‘సుప్రీం’లో కౌంటర్‌ వేద్దాం

7 Jul, 2018 02:49 IST|Sakshi
శుక్రవారం వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబు

కేంద్రం అఫిడవిట్‌ను సాకుగా చూపి ఎదురుదాడి చేయండి

మంత్రివర్గ భేటీలో సీఎం చంద్రబాబు ఆదేశం 

ప్రత్యేక పిల్‌తో ఇబ్బందేనన్న అధికారులు

సాక్షి, అమరావతి: విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుపై సుప్రీంకోర్టులో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌కు వ్యతిరేకంగా కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయడంతోపాటు ఎదురుదాడికి దిగాలని మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు సూచించారు. శుక్రవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌పై చర్చించారు. కేంద్రం అఫిడవిట్‌ దాఖలు చేసిందనే సాకుతో ఎదురుదాడిని తీవ్రతరం చేయాలని మంత్రులను సీఎం ఆదేశించారు. రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందనే అంశాన్ని మరింత గట్టిగా చెప్పే అవకాశం దీనిద్వారా వచ్చిందన్నారు. ఇక ప్రతిరోజూ ప్రెస్‌మీట్లు పెట్టి ఆరోపణలు చేయాలన్నారు.

విడివిడిగా అఫిడవిట్లపై న్యాయ సలహా
కౌంటర్‌ అఫిడవిట్‌ వేయడం వల్ల సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వాదన వినిపించే అవకాశం లభిస్తుందని మంత్రులు అభిప్రాయపడ్డారు. మొత్తంగా ఒకే అఫిడవిట్‌ దాఖలు చేయాలా? లేక ప్రతి శాఖ తరపున విడివిడిగా దాఖలు చేయాలా? అనే అంశంపైనా చర్చ జరిగింది. విడివిడిగా అఫిడవిట్లు దాఖలు చేయడం వల్ల ప్రతి అంశాన్ని క్షుణ్నంగా ప్రస్తావించే అవకాశం ఉంటుందని పలువురు మంత్రులు సూచించారు. దీనిపై న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. 

‘పిల్‌’ కంటే కౌంటర్‌ వైపే మొగ్గు
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అఫిడవిట్‌ దాఖలు చేసినా సుప్రీంకోర్టు స్వీకరించే అవకాశం ఉండదేమో అనే అనుమానాలను ఒకరిద్దరు వ్యక్తం చేయగా తెలంగాణ కాంగ్రెస్‌ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి వేసిన పిటిషన్‌లో పేర్కొన్న 9 మంది రెస్పాండెంట్లలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉన్నందున అఫిడవిట్‌ వేయడానికి ఇబ్బంది ఉండదని అధికారులు తెలిపారు. కౌంటర్‌ అఫిడవిట్‌తోపాటు విభజన హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా ‘పిల్‌’ వేస్తే బాగుంటుందనే సూచనలపై చర్చ జరగ్గా దీనివల్ల ఇబ్బంది తలెత్తుతుందని అధికారులు వివరించారు. ప్రత్యేకంగా పిల్‌ వేస్తే సుప్రీంకోర్టు వేరే రకంగా తీసుకునే అవకాశం ఉందని చెప్పగా దానిపైనా న్యాయ నిపుణులతో చర్చించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రత్యేకంగా ‘పిల్‌’ వేసే కంటే కౌంటర్‌ అఫిడవిట్‌పైనే దృష్టి పెట్టాలని చెప్పారు. 

గంటలోనే ముగిసిన సమావేశం
ప్రతిసారీ నాలుగైదు గంటలపాటు జరిగే మంత్రివర్గ సమావేశం శుక్రవారం కేవలం గంటతోనే ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్‌ వెళ్లడం కోసం హడావుడిగా సమావేశాన్ని ముగించినట్లు సమాచారం. నాలుగేళ్లలో మంత్రివర్గ సమావేశం ఇంత త్వరగా ముగియడం ఇదే తొలిసారని అధికారులు, మంత్రులు చర్చించుకున్నారు. 

హైకోర్టు సీజేని మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం చంద్రబాబు
ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్న రాధాకృష్ణన్‌ను సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం ఉదయం చంద్రబాబు సింగపూర్‌ వెళుతున్నందున సీజే ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేకపోతున్న దృష్ట్యా ముందుగానే వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. సీజేను కలిసేందుకు మంత్రివర్గ సమావేశాన్ని గంటలోగానే ముగించి హుటాహుటిన హైదరాబాద్‌ వెళ్లిన సీఎం చంద్రబాబు.. రాత్రికి తిరిగి విజయవాడకు చేరుకున్నారు. 

మరిన్ని వార్తలు