పరి'శ్రమేనా'..?

20 Feb, 2018 14:11 IST|Sakshi
టెక్కలిలో మూతపడిన ఫెర్రోఅల్లోయిస్‌ పరిశ్రమ

టీడీపీ సర్కారు తీరే కారణం

మూడున్నరేళ్లలో మూతపడినవి రెండొందలకు పైమాటే!

కాన్‌కాస్ట్‌ సహా 14 పెద్ద పరిశ్రమల్లో నిలిచిన ఉత్పత్తి

ప్రభుత్వ ఆదరణ కరువై చిన్న పరిశ్రమల విలవిల

రోడ్డున పడుతున్న కార్మికుల కుటుంబాలు

కొత్త పరిశ్రమలు ప్రకటనలకే పరిమితం

వైజాగ్‌ భాగస్వామ్య సదస్సులతో ఒరిగింది శూన్యమే

విస్తరణ యూనిట్‌లనే కొత్తపరిశ్రమలుగా చిత్రీకరణ

సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: జిల్లా రైతాంగానికి అండగా ఓ వెలుగు వెలిగిన ఆమదాలవలస సహకార చక్కెర కర్మాగారానికి మూతవేసి రూ.6.20 కోట్లకు ప్రైవేట్‌పరం చేసేసిందీ ఒకప్పటి టీడీపీ ప్రభుత్వమే. రెండోసారి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ అదే ప్రైవేట్‌ సంస్థకు రూ.22 కోట్ల ప్రజాధనం చెల్లించి వెనక్కు తీసుకొన్నా పరిశ్రమను పునఃప్రారంభించలేదు. కోట్లాది విలువైన 75 ఎకరాల భూములను ‘పారిశ్రామిక అవసరాల’ ముసుగులో ఏపీఐఐసీకి బదలాయించేశారు. 2014 ఎన్నికల సమయంలో ఆమదాలవలస చక్కెర పరిశ్రమను పునఃప్రారంభిస్తామని చంద్రబాబు, కూన రవికుమార్‌ సహా టీడీపీ నాయకులు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. జిల్లాకు కొత్త పరిశ్రమల రాకపోయినా ప్రభుత్వం నిరాదరణ ఫలితంగా పాత పరిశ్రమలు సైతం మూతపడుతున్నాయి. ఆమదాలవలస పరిసరాల్లోని కాన్‌కాస్ట్‌ ఐఎన్‌సీ ప్రైవేట్‌ లిమిటెడ్, వెంకటబాలాజీ జూట్‌ మిల్లు కూడా మూతపడ్డాయి. దీంతో సుమారు వెయ్యి మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఇక ఆ పరిసరాల్లో చొప్పుకోదగిన పెద్ద పరిశ్రమలు మరేవీ లేవు. ఆమదాలవలసలో 19 ఎకరాల విస్తీర్ణంలోనున్న ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో పరిస్థితి కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కటే అన్నట్లుగా ఉంది. ఇక్కడ చిన్నపాటి మూడు వాటర్‌ ప్లాంట్‌లు, పశుదాణా పరిశ్రమ మాత్రమే ఉన్నాయి. మిగిలిన స్థలాన్ని స్క్రాప్‌ వ్యాపారులు ఆక్రమించుకుంటున్నారు.

మంత్రి అచ్చెన్న ఇలాకాలో చీకట్లే...
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలోనూ చీకట్లు కమ్ముకున్నాయి. ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే రావివలసలోని మెట్‌కోర్‌ ఫెర్రోఅల్లాయిస్‌ కంపెనీ మూతపడింది. సుమారు 300 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. సంతబొమ్మాళి మండలంలో ఏపీఐఐసీకి 3,333 ఎకరాల భూమిని ప్రభుత్వం గతంలో అప్పగించింది. దీనిలో 2,050 ఎకరాలను ఈస్టుకోస్టు థర్మల్‌ విద్యుత్తు ప్లాంటుకు ఏపీఐఐసీ కేటాయించింది. ఇది 40 శాతం సివిల్‌ పనులు జరిగినా 2016 జనవరి నుంచి నిలిచిపోయాయి. ఈ సంస్థను ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు ఏపీజెన్‌కో పరిధిలోకి తెచ్చేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నించినా అధికారుల అభ్యంతరంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. దీని పరిసరాల్లో ఇంకా 51,50,616 చదరపు మీటర్ల స్థలం పారిశ్రామిక అవసరాలకు అందుబాటులో ఉన్నా మరే ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదు.

