ఎస్టీలకు తెలివి ఉండదు: సీఎం

21 Jul, 2017 01:51 IST|Sakshi
ఎస్టీలకు తెలివి ఉండదు: సీఎం

కుప్పం నియోజకవర్గంలోని సభలో చంద్రబాబు వ్యాఖ్య
చిత్తూరు, సాక్షి: సీఎం చంద్రబాబు నాయుడు గిరిజనులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దళితులు, గిరిజనులంటేæ సీఎం చంద్రబాబుకు చులకన అని చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడుపల్లెలో గురువారం ఆయన అన్న మాటలే నిదర్శనమని కుల సంఘాలు విరుచుకుపడుతున్నాయి.

విమర్శలకు తావిచ్చిన సీఎం చంద్రబాబు గుడుపల్లెలో చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే..‘ ఎస్టీలు అడవుల్లో ఉంటారు. ఎక్కడెక్కడోతిరుగుతుంటారు. వారికి తెలివి ఉండదు. వారిని కూడా అభివృద్ధి చేస్తాం. పేదరికాన్ని పారదోలేందుకు యజ్ఞంలా పని చేస్తున్నా. పేదరికంలో ఉన్న వారికి ప్రత్యేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నాం. బడుగుబలహీన వర్గాల కోసం రూ. 10 వేలకోట్లు కేటాయించి అన్ని విధాలా ఆదుకుంటాం. అభివృద్ధి పనుల్లో  ఏదైనా పొరపాటు జరిగితే అది కార్యకర్తలదే. వారి అవకతవకలకు నాపై కొపం చూపొద్దు. అలా చూపితే రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోతుంది. 90 శాతం ప్రజలందరూ టీడీపీకే ఓట్లేసి మరోసారి గెలిపించండి.  దేశ చరిత్రలో నదుల అనుసంధానం చేసిన ఘనత నాదే.. గోదావరి, కృష్ణా నదులను కలిపి హంద్రీనీవా ద్వారా సెప్టెంబర్‌లోగా కుప్పం నియోజకవర్గంలోని ప్రతి చెరువుకూ నీరు అందించే బాధ్యత ప్రభుత్వానిది. పట్టిసీమ నిర్మించడం వల్లే ఇది సాధ్యం అవుతోంది. గోదావరి నీరు ప్రతి సంవత్సరం వేల క్యూసెక్కులు సముద్రంలో కలుస్తోంది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 3 వేల క్యూసెక్కుల నీరు వృథా అయ్యింది. కృష్ణలో నీరు ఈ స్థాయిలో లేదు. పెద్ద వర్షాలు వస్తేనే కృష్ణపై నిర్మించిన డ్యాంలు నిండుతాయి.

దీంతో కరువు పరిస్థితుల్లో నీటికి కటకట ఏర్పడుతోంది. దీన్ని మార్చాంటే వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవాలి. పంట కుంటలు, చెక్‌డ్యాంలు నిర్మించి ప్రతి బొట్టూ భూమిలో ఇంకిపోయేలా చూస్తే.. చేను కిందే చెరువు ఉంటుంది. దీంతో పాటు ప్రతి మహిళకూ నెలకు రూ.10 వేల ఆదాయం వచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందు కోసం కంపోస్టు యార్డులు, తదితర పనులు అçప్పజెప్పుతున్నాం. కరువులో రైతులు ఇబ్బందులు పడకుండా.. వారి ఆదాయం పడిపోకుండా పచ్చగడ్డి, గడ్డి విత్తనాలు 50 శాతం సబ్సిడీతో పంపిణీ చేస్తున్నాం. డ్వాక్రా మహిళలు ఉత్పత్తి చేసిన వస్తువులకు మంచి గిరాకీ ఉండేలా వారికి మార్కెటింగ్‌ మెళకువలు నేర్పిస్తాం. పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే మహిళలకు చేయూతనిస్తాం’ అని సీఎం పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు