నేనే మొదటి కార్మికుడిని..సన్మానం నాకే చేయాలి...

2 May, 2017 01:29 IST|Sakshi
నేనే మొదటి కార్మికుడిని..సన్మానం నాకే చేయాలి...

మేడే వేడుకల్లో సీఎం చంద్రబాబు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నేనే మొదటి కార్మికుడిని, ఏదైనా సన్మానం చేయాలనుకుంటే ముందుగా నాకే చేయాలి, పడుకునే సమయంలో తప్ప పగలు, రాత్రి అలుపు లేకుండా పనిచేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో ప్రతీ కార్మికుడికి సొంత ఇల్లు నిర్మించి 2018 మేడే నాటికి గృహప్రవేశాలు చేయించే బాధ్యత తీసుకుంటామని తెలిపారు. కార్మికుల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలు కేటాయిస్తామని, పారిశ్రామికవేత్తలు  సహకరించాలని కోరారు. విజయవాడ ఎ–కన్వెన్షన్‌లో కార్మిక శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన మేడే ఉత్సవాల్లో చంద్రబాబు మాట్లాడారు.

బయటివాళ్లు వచ్చి యూనియన్లు పెట్టి గొడవలు పెట్టి కార్మికులు రోడ్డున పడ్డాక పట్టించుకోవడంలేదని వ్యాఖ్యానించారు. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 27లక్షల మంది ఉపాధి హామీ కూలీలను భవన నిర్మాణ రంగంలోకి చేర్చి వారికి 12 సంక్షేమ పథకాలు వర్తించేలా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. లేబర్‌ లేకపోతే సంపద సృష్టి లేదని, పారిశ్రామికవేత్తలు లేకపోతే లేబర్‌కు ఉద్యోగాలు లేవని, ఇద్దరూ కలిసి మెలగాలని సూచించారు.

మరిన్ని వార్తలు