‘కళా’ మంత్రిగా ఉన్నా అంతే...
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న కిమిడి కళావెంకటరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎచ్చెర్ల నియోజకవర్గంలో, అలాగే సొంత ప్రాంతమైన రాజాం నియోజకవర్గంలో పారిశ్రామికీకరణ ఒక్క పైడిభీమవరం పారిశ్రామికవాడలో మినహా మరెక్కడా ముందుకుసాగట్లేదు. చివరకు రణస్థలంలో ఆయన కుమారుడికి ప్రభుత్వం కేటాయించిన భూమిలో కూడా ఇప్పటివరకూ పరిశ్రమ నిర్మాణ పనులు ప్రారంభంకాలేదు. ఒక్క రాజాం ప్రాంతంలోనే నాలుగు జూట్‌మిల్లులు, వాసవి సిమెంట్‌ కంపెనీ, సరితా స్టీల్‌ పరిశ్రమ, సరిత సింథటిక్‌ పరిశ్రమ, సైకిల్‌ రిమ్‌లు తయారీ పరిశ్రమ వాసవి రిమ్స్‌ మూతపడ్డాయి. పొందూరు మండలంలో మరో రెండు జూట్‌ మిల్లులు మూతపడ్డాయి. రణస్థలం మండలంలోని స్వర్ణాంధ్ర జూట్‌మిల్లు కూడా ఈ రెండేళ్ల కాలంలోనే మూతపడింది. ఒకప్పుడు రాజాం పరిసరాల్లోనే 29 వరకు పరిశ్రమలు పనిచేసేవి. ఇప్పుడు ఏడు మాత్రమే నడుస్తున్నాయి. దీంతో సుమారు 5 వేల మంది కార్మికులు వీధినపడ్డారు. రేగిడి మండలంలో రెండు జ్యూట్‌మిల్లులు, ఫ్యారీస్‌ చక్కెర కర్మాగారంతోపాటు కేవీఆర్‌ పేపర్‌మిల్లులు కూడా నష్టాలతోనే నడుస్తున్నాయి.

పలాస పారిశ్రామికవాడలోనూ అంతంతే...
పలాస పరిసర ప్రాంతంలో జీడిపరిశ్రమలు 250 వరకూ ఉన్నాయి. పలాస పారిశ్రామిక ప్రాంతంలో 40 పరిశ్రమలు ఉన్నాయి. గతంలో ఈ పరిశ్రమలకు 32 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. రామకృష్ణా్ణపురం వద్ద పారిశ్రామికవాడకు 50 ఎకరాలు కేటాయింపు ప్రక్రియ కొలిక్కిరాలేదు. ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమల మౌలిక వసతుల కల్పనాసంస్థ (ఏపీఐఐసీ)కి జిల్లాలో వివిధ ప్రాంతాల్లోనున్న పారిశ్రామికవాడల్లో 785 ఎకరాల భూమి ఖాళీగానే ఉంది. ల్యాండ్‌ బ్యాంకులో 3,708.29 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. ఇవిగాక వివిధ పారిశ్రామిక అవసరాల పేరుతో మిళియాపుట్టిలో 40 ఎకరాలు, సీతంపేటలో 15 ఎకరాలు, కంచిలిలో 42 ఎకరాలు, రణస్థలంలో 60 ఎకరాలు సేకరించడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. కానీ వాటిలో ఎక్కడా కొత్త పరిశ్రమలు ఏర్పాటుకాలేదు.

ప్రభుత్వ విధానాలే గుదిబండ...
ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహకాలు, ఆదరణ కొరవడటంతో జిల్లాలో గత మూడేళ్ల కాలంలో రెండొందలకు పైగా పరిశ్రమలు మూతపడ్డాయి. రాయితీలు కల్పించడానికీ పలు ఆంక్షలు విధించడం, అలాగే మార్కెట్‌ ఎగుడుదిగుడుల వల్ల నష్టాలపాలైన పరిశ్రమలను ఆదుకోవడానికి నిర్దిష్టమైన విధానం లేకపోవడం కూడా ఇందుకు కారణాలే. విశాఖలో ఏటా నిర్వహిస్తోన్న భాగస్వామ్య సదస్సుల ద్వారా జిల్లాకు పెద్దగా పరిశ్రమలు వస్తాయని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. చివరకు గత రెండు సదస్సుల్లో 16 యూనిట్లు వస్తాయని చెప్పగా, వాటిలో కేవలం ఐదు యూనిట్లు మాత్రమే గ్రౌండ్‌ అయ్యాయి. కానీ వాటిలో మూడు యూనిట్లు ఇప్పటికే జిల్లాలో ఉన్న పరిశ్రమల విస్తరణ ప్రాజెక్టులు కావడం గమనార్హం. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ మూడు విస్తరణ ప్రాజెక్టులు, యునైటెడ్‌ బేవరీస్‌ ఎక్స్‌టెన్షన్‌ యూనిట్‌ ఇందులో ఉన్నాయి. మిగతావన్నీ ప్రతిపాదన దశల్లోనే మిగిలిపోయాయి. అలాగే ఇప్పటికే పనులు నిలిచిపోయిన ఈస్ట్‌కోస్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, మూతపడిన ట్రైమేక్స్‌ సాండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలను కూడా కొత్తగా వస్తున్న పరిశ్రమల జాబితాలో చూపించడం గమనార్హం.

మరిన్ని వార్తలు