కస్సు‘బస్సు’లు

28 Mar, 2015 03:15 IST|Sakshi

 సీఎం సభకు 25 వేల మందిని తరలించాలని ఆదేశం
 రవాణా శాఖ నెత్తిన భారం
 తమ వల్ల కాదని చేతులెత్తేసిన ఆర్టీఏ అధికారులు
 తొలుత కుదరదన్న జిల్లా అధికారులు
 చివరకు ఇరిగేషన్ విభాగానికి బాధ్యత అప్పగింత
 ఆర్టీసీ బస్సుల్లో జనాన్ని తరలించాలని నిర్ణయం

 
 సాక్షి ప్రతినిధి, ఏలూరు :ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనకు జనాన్ని తరలించే వ్యవహారం అధికారులకు శిరోభారంగా పరిణమించింది. పోలవరం మండలం పట్టిసీమ వద్ద ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసేందుకు ఈనెల 29న ముఖ్యమంత్రి చంద్ర బాబు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టాలని జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు అందాయి. కనీసం 25వేల మంది జనం హాజరయ్యేలా ఏర్పాట్లు చేయాలని హుకుం జారీ అయ్యింది. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వాహనాల్లో ప్రజలను తరలించే బాధ్యతను రవాణా శాఖ తీసుకోవాలని జిల్లా అధికారులు సూచించారు. గతంలోనూ సీఎం పర్యటనలకు ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలతో మాట్లాడి ఆర్టీఏ అధికారులు  బస్సులు ఏర్పాటు చేసేవారు.
 
  అయితే ఇటీవల రవాణా శాఖ కమిషనర్ నుంచి ఆర్టీఏ అధికారులకు బస్సుల ఏర్పాటుపై స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. అనధికారికంగా ప్రైవేటు స్కూల్ బస్సులను ఎక్కడా వినియోగించవద్దని, ఆబ్లిగేషన్స్ పేరిట ఎవరైనా బస్సులను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ కమిషనర్ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఈసారికి తమను వదిలేయాలని ఆర్టీఏ అధికారులు జిల్లా  అధికారులకు మొరపెట్టుకున్నారు. జిల్లా అధికారులు తొలుత ఇందుకు ఏ మాత్రం అంగీకరించలేదని తెలిసింది. చంద్రబాబు పర్యటనకు కనీసం 400 బస్సులు కావాలని, వాటిని ఎలాగైనా రవాణా శాఖ అధికారులే సమకూర్చాలని తెగేసి చెప్పినట్టు సమాచారం.
 
 అలా చేస్తే తాము ఉన్నతాధికారుల ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించినట్టు అవుతుందని ఆర్టీఏ సంబంధీకులు శుక్రవారం జిల్లా అధికారులను కలసి మొరపెట్టుకున్నట్టు సమాచారం. ‘ఇలాగైతే ఏం చేద్దాం. సీఎం పర్యటనను రద్దు చేయిద్దామా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా అధికారులు ఎట్టకేలకు మెత్తబడి బస్సుల ఏర్పాటు బాధ్యతను నీటిపారుదల శాఖకు అప్పగించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో ఇరిగేషన్ అధికారులు ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకుని, వాటిలో జనాన్ని తరలించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
 
 బస్సులకే రూ.అర కోటి?
 గతంలో సీఎం పర్యటనలకు ఆర్టీఏ అధికారులు బస్సులు ఏర్పాటు చేసిన సందర్భాల్లో దానికి సంబంధించిన బిల్లుల మంజూరు పెద్దగా ప్రస్తావనకు వచ్చేది కాదు. ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లకు ఆర్టీఏ అధికారులతో ఉండే లాబీయింగ్ నేప థ్యంలో ఆయిల్ బిల్లులు ఇచ్చినా, ఇవ్వకపోయినా బస్సులు పంపించేవారు. కానీ ఆర్టీసీ వ్యవహారం అలా కాదు. దీంతో సుమారు 400 బస్సులకు సంబంధించిన బిల్లులను ఇరిగేషన్ అధికారులే భరించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఒక్కో బస్సుకు సుమారు రూ.10వేల నుంచి రూ.13 వేల చొప్పున మొత్తం రూ.అర కోటికిపైగానే ఖర్చవుతుందని, జనానికి భోజన ఖర్చులు మరో రూ.15 లక్షలు అవుతాయని లెక్క గట్టారట.
 
 మొత్తంగా పట్టిసీమ ఎత్తిపోతల పథకం భూమి పూజ ఖర్చు తమ శాఖ వరకు రూ.70 లక్షలు అవుతుందని ఇరిగేషన్ అధికారులు లెక్కతేల్చినట్టు సమాచారం. కాగా, జిల్లా అధికారులు ప్రైవేటు స్కూల్ బస్సుల ఏర్పాటుపై చివరి వరకు గట్టిగా పట్టుబట్టిన నేపథ్యంలో ఎందుకొచ్చిన గొడవని భావిస్తున్న ఆర్టీఏ అధికారులు కొన్ని బస్సులనైనా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. మొత్తంగా కాకపోయినా, ఆ పర్యటనకు ఉద్యోగులు రాకపోకలు సాగిచేందు వీలుగా అయినా స్కూలు బస్సులను ఏర్పాటు చేయించి జిల్లా అధికారులను ప్రసన్నం చేసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
 

మరిన్ని వార్తలు