డబ్బులిస్తే సకాలంలో పోలవరం

14 Jul, 2018 03:00 IST|Sakshi
జాతీయ రహదారుల ప్రాజెక్టు పనులకు రిమోట్‌తో శంకుస్థాపన చేస్తున్న నితిన్‌ గడ్కరీ, చంద్రబాబు

     గడ్కరీకి సీఎం చంద్రబాబు అభ్యర్థన

     విశాఖ నుంచి రూ.6,688 కోట్ల కేంద్ర పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

సాక్షి, విశాఖపట్నం: విభజన తర్వాత రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందని, సాయం చేయమని కేంద్రాన్ని అర్థిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. డబ్బులిస్తే పోలవరం ప్రాజెక్టు పనులను సకాలంలో పూర్తి చేస్తామన్నారు. విభజన హామీలు నెరవేర్చడంతో పాటు కేంద్రం తగినన్ని నిధులిస్తే వచ్చే 10–12 ఏళ్లలో ఇతర రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందుతామన్నారు.

విశాఖ ఏయూ కన్వెన్షన్‌ హాలు నుంచి శుక్రవారం  రూ.6,688 కోట్ల విలువైన ఏడు జాతీయ రహదారుల ప్రాజెక్టు పనులకు కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో కలసి శంకుస్థాపన, జాతికి అంకితం చేసే కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు పనుల్లో అవినీతి జరగలేదని రికార్డులన్నీ వచ్చే సోమవారం అధికారులతో ఢిల్లీకి పంపిస్తానని చెప్పారు. అవసరమైతే తాను కూడా ఢిల్లీ వస్తానన్నారు. కేంద్రం నిధులిస్తే వచ్చే ఏడాది మే కల్లా పోలవరం సివిల్‌ వర్కులు పూర్తిచేస్తామన్నారు.  

వాజ్‌పేయికి రోడ్లు వేయమని నేనే చెప్పా..
‘1978లో నేను మలేసియా వెళ్లాను. ఆ దేశంలో ఆరు, ఎనిమిది లేన్ల రోడ్లున్నాయి. రెండు కోట్