ఈ ఘనత నాదే

9 Sep, 2017 00:51 IST|Sakshi
ఈ ఘనత నాదే
రాయలసీమను సస్యశ్యామలం చేశా.. 
- హంద్రీ – నీవాకు పునాది వేసి పూర్తి చేసిందీ నేనే  
కర్నూలు, అనంతలో ‘జలసిరికి హారతి’లో సీఎం చంద్రబాబు 
 
సాక్షి ప్రతినిధి, కర్నూలు/అనంతపురం: ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి రాయలసీమను సస్యశ్యామలం చేసిన ఘనత తనదేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. కరువు రైతులను ఆదుకోవడం సంతోషంగా ఉందని, ఇంతకంటే ఆనందం ఏముంటుందన్నారు. ఎవరి కోసమో ఇవన్నీ చేయడం లేదని, తనను నమ్ముకున్న ప్రజల కోసమేనని చెప్పారు. జలసిరికి హారతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ముఖ్యమంత్రి కర్నూలు జిల్లా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం వద్ద మూడు మోటార్లను ఆన్‌ చేసి హంద్రీ నీవాకు నీటిని విడుదల చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ సమీపంలో నీటి కుంట వద్ద, హంద్రీ–నీవా కాలువ వద్ద గంగమ్మకు పూజలు నిర్వహించి పైలాన్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో మాట్లాడుతూ తన కృషి వల్లే ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రారంభమైందని చెప్పారు. రాయలసీమ ఎడారిగా మారిపోకూడదని 1996లో తాను హంద్రీ – నీవాకు శంకుస్థాపన చేశానని, ఇప్పుడు తానే పూర్తి చేస్తున్నానని చెప్పారు. పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. గోదావరి – కృష్ణా నదులను అనుసంధానం చేసిన ఘనత తమదేనన్నారు. అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశామని, పోతిరెడ్డిపాడు ద్వారా లేక మల్యాల, ముచ్చుమర్రి ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడికైనా నీటిని ఇచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించామన్నారు. నీటి కోసం రాష్ట్రాల మధ్య పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతున్నాయని, మొన్న కావేరి విషయంలో తమిళనాడు, కర్ణాటక మధ్య పోరు నడిచిందని, ఇప్పుడు కృష్ణా జలాలు మనకు రాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రెండూ ఆపుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు జూరాల దగ్గర తెలంగాణ కూడా భారీగా తోడిపోసుకుంటుండటంతో శ్రీశైలానికి నీళ్లు వచ్చే పరిస్థితే లేకుండా పోయిందన్నారు.  
 
డ్వాక్రా సంఘాలకు త్వరలో మూడో విడత పెట్టుబడి నిధి 
డ్వాక్రా సంఘాలకు మూడో విడత ఇవ్వాల్సిన రూ.4 వేల పెట్టుబడి నిధిని కూడా త్వరలో విడుదల చేస్తామని సీఎం తెలిపారు. రైతులకు మూడో విడత రుణమాఫీ మొత్తాన్ని ఈ నెలలో మంజూరు చేస్తామని  చంద్రబాబునాయుడు ప్రకటించారు. 
 
నాలుగు.. మూడు.. ఒకటి.. 
 నాలుగు మోటార్లను ప్రారంభించినట్టు స్వయంగా సీఎం చంద్రబాబుతోపాటు అధికారులు కూడా ప్రకటించారు. అయితే, వాస్తవానికి ప్రారంభించింది కేవలం మూడు మోటార్లు మాత్రమే. 
 
మళ్లీ ఎమ్మెల్యే ఐజయ్య మైక్‌ కట్‌ 

 
కర్నూలు జిల్లా పర్యటనలో ఇదివరకు తంగెడంచె, ముచ్చుమర్రి సభల్లో నందికొట్కూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఐజయ్య ప్రసంగాన్ని అడ్డుకున్న సీఎం... తాజాగా ముచ్చుమర్రి వద్దా అదే పనిచేశారు. సీఎం ప్రసంగం తర్వాత ఐజయ్య మాట్లాడుతూ... ముచ్చుమర్రి ప్రాజెక్టు 798 అడుగుల నుంచి నీరు రావాలంటే అప్రోచ్‌ కెనాల్‌ పూర్తి చేయాలన్నారు. ప్రస్తుతం సగమే పూర్తి చేశారన్నారు. అప్రోచ్‌ కెనాల్‌ మొత్తాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతలో సీఎం జోక్యం చేసుకుని ఇక్కడ రాజకీయాలు మాట్లాడొద్దని, సంబంధిత మంత్రికే మాట్లాడే అవకాశం రాలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అడ్డుకున్నారు.  
మరిన్ని వార్తలు