సీఎం పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

2 Oct, 2014 01:39 IST|Sakshi
సీఎం పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

అనపర్తి: టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని ఈ నెల 4న అనపర్తిలో సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లపై కలెక్టర్ నీతూప్రసాద్ బుధవారం అనపర్తి పంచాయతీ కార్యాలయంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమక్షంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. స్థానిక దేవీచౌక్ సెంటరులో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభా వేదిక వద్ద, సీఎం పర్యటనలో వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. అలాగే పారిశుధ్య పనులు వేగవంతం చేయాలన్నారు.
 
 వ్యవసాయ శాఖ, పశు సంవర్ధక శాఖలతో పాటు వివిధ శాఖలు ఏర్పాటు చేయనున్న ఎగ్జిబిషన్‌కు సంబంధించిన  అంశాలపై ఆయా శాఖల అధికారులను ఆరా తీశారు. సీఎం మాట్లాడనున్న సభా వేదిక స్థలాన్ని, జీబీఆర్ విద్యా సంస్థ క్రీడా మైదానంలో ఏర్పాటు చేయనున్న హెలిపాడ్‌ను ఎమ్మెల్యేలతో కలసి కలెక్టర్ పరిశీలించారు. అనపర్తి మండలం పొలమూరుకు బదులుగా పీరా రామచంద్రపురంలో ఎన్‌టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని సీఎంతో ప్రారంభింపజేయాలని ఎమ్మెల్యే, కలెక్టర్ నిర్ణయించారు. పీరా రామచంద్రపురంలో ఏర్పాటు చేయనున్న వాటర్ ప్లాంట్ స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు.
 
 4న మధ్యాహ్నం 2.30 గంటలకు
 సీఎం అనపర్తి రాక
 ఈ నెల 4వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం అనపర్తి చేరుకుంటారని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆ రోజు తొలుత మండపేట నియోజకవర్గంలోని అంగరలో జరిగే కార్యక్రమంలో సీఎం పాల్గొని అనంతరం అనపర్తి వస్తారన్నారు. జెడ్పీటీసీ కర్రి ధర్మారెడ్డి (దొరబాబు), టీడీపీ సీనియర్ నాయకులు సత్తి దేవదానరెడ్డి, సిరసపల్లి నాగేశ్వరరావు, కర్రి వెంకటరామారెడ్డి, దత్తుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు.  
 
 అంగరలో సీఎం పర్యటన స్థలాల పరిశీలన
 అంగర (కపిలేశ్వరపురం): ఈ నెల 4న సీఎం చంద్రబాబు నాయుడు కపిలేశ్వరపురం మండలంలోని అంగరలో పర్యటించే స్థలాలను బుధవారం కలెక్టర్ నీతూ ప్రసాద్ పరిశీలించారు. మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కలసి హెలీప్యాడ్, బహిరంగ సభ, పథకాలను ప్రారంభించే ప్రదేశాలను చూశారు. హెలీప్యాడ్‌కోసం అంగర, పడమర ఖండ్రిక గ్రామాల్లోని రైస్‌మిల్లు, పాఠశాలల స్థలాలను పరిశీలించి జెడ్పీ ఉన్నత పాఠశాల వెనుక ఉన్న ఖాలీ స్థలం అనువైనదిగా నిర్ణయించారు. సీఎం గ్రామంలోకి రాగా పాత వాటర్ ట్యాంకు సమీపంలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథ కంలో భాగంగా వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించేలా, అనంతరం ఊర చెరువు సమీపంలోని ఖాళీ స్థలంలో బహిరంగ సభ నిర్వహించేలా నిర్ణయించారు. తొలుత ఎమ్మెల్యే వేగుళ్ల, ఏజేసీ మార్కండేయులు, హౌసింగ్ పీడీ సెల్వరాజ్, హ్యేండ్‌లూమ్ శాఖ ఏడీ సీహెచ్ లక్ష్మణ రావు, ఇన్‌చార్జి డీఎం అండ్ హెచ్‌వో పవన్‌కుమార్, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్‌ఈ సదానంద, ఆర్డీవో సుబ్బారావు, పశు సంవర్థక శాఖ ఏడీ రామకోటేశ్వరరావు, డీఎల్‌పీవో కె.చంద్రశేఖర్‌రావు, రామచంద్రపురం డీఎస్పీ రవీంద్రనాథ్‌తో సీఎం పర్యటనపై కలెక్టరు చర్చించారు.  
 
 పటిష్ట ఏర్పాట్లు చేయాలి
 కాకినాడ సిటీ: సీఎం చంద్రబాబునాయుడు పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్‌నీతూ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి కలెక్టరేట్‌లో వివిధశాఖల అధికారులతో సమీక్ష జరిపారు. ఈ నెల 4న ఉదయం 10.20 గంటలకు విమానంలో సీఎం రాజమండ్రి చేరుకుని అక్కడి నుంచి హెలిక్టాపర్‌లో 11 గంటలకు కపిలేశ్వరపురం మండలం అంగర ఉన్నత పాఠశాల హెలిప్యాడ్‌కు చేరుకుంటారన్నారు. అక్కడ సభావేదిక వద్దకు చేరుకుని ఆరోగ్య శిబిరాలను సందర్శించిన అనంతరం ఐదు ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటారన్నారు. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం అనపర్తి చేరుకుని ఐదు ప్రచార అంశాలపై ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ముత్యాలరాజు, అదనపు జేసి మార్కండేయులు, డీఆర్వో యాదగిరి పాల్గొన్నారు.
 
 సదరమ్ వివరాలు ఆన్‌లైన్‌లో
 ఎన్టీఆర్ భరోసా పథకం కింద వికలాంగులకు రూ.1500 వంతున పింఛన్లు అందించనున్న నేపథ్యంలో జిల్లాలో సదరమ్ సర్టిఫికెట్లు జారీ చేసిన వికలాంగుల వివరాలను బుధవారం రాత్రికే పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని డీఆర్ డీఏ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వారం రోజులుగా రాష్ట్రంలో ఏ జిల్లాలోను చేయని విధంగా ప్రత్యేక మెడికల్ బోర్డులు ఏర్పాటు చేసి సుమారు 10వేల మంది వికలాంగులను సదరమ్ సర్టిఫికెట్ల జారీకి పరీక్షించామన్నారు.
 

మరిన్ని వార్తలు