చంద్రబాబు హ్యాండిచ్చారు

17 Mar, 2015 02:36 IST|Sakshi

 అంబికా కృష్ణ, పాందువ్వ శ్రీనుకు దక్కని ఎమ్మెల్సీ పదవులు
 ఏలూరు: జిల్లాలో అన్ని స్థానాలూ గెలిచిన టీడీపీ నాయకులకు ఎమ్మెల్సీ పదవుల కేటాయింపు విషయంలో సీఎం చంద్రబాబునాయుడు మొండిచెయ్యి చూపారు. ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాలని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సిఫార్సు చేశారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో అంబికా కృష్ణను  పోటీ నుంచి తప్పించారు. ఆ సందర్భంలో ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆయనకు ముఖ్య నాయకులు హామీ ఇచ్చారు. చివరకు ఆయ నకు పదవి కట్టబెట్టే విషయంలో రిక్తహస్తం చూపించారు. టీడీపీ సర్కారులో ఆర్యవైశ్య వర్గానికి ఒక్క కీలక పదవి లేని తరుణంలో అంబికా కృష్ణకు ఎమ్మెల్సీ పదవి ఖాయమని అందరూ భావించారు.
 
 ఆయన సైతం ఆ పదవిపై ఆశ పెట్టుకున్నారు. సీఎం చంద్రబాబు అందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకోవడంపై ఆర్యవైశ్యులు ఒకింత ఆవేదనకు గురవుతున్నారు. వైఎస్సార్ సీపీ నుంచి వైశ్య వర్గానికి చెందిన కోలగట్ల వీరభద్రరావు పేరును ఎమ్మెల్సీ పదవికి ఖరారు చేయడంతో పోటాపోటీగా అంబికా పేరు ఉంటుందని వైశ్యులంతా ఆశగా ఎదురు చూశారు. తీరా పెద్దగా పేరులేని వారికి పదవులు కట్టబెట్టడంపై ఏలూరు నియోజకవర్గ నేతలు కొంత గుర్రుగా ఉన్నారు. ఇదిలా వుండగా, జిల్లాలో పలువురు ఎమ్మెల్యేలు టీడీపీ రాష్ట్ర నాయకుడు మంతెన సత్యనారాయణరాజు(పాందువ్వ శ్రీను)కు పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు గతంలోనే విన్నవించారు. అయినా చంద్రబాబు వారి విన్నపాన్ని మన్నించలేదు. పాందువ్వ శ్రీనుకు పదవి వస్తుందనుకున్న క్షత్రియ వర్గం ఆశలు అడియాసలయ్యాయి.
 

మరిన్ని వార్తలు