మీవల్లే ఫెయిలయ్యాం

22 Sep, 2017 00:48 IST|Sakshi

కలెక్టర్లు, అధికారుల సదస్సులో సీఎం చంద్రబాబు ఆగ్రహం
అధికారుల తీరువల్లే మిషన్ల అమల్లో వైఫల్యం
పాఠశాల విద్యకు నిధులిచ్చినా పనులు కావడంలేదు
అడ్మినిస్ట్రేషన్‌ తెలియకపోతే ఏమి చేస్తాం?
సీఎం తీరుపై అధికార వర్గాల మండిపాటు

సాక్షి, అమరావతి: సామాజిక సాధికారత, సేవారంగ మిషన్ల అమలులో ఫెయిలయ్యామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఈ మిషన్లపై గతంలో జరిగిన కలెక్టర్ల సదస్సు నుంచి ఇప్పటి వరకు ఒక్క అధికారైనా సమావేశం పెట్టారా? కనీసం కూర్చున్నారా? కూర్చుంటే కదా మాట్లాడేది.. అంటూ కలెక్టర్‌లు, ఇతర ఐఏఎస్‌లను ప్రశ్నించారు. గురువారం రెండో రోజు విజయవాడలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన ఏడు మిషన్లలోని సామాజిక సాధికారత, సేవారంగ మిషన్లపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి ప్రశ్నలకు ఒక్క అధికారి కూడా సమాధానం చెప్పకపోవడంతో సీఎం కాస్త ఘాటుగా మాట్లాడారు. అధికారుల తీరు వల్లే ఆ మిషన్ల అమలులో ఫెయిలయ్యాం అని అన్నారు. ప్రాథమిక విద్యపై కనీస బాధ్యత లేకుండా ముఖ్య కార్యదర్శి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాఠశాల విద్యను ఫెయిల్‌ చేయటానికి ఎన్ని మార్గాలున్నాయో అన్నీ చేస్తున్నారని ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ను ఉద్దేశించి సీఎం వ్యంగ్యంగా మాట్లాడారు. గ్యాస్‌ తెప్పించు కోలేరా? బయోమెట్రిక్‌ పెట్టించుకోలేరా? అంటూ విద్యాశాఖ కార్యదర్శి, కమిషనర్‌లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నీ ఆన్సర్‌ సరిగాలేదు, అడ్మినిస్ట్రేషన్‌ తెలియకపోతే ఏమి చేస్తాం, యాన్యుటీ కింద పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం రూ. 5 వేల కోట్లు ఇచ్చాం, ఏమి చేస్తున్నారు’ అంటూ ప్రిన్సిపల్‌ కార్యదర్శిపై మండిపడ్డారు. రాష్ట్రంలో 47 శాతం విశ్వవిద్యాలయాలు నాక్‌ అక్రెడిటేషన్‌ పొందాయని, 13 రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌ ఉన్నాయన్నారు. లక్షా 62 వేల మంది విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా రూ. 15,800 కోట్లతో కొత్తగా రాష్ట్రంలో 11 వర్సిటీలు ఏర్పాటు కానున్నాయని తెలిపారు.

ఆ శాఖల మధ్య సమన్వయం లేదు
గర్భిణులకు సరైన పోషకాహరం ఇవ్వాలని, ఆరోగ్య సమస్యలు రాకుండా చూడాలని సీఎం చెప్పారు. అయితే ఈ విషయంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్యశాఖలకు పడటంలేదన్నారు. రెండు శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రక్తహీనత, నియంత్రణలేని రక్తపోటు కారణంగా పెద్దసంఖ్యలో మహిళలు మృతి చెందుతున్నట్లు తమ అధ్యయనంలో తేలిందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వివరించారు.  శాఖల మధ్య సమన్వయం లేక పౌష్టికాహారం అందకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యను ఉద్దేశించి సీఎం అన్నారు.

సీఎం నవరాత్రి శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రజలు, దేశ విదేశాల్లోని తెలుగు వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి గెలుపునకు ఈ ఉత్సవాలు ఆరంభసూచకమన్నారు.

మీడియా కథనాలపై స్పందించండి
ప్రజా సమస్యలపై మీడియాలో వచ్చే కథనాలపై స్పందించాలని అధికారులకు సీఎం సూచించారు. సమస్యలపై ప్రజలు ఫోన్‌ చేస్తే తక్షణం స్పందించి పరిష్కారం చూపాలన్నారు. మీడియా కథనాలకు ప్రాముఖ్యత ఇవ్వాలని, తేలిగ్గా తీసుకోవద్దని సూచించారు. పంచాయతీ కార్యాల యాల్లో వీడియో కాన్ఫరెన్స్‌లు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌లను ఆదేశించారు. కాగా, సీఎం తీరుపై అధికార వర్గాలు మండిపడుతున్నాయి. నేతల వైఫల్యాలను తమపైకి నెట్టడానికి సీఎం ప్రయత్నించారని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల లేమితో పాటు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే పాలన కుంటుపడుతోందని విమర్శించారు. 

మరిన్ని వార్తలు