నిరుద్యోగులకు చంద్రబాబు టోకరా

3 Jun, 2018 12:55 IST|Sakshi

మాచర్ల రూరల్‌: ఓట్లు, సీట్ల కోసం ఎన్నికల్లో నిరుద్యోగులకు ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానని, ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెలా రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాలుగేళ్ల తర్వాత రూ.వెయ్యి మాత్రమే ఇస్తానని చెప్పటం ఆయన మోసపూరిత నైజం మరోసారి బట్టబయలైందని వైఎస్సార్‌ సీపీ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో నిరుద్యోగులకు ఆశ చూపి ఓట్లు పొంది ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా లక్షలాది మంది నిరుద్యోగులను మోసం చేశారన్నారు.

 ఏ ఎన్నికల్లో గెలవకపోయినా తన కుమారుడు లోకేష్‌బాబును ఎమ్మెల్సీగా ఎంపిక చేసి మంత్రిగా ఉద్యోగం ఇప్పించుకున్న చంద్రబాబు లక్షలాది మంది నిరుద్యోగులకు టోకరా వేశారన్నారు. ఇప్పుడు రూ.వెయ్యి ఇస్తాననటం దారుణమని, 48 నెలలకు రూ.2 వేల చొప్పున రూ 96వేలను ప్రతి ఒక్క నిరుద్యోగికి అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇప్పటికే ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు తగిన పరిహారం అందించాలని, మ్యానిఫెస్టో హామీలను అమలుపరచాలన్నారు. నిరుద్యోగులను మోసం చేసి అధికారాన్ని అనుభవిస్తున్న టీడీపీకి నిరుద్యోగుల తల్లిదండ్రుల ఉసురు తగులుతుందని పీఆర్కే చెప్పారు.  

మరిన్ని వార్తలు