రామోజీరావుకు పద్మవిభూషణ్‌ను ఇప్పించింది నేనే

2 Jul, 2017 01:32 IST|Sakshi
రామోజీరావుకు పద్మవిభూషణ్‌ను ఇప్పించింది నేనే
సీఎం చంద్రబాబు నాయుడు
 
సాక్షి, అమరావతి బ్యూరో: ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు సేవలను గుర్తించి పద్మవిభూషణ్‌ పురస్కారానికి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసి ఇప్పించింది తానేనని సీఎం చంద్రబాబు చెప్పారు. కృష్ణాజిల్లా పెదపారుపూడిలో రామోజీ ఫౌండేషన్‌ ఆ«ధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం మాట్లాడుతూ.. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతి నిధులతో పాటు అధికారులు పనితీరుపై ఎప్పటి కప్పుడు ప్రజాభిప్రాయాన్ని తెప్పించుకుంటున్నా నని తెలిపారు.

వారి పనితీరు బాగాలేకపోతే ఓసారి హెచ్చరిస్తానని, అప్పటికీ మారకుంటే వారిపై గట్టిగా ఉంటానని అన్నారు. ఎవరైనా అధి కారులు, ఉద్యోగులు లంచం తీసుకున్నా, సకాలం లో పని చేయకున్నా కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేస్తే, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలో సీఎంగా ఉన్నపుడు తన పర్యటన అంటే అధికారులంతా భయపడిపోయే వారని, కొందరు చేసిన తప్పుకు అధికారులందరూ భయపడాల్సి వస్తోందని భావించి ఇప్పుడు అలా చేయడం లేదన్నారు.
 
గ్రామాన్ని దత్తత తీసుకోవడం హర్షణీయం
రామోజీరావు జన్మభూమి రుణం తీర్చుకొనేందుకు పెదపారుపూడిని దత్తత తీసుకోవడం.. ప్రభుత్వ నిధులతో పాటు రూ.8.3 కోట్లు వెచ్చించి గ్రామాభివృద్ధికి తోడ్పడటం హర్షణీయమని చంద్రబాబు అన్నారు. పెదపారువూడిని స్మార్ట్ గ్రామంగా తీర్చిదిద్దేందుకు సహకరిస్తానన్నారు.
>
మరిన్ని వార్తలు