మీకిదే ఎక్కువ...!

30 Jun, 2018 03:39 IST|Sakshi

‘ఆశా’ వర్కర్లపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

ఎక్కువగా అడిగితే మీకు కష్టాలొస్తాయి

ఇచ్చింది తీసుకోవాలంటూ బెదిరింపు ధోరణిలో సీఎం వ్యాఖ్యలు

రూ.6 వేలు ఫిక్స్‌డ్‌ వేతనం ఇవ్వాలని కోరిన ఆశా వర్కర్లు

కుదరదని తేల్చి చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, అమరావతి: దుర్భరంగా మారిన తమ జీవితాలను జీతాలు పెంచి ఆదుకోవాలంటూ తనను చుట్టుముట్టిన ‘ఆశా’ కార్యకర్తలపై మీకిచ్చేదే ఎక్కువంటూ సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు కోరుతున్నట్లుగా ఆశా వర్కర్లకు రూ. 6 వేల గౌరవ వేతనం ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఇచ్చింది తీసుకోవాలని, అంతకుమించి ఇవ్వలేమని స్పష్టం చేశారు. మీరిచ్చే డబ్బు సరిపోదంటూ  తమ ఆవేదనను చెప్పడానికి ప్రయత్నించిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాను చెప్పిందే వినాలని, ఇంతకు మించి ఏ రాష్ట్రంలోనూ ఇవ్వడం లేదన్నారు. శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసం వద్ద గ్రీవెన్స్‌ హాలులో వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆశా వర్కర్లతో చంద్రబాబు సమావేశమయ్యారు. ‘ఆశాలకు బాసట’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం అంతా సీఎం ఆగ్రహావేశాలకు వేదిక కావటం గమనార్హం. 

హ్యాపీయేనా... ఏమాత్రం చాలదు
ఆశా వర్కర్లకు రూ. 3 వేల గౌరవ వేతనం ఇస్తామని, పనితీరును బట్టి మరో మూడు వేలు ఇచ్చే అవకాశం కల్పిస్తానని చెబుతూ అందరూ హ్యాపీయేనా? అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. అయితే ఆశా వర్కర్లంతా అది న్యాయం కాదని, ఏమాత్రం చాలదంటూ ముక్తకంఠంతో చెప్పారు. తనకు సన్మానం చేస్తారని ఆశించిన చంద్రబాబు వారి సమాధానంతో అవాక్కయ్యారు. ఇలా అయితే కుదరదని హెచ్చరించారు. ఫిక్స్‌డ్‌గా కనీసం రూ.ఆరు వేల గౌరవ వేతనం ఇవ్వాలని, తమ పరిస్థితి దారుణంగా ఉందని ఆశాలు ఆవేదన వ్యక్తం చేయగా అడ్డుకున్న చంద్రబాబు ఈ మాదిరిగా అయితే కుదరదని, రాబోయే రోజుల్లో మీకు కష్టాలు వస్తాయంటూ బెదిరించారు. ‘అవన్నీ కాదమ్మా.. తెలంగాణలోనూ, ఎక్కడా లేని విధంగా రూ.మూడు వేలు ఇస్తాం. మీ లీడర్లు వచ్చి రూ. మూడు వేలకు అంగీకరించారు. ఇంకా ఏమిటి?’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లు తమ గోడు చెప్పుకునేందుకు ప్రయత్నించగా అవన్నీ తాను విననన్నారు. రూ. మూడు వేలు ఇస్తామంటే లీడర్ల ద్వారా ఒప్పుకుని ఇక్కడకు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ కావాలనడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  మొత్తం 43 వేల మంది వర్కర్లకు స్మార్ట్‌ ఫోన్లు ఇప్పిస్తానని, యాప్‌ ద్వారా పనుల్ని అప్‌లోడ్‌ చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. చంద్రన్న బీమా, ఏటా యూనిఫామ్, ఏఎన్‌ఎంల నియామకంలో ప్రాధాన్యం, ఎన్టీఆర్‌ వైద్య సేవ కింద వైద్యం పొందేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు. 

చంద్రబాబును చుట్టుముట్టిన ఆశా వర్కర్లు.. 
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలపై ఏమాత్రం సంతృప్తి చెందని ఆశా వర్కర్లు ఆయన లేచి వెళ్లిపోతుండగా తమ సమస్యలు చెప్పేందుకు ప్రయత్నించారు. వారిపై ఆయన పదేపదే ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఒకదశలో ఆశా వర్కర్లంతా ఆయన్ను చుట్టుముట్టి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అయినా వినని ముఖ్యమంత్రి మీకిదే ఎక్కువని వ్యాఖ్యానిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

ఒప్పుకోవాలంటూ యూనియన్‌ నాయకులపై ఒత్తిడి
ఆశావర్కర్లు అనంతరం వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యను కలవగా ఆమె కూడా ముఖ్యమంత్రి చెప్పిన విషయాన్నే చెప్పారు. దీంతో వారంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రూ.6 వేల గౌరవ వేతనాన్ని ప్రకటిస్తారంటూ రాత్రికి రాత్రి తమను అమరావతికి రప్పించి తీరా రూ.మూడు వేలే  ఇస్తామంటున్నారని వాపోయారు. తమకు ప్రయాణ ఖర్చులే బోలెడు అవుతున్నాయని, తమ బ్రతుకులు దుర్భరంగా ఉన్నాయని తెలిపారు. దీంతో పూనం మాలకొండయ్య మీడియాను బయటకు పంపించి మరోసారి  ఆశా వర్కర్లతో సమావేశమై రూ.మూడు వేలతో సరిపెట్టుకోవాలని సూచించారు.

ఆశా వర్కర్ల యూనియన్‌ నాయకులతో ప్రత్యేకంగా మాట్లాడి ఇందుకు అంగీకరించాలంటూ ఒత్తిడి చేయడంతో వారు బయటకు వచ్చి రూ.మూడు వేల గౌరవ వేతానికి ఒప్పుకుంటున్నామని, మిగతా రూ.మూడు వేలు రాయితీల రూపంలో ఇవ్వడానికి అంగీకరించారని ప్రకటించారు. కానీ ఆశా వర్కర్లు మాత్రం తమను సుదూర ప్రాంతాల నుంచి పిలిపించి రూ.మూడు వేలు ఇస్తామంటున్నారని, ముఖ్యమంత్రి వద్ద చప్పట్లు కొట్టాలని చెబుతున్నారని నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందు ముఖ్యమంత్రితో సమావేశానికి వర్కర్ల యూనియన్‌ నాయకులను లోపలకు అనుమతించకపోవడంతో రోడ్డుపై ఆందోళనకు దిగారు. పలువురు ఆశా వర్కర్లను లోపలకు పంపకపోవడంతో బయటే ఉండిపోయారు. 

మరిన్ని వార్తలు