ఇంటికో మిద్యోగం

31 May, 2015 23:36 IST|Sakshi

‘ఇంటికో ఉద్యోగం’ హామీతో బాబు మోసం
అధికారానికొచ్చాక ఉద్యోగాల నుంచి ఊస్టింగ్
ఏ శాఖలోనూ ఒక్క పోస్టయినా భర్తీ కాలేదు
నిరుద్యోగ భృతి ఊసెత్తని ప్రభుత్వం

 
 అధికారం కావాలంటే ఓట్లు కురవాలి. ఉత్తుత్తి హామీలతో ఊదరగొట్టాలి. చంద్రబాబు అదే చేశారు. ఊరూవాడా తిరిగారు. ఇంటికో ఉద్యోగం.. రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. నిరుద్యోగుల్ని, యువకుల్ని బుట్టలో వేసుకున్నారు. ఇంకేముంది.. ఓట్ల వాన కురిసింది. అధికార దండం అందింది. మర్నాటి నుంచే ఉద్యోగాలు ఊడటం మొదలైంది. ప్రభుత్వోద్యోగాల భర్తీ హామీ బుట్టదాఖలైంది. ఖాళీలు పెరుగుతున్నా నియామకాల మాటే మరిచిపోయింది.

వేలాదిమంది ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందికి ఎనిమిది నెలలుగా జీతాలివ్వడం మానేసింది. బాబు హామీల చిట్టా పల్లెల్లో ఇప్పటికీ గోడలపై దర్శనమిస్తుంది. ఓట్లేసి దారుణంగా మోసపోయిన అమాయక యువతను వెక్కిరిస్తోంది. బురిడీ బాబు మాయాజాలానికి బలైపోయామని నిరుద్యోగ యువత రోదిస్తోంది. నిరుద్యోగ భృతి అయినా వస్తుందని ఆశించిన పేద యువత ఆశ అడియాశలైంది. అయిదేళ్ల వరకూ ఎవరేమీ చేయలేరన్న దీమాతో చంద్రబాబు అండ్ పార్టీ అధికారాన్ని ఆనందంగా అనుభవిస్తోంది.
 
 సాక్షి, విశాఖపట్నం : ‘రేవు దాటే వరకు ఓడ మల్లన్న..రేవు దాటాక బోడి మల్లన్న’ అన్న చందంగా ఉంది అధికార టీడీపీ నేతలు తీరు. గడిచిన ఎన్నికల్లో తామిచ్చిన శుష్కవాగ్దానాలకు ఓట్లు కుమ్మరించిన వర్గాలను నేడు విస్మరించారు. గద్దెనెక్కి ఏడాది గడిచినా ఆ హామీల ఊసెత్తడం లేదు.  బురిడీ ‘బాబు’ మాయమాటలకు బలైపోయామంటూ నిరుద్యోగులు,యువత ఇప్పుడు లబో దిబో మంటున్నారు.

 వారి పొట్ట కొట్టారు.
 జిల్లాలో వ్యవసాయశాఖలో 1750 మంది ఆదర్శ రైతులను, హౌసింగ్ శాఖలో 97 మంది వర్కుఇన్‌స్పెక్టర్లు, ఉపాధి హామీలో సామాజిక తనిఖీల పేరుతో ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్స్, కమ్యూనిటీ ఆర్గనైజర్స్ కలిపి సుమారు 296 మందిని తొలగించారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో వివిధ ఆలయాల్లో పనిచేసే పదిమంది పూజారులను కూడా సాగనంపారు. ఇక జిల్లాలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న సుమారు 12 వేల మంది అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల్లో సుమారు ఐదారువేల మందికి ఆర్థిక లోటు సాకుతో ఎనిమిది నెలలుగా జీతాలివ్వకపోడంతో వారంతా పస్తులతో అలమటిస్తున్నారు.

 నిరుద్యోగులు ఐదు లక్షలపై మాటే..
 జిల్లాలో ఉన్న 35 ఇంజినీరింగ్ కళాశాలల్లో 25వేల మంది ఇంజినీరింగ్ పట్టాలతో బయట కొస్తున్నారు. ఇక పాలిటెక్నిక్, ఐటీఐల నుంచి మరో 30వేల మంది, డిగ్రీ కళాశాలల నుంచి 25వేల మంది, పీజీ కళాశాలల నుంచి 10వేల మంది, బీఈడీలు 10వేలమంది, నర్సింగ్, ఫార్మసీ కళాశాల ద్వారా 10వేల మంది చొప్పున ఇలా ప్రతి ఏటా పట్టాలతో బయటకొస్తున్న వారి సంఖ్య జిల్లాలో అక్షరాల లక్షన్నర పైమాటే. వీరిలో చదువుతున్న సమయంలో, బయట కొచ్చిన వెంటనే వివిధ కార్పొరేట్, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు పొందే వారి సంఖ్య 20 శాతం లోపే. అంటే కనీసంగా జిల్లాలో 1.30 లక్షల మంది ప్రతి ఏటా నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంది. ఈ లెక్కన గత ఐదేళ్లు గణాంకాలు చూసినా ఐదారు లక్షల పైమాటే.
 
