నాగరిక ప్రపంచం సిగ్గుపడేలా దాచేపల్లి ఘటన

6 May, 2018 04:08 IST|Sakshi

     బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం, బాలికను నేనే చదివిస్తా 

     జీజీహెచ్‌లో బాధిత బాలికను పరామర్శించిన సీఎం చంద్రబాబు 

     మిగిలిన బాధితుల సంగతేంటన్న విలేకరిపై సీఎం రుసరుస

సాక్షి, గుంటూరు/గుంటూరు మెడికల్‌: ఆడపిల్లలపై అత్యాచారాలకు పాల్పడే వారికి ఈ భూమి మీద అదే చివరి రోజు అవుతుందని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. దాచేపల్లిలో ఈనెల 3న అత్యాచారానికి గురై జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాలికను శనివారం ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సంఘటన గురించి చెప్పుకోవడానికే సిగ్గుపడే విధంగా నీచమైన చర్యకు పాల్పడ్డాడని, ముఖ్యమంత్రిగా తాను ఎంతో బాధపడుతున్నానన్నారు. ఈ సంఘటన తర్వాత దాచేపల్లిలో ప్రజలు పెద్దఎత్తున రోడ్లపైకి చేరి బాధిత కుటుంబానికి అండగా నిలవడం అభినందనీయమన్నారు. ఎవరైతే ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడతారో వారిని మహిళలు బజారులో పట్టుకుని కుమ్మేయాలన్నారు.  రాష్ట్రంలో ఇదే చివరి సంఘటన కావాలని,  మరోసారి జరిగితే ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేసి నిందితులకు ఉరిశిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.   

బాధిత కుటుంబానికి అండగా.. 
బాధిత కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని, ఇప్పటికే రూ.5 లక్షలు అందించామని, మరో ఐదు లక్షలు బాలిక పేరుతో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తామని సీఎం చెప్పారు. అంతేకాక, రెండు ఎకరాల పొలం కొనిస్తామని, ఉపాధి కోసం బాలిక తండ్రికి ఔట్‌ సోర్సింగ్‌లో ఉద్యోగంతో పాటు, ఇల్లు మంజూరు చేస్తామన్నారు. అలాగే, బాధితురాలిని చదివించే బాధ్యత తీసుకుంటామన్నారు. జిల్లాలో ఇటీవల కాలంలో తొమ్మిది ఘటనలు జరిగాయని, వారిని ప్రభుత్వం ఆదుకోదా అని విలేకరులు ప్రశ్నించగా, వాటిని కూడా సమీక్షిస్తామని చెబుతూనే అది సరైన ప్రశ్న కాదంటూ విలేకరికి క్లాస్‌ పీకారు. సీఎం వెంట మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి, డీజీపీ మాలకొండయ్య, జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్, గుంటూరు అర్బన్, రూరల్‌ ఎస్పీలు విజయరావు, వెంకటప్పలనాయుడు  ఉన్నారు.  
అల్పాహారం లేక అవస్థలు 
సీఎం పర్యటన సందర్భంగా కాన్పుల విభాగంలో చికిత్స పొందుతున్న వారికి ఆల్పాహారం పెట్టకపోవడంతో  విమర్శలు వెల్లువెత్తాయి. అక్కడ చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించేందుకు ఉదయం 9గంటలకు సీఎం వస్తున్నట్టు అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది ఎవరినీ అనుమతించలేదు. లోపలి వారిని బయటకు రానివ్వలేదు. ఫలితంగా అక్కడ చికిత్స పొందుతున్న వారికి అల్పాహారం అందలేదని గర్భిణులు, బాలింతల కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డా.దేవనబోయిన శౌరిరాజునాయుడిని ‘సాక్షి’ వివరణ కోరగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశామన్నారు. 

ఆడబిడ్డలకు రక్షణగా కదులుదాం 
అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో అత్యాచారాలు, శాంతిభద్రతలపై సీఎం టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అత్యాచారాలకు వ్యతిరేకంగా సోమవారం నిర్వహించే ప్రజా చైతన్య ప్రదర్శనల కార్యక్రమం ఒక ప్రజా ఉద్యమమని, ఉన్మాదులపై పోరాటమని చెప్పారు. ‘ఆడబిడ్డలకు రక్షగా కదులుదాం’ పేరుతో నిర్వహించే ఈ ర్యాలీల్లో అందరూ పాల్గొనాలని కోరారు.

మరిన్ని వార్తలు