స్వర్ణాల చెరువుకు గోదావరిని తెస్తా

14 Oct, 2016 04:33 IST|Sakshi
స్వర్ణాల చెరువుకు గోదావరిని తెస్తా

అసాధ్యం అంటున్న పనిని సుసాధ్యం చేస్తా: సీఎం
 నెల్లూరులో రొట్టెల పండుగలో పాల్గొన్న చంద్రబాబు

 
 సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘‘గోదావరి నీటిని నెల్లూరు స్వర్ణాల చెరువుకు మళ్లిస్తా. అందరూ అసాధ్యం అంటున్న ఈ పనిని సాధ్యం చేసి చూపిస్తా’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం సాయంత్రం ఇక్కడి బారాషహీద్ దర్గాలో సీఎం ప్రార్థనలు జరిపారు. అనంతరం రొట్టెల పండుగలో పాల్గొన్నారు. మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర అభివృద్ధి రొట్టెను ఆయన అందుకున్నారు.
 
 ఈ సందర్భంగా స్వర్ణాల చెరువు వద్ద జరిగిన సభలో మాట్లాడారు. గోదావరి నీటిని పెన్నా నదికి అనుసంధానం చేసి సోమశిల రిజర్వాయర్ ద్వారా స్వర్ణాల చెరువుకు నీరు తెస్తానని చెప్పారు. సోమశిల, కండలేరు రిజర్వాయర్లలో 150 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. రూ.350 కోట్లతో నిర్మిస్తున్న పెన్నా-సంగం బ్యారేజీ నిర్మాణాన్ని మార్చిలోగా పూర్తి చేయిస్తానన్నారు. బకింగ్‌హాం కెనాల్‌ను పునరుద్ధరించి జలరవాణాకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.
 
 ప్రజలంతా నాకు సహకరించాలి..
 రాష్ట్రం అభివృద్ధికోసం తానొక్కడినే కష్టపడుతున్నానని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు శ్రమిస్తున్నానన్నారు. ప్రజలంతా తనకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అభివృద్ధికోసం అందరూ రొట్టెలు పట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, రైతు, డ్వాక్రా రుణమాఫీలతోపాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. డ్వాక్రా మహిళల రుణమాఫీలో భాగంగా ఒక్కొక్కరికీ రూ.3 వేల చొప్పున ఇవ్వడానికి బుధవారం సంతకం చేశానని, ఈ నిధులను డ్వాక్రా మహిళలు వాడుకోవచ్చని ఆయన అన్నారు.

మరిన్ని వార్తలు