 సర్వేలో లెక్కతేలింది... 2.60లక్షల మంది గతేడాది జన్మభూమి మావూరులో నిర్వహించిన సర్వే ప్రకారం
 జిల్లాలో ఇంజినీరింగ్, పీజీ, ఐటీఐ, డిప్లమో,గ్రాడ్యుయేట్స్ విభాగాల్లో 1,05,995 మంది ఉన్నారు. వీరిలో మహిళలు 65.050 మంది, పురుషులు 40,945 మంది ఉన్నారు. ఇక స్కిల్డ్ అప్‌గ్రడేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు మరో 1,55,898 మంది ఉన్నారు. కాగా జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్‌లో ఉద్యోగాల కోసం నమోదు చేయించుకున్న వారి సంఖ్య అక్షరాల లక్షా 2వేల మంది. వీరిలో నాన్ టెక్నికల్ 65వేల మందికాగా, టెక్నికల్ 37వేల మంది ఉన్నారు. ఈ గణాంకాలు చాలు జిల్లాలో నిరుద్యోగుల సంఖ్య ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు. వీరంతా బాబు వస్తే జాబు వస్తుందని ఎంతో ఆశపడ్డారు. కానీ అధికారం చేపట్టి ఏడాది ఇక నిరుద్యోగ భృతి ఊసే ఎత్తడం లేదు..  
 
 ఆదర్శ రైతుల నోట మట్టి కొట్టారు
 ఆదర్శ రైతులను వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు నియామకం చేపట్టారు. అప్పటి నుంచి సుమారు ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్నాం. టీడీపీ అధికారంలోకి రాగానే ఆదర్శరైతుల వ్యవస్థ రద్దు  చేశారు. ఎటువంటి సమాచారం లేకుండా రద్దు చేయడం వల్ల ఇబ్బందుల పడుతున్నాం. నాలుగు నెలల జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. కనీసం అవి కూడా చెల్లించకుండా మోసం చేశారు.
 -అనిశెట్టి వెంకట సూరి, మాజీ ఆదర్శరైతు, పాల్తేరు, పాయకరావుపేట మండలం
 
 నిరుద్యోగులకు ఆశలు కల్పించారు..
 నేను డిగ్రీ చదువుకుని నిరుద్యోగిగా ఉన్నాను. ఎన్నికల ముందు నిరుద్యోగులు ఉద్దరిస్తామంటూ ప్రకటనలు చేసిన చంద్ర బాబు మా ఊసే పట్టించుకోలేదు. రూ.రెండు వేలు నిరుద్యోగ భృతి కల్పిస్తామన్నారు. ఆ విషయమూ పట్టించుకోవడం లేదు.
 -గోనెల సత్తిబాబు, పాల్తేరు, పాయకరావుపేట మండలం.
 
 నిరుద్యోగ భృతి ఏది!
 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. ఎంతో సంతోషపడ్డాం. గెలిచాక హామీని తుంగలోకి తొక్కి నిరుద్యోగులను పట్టించుకోనేలేదు. భృతిగా రూ.2 వేలు ఇస్తామన్నారు. ఇపుడేమో ఆ వూసేలేదు. సరికదా ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారు. ఆంతా చంద్ర మాయ.
 -పైల నాని, నిరుద్యోగి, కె.వెంకటాపురం, కోటవురట్ల
 
 బాబు వచ్చారు జాబు గోవిందా
 బాబు వస్తే జాబు వస్తుందంటూ ప్రచారం ఊదరగొట్టారు. నిరుద్యోగులతో పాటు మేము నమ్మాం. మా ఆదర్శరైతులను ఆదుకుంటారనుకున్నాం. కానీ అన్యాయంగా మా ఉద్యోగాలు లాగేసుకుని మమ్మల్ని రో డ్డున పడేశారు. మాలాంటి వాళ్లు ఎందరో చంద్రబాబు మాయలో మోసపోయాం.
 - సోమేశ్వర్రావు, ఆదర్శరైతు,రాజుపేట, కోటవురట్ల
 
