అమలు చేస్తామని స్పష్టం చేశారు. తాను బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదని, విజన్‌ ప్రకారమే పనలు చేస్తానని తెలిపారు. 
 
నేడు మంత్రివర్గ సమావేశం
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గురువారం వెలగపూడి సచివాలయంలో జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. తొలుత మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశాన్ని నిర్వహించాలని అనుకున్నా కొన్ని కారణాల వల్ల ఉదయానికి మార్చినట్లు సమాచార పౌరసంబంధాల శాఖ తెలిపింది.
మరిన్ని వార్తలు