చంద్రబాబే అవినీతి చేసుకోమని చెప్పారు..

22 Feb, 2018 11:29 IST|Sakshi

సాక్షి, జమ్మలమడుగు : తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అవినీతికి ఏవిధంగా పాల్పడుతున్నారో, ఓ మంత్రి బహిరంగంగా చేసిన వ్యాఖ్యల్లో స్పష్టమవుతోంది. అవినీతి చేసుకోమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే తమకు చెప్పారని మంత్రి ఆది నారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా మరో టీడీపీ నేతకు అవినీతిలో వాటాలు ఉన్నట్టు వెల్లడించారు. తాను చేసే అవినీతిలో టీడీపీ నేత, మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డికి కూడా అర్ధ రూపాయి భాగం ఉందని పేర్కొన్నారు. స్వయానా సీఎం చంద్రబాబు నాయుడే ఐఏఎస్ ఆఫీసర్లని తమతో పాటూ కూర్చోబెట్టి పంచాయతీ చేపించారని తెలిపారు. రామ సుబ్బారెడ్డి అడిగిన దాంట్లో మనకు సగం వస్తుంది, మనం అడిగినా రామ సుబ్బారెడ్డికి సగం వస్తుంది అంటూ ఆదినారాయణ రెడ్డి అక్కడున్న వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 'వాళ్లు దాంట్లో ఏది విమర్శించినా నేనైతే పట్టించుకోను, మీరెవరూ దయ చేసి విమర్శించమాకండి. మీకు కావాల్సిన పనులు నన్ను అడగండి. ఎస్ఎంఎస్ లు పెట్టండి. నీను మీ ఎమ్మెల్యేని, పక్కకు పోయినప్పుడే మంత్రిని' అంటూ ఆది నారాయణ రెడ్డి పేర్కొన్నారు.

మంత్రి ఆది నారాయణ రెడ్డి వ్యాఖ్యలను అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీయడంతో ఈ విషయం వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతోంది. మంత్రి వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు ఎక్కువయ్యాయి.

మరిన్ని వార్తలు