 బూటకపు హామీలతో మోసం చేశారు
 బూటకపు హామీలతో నిరుద్యోగులను మోసం చేశారు. అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చి సుమారు రెండేళ్లు కావస్తున్నా నిరుద్యోగుల ఊసే లేదు. కనీసం నిరుద్యోగుల కోసం చంద్రబాబు ప్రభుత్వం చేసిందేమీ లేదు. అంతా మాసమే.
 -  పోతల సత్తిబాబు, వైస్ సర్పంచ్, ఆక్సాహేబుపేట, కోటవురట్ల
 
 నిరాశ మిగిల్చారు..
 వైఎస్ ప్రభుత్వంలో అవుట్ సోర్సింగ్‌లో 2004 లో ఆదర్శరైతుగా తీసుకున్నారు. ఏదో రోజు  జీతాలు పెరుగుతాయని, ఇచ్చిన వేయి రూపాయిలకే  రైతులుకు సేవలందిమంచాను. బాబు ప్రభుత్వం వచ్చిన వెంటనే మమ్మల్ని తొలగించారు. ప్రస్తుతం వ్యవసాయ కూలీగా పని చేయక తప్పలేదు.
 -కె. సత్యనారాయణ, ఆదర్శ రైతు, గరుకుబిల్లి, కె. కోటపాడు మండలం
 
 నిరాశ మిగిల్చారు..
 వైఎస్ ప్రభుత్వంలో అవుట్ సోర్సింగ్‌లో 2004 లో ఆదర్శరైతుగా తీసుకున్నారు. ఏదో రోజు  జీతాలు పెరుగుతాయని, ఇచ్చిన వేయి రూపాయిలకే  రైతులుకు సేవలందిమంచాను. బాబు ప్రభుత్వం వచ్చిన వెంటనే మమ్మల్ని తొలగించారు. ప్రస్తుతం వ్యవసాయ కూలీగా పని చేయక తప్పలేదు.
 -కె. సత్యనారాయణ, ఆదర్శ రైతు, గరుకుబిల్లి, కె. కోటపాడు మండలం
 
 ఉద్యోగాలేవీ...
 మాది రావికమతం మండలం కొత్తకోట గ్రామం. నేను ఎంకాం, బీఈడీ చదివాను. నాలుగేళ్లుగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాను. గత ఎన్నికల్లో జాబుకావాలంటే బాబు రావాలని నినాదం చేయడంతో ఎంతో ఆశపడ్డాను. కానీ బాబు వచ్చి ఏడాది అయినా ఉద్యోగాల ఊసే ఎత్తడం లేదు.  
  -గట్టా సత్తిబాబు, ఎం.కాం,బీఈడీ,కొత్తకోట
 
 ఉన్న ఉపాధినీ ఊడగొట్టారు..
  ఎన్నికల ముందు బాబువస్తే జాబు వస్తాదని చెప్పి, అధికారం రాగానే ఉన్న  ఉద్యోగాలు తొలగించడం దారుణం. కొత్తగా ఉపాధి అవకాశాలు కల్పించకపోగా ఉన్న చిన్నపాటి ఉపాధినీ తొలగించడం అన్యాయం. పార్ట్‌టైం పని చేసుకుంటూ కుటుంబ పోషణ చేసుకునే ఉద్యోగులకే రక్షణ కల్పించలేకపోతే ప్రభుత్వం ఎవరికి మేలు చేస్తుంది.
 - పి.శ్రీనివాసరావు, ఆదర్శరైతు, కొరుప్రోలు (ఎస్.రాయవరం మండలం)
 
 నమ్మి మోసపోయాం
 ఆదర్శ రైతులుగా పని చేసినంత కాలం రెండు వేల రూపాయల గౌరవ వేతనం తీసుకునేవాడిని. రోజులో కొంత సమయం కేటాయించి రైతులకు సూచనలు సలహాలు ఇచ్చేవాడిని. బాబు వస్తే జాబు వస్తాదని చేసిన ప్రచారం మా లాంటి వారిపై ఎక్కువ ప్రభావం చూపింది. నమ్మి ఓటు వేశాం. కానీ బాబు మా ఆశలకు గండి కొట్టారు.
 - కె.రమణ, ఆదర్శరైతు, చినఉప్పలం (ఎస్.రాయవరం మండలం)

మరిన్ని వార్తలు