చంద్రబాబు దీక్ష మోసపూరితం

23 Apr, 2018 08:26 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న వెన్నపూస గోపాల్‌రెడ్డి

అమరాపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన దీక్ష మోసపూరితమని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి అభివర్ణించారు. అమరాపురంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు డాక్టర్లను దగ్గర పెట్టుకుని ఏసీల్లో దీక్ష చేయడం రాష్ట్ర ప్రజలు గమనించారన్నారు. హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అన్న చంద్రబాబు ఇప్పుడు యూటర్న్‌ తీసుకుని మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి కపట నాటకాన్ని ప్రదర్శిస్తున్నాడన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దీక్ష చేయడానికి రూ.70కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగేళ్లుగా పోరాడుతున్నారని గుర్తు చేశారు.

జాతీయ ప్రాజెక్ట్‌ పోలవరంను తానే కడతానని రూ.16వేల కోట్ల ప్రాజెక్టును రూ.58,750 కోట్లకు పెంచి నిధులను కొల్లగొట్టి వాటితో 2019 ఎన్నికల్లో ప్రజలను ప్రలోభపెట్టడానికి పూనుకున్నాడని, దీన్ని కేంద్రం పసిగట్టి నిధులివ్వక పోవడంతో ప్రాజెక్టు పనులు ఆగిపోయాయని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన ఎమ్యెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చారని విమర్శించారు. అమరాపురంలో తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలో ఓ టీడీపీ ప్రజాప్రతినిధి స్థానిక చెరువులోని మట్టిని ఇసుకగా మార్చి బెంగళూరుకు తరలించి రూ.లక్షలు కొల్లగొడుతున్నారని ఆరోపించారు.

వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రవిశేఖర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి వాగేష్, నాయకులు యంజేరప్ప, త్రిలోక్‌నాథ్, హనుమంతరాయుడు, మారుతి, మోహన్, ఇషాక్, తిప్పేస్వామి, శ్రీనివాస్, దివాకర్, మంజునాథ్, నాగరాజు, దానేగౌడ, హిదయతుల్లా, జిల్లా విద్యార్థి విభాగం కార్యదర్శి మంజునాథ్‌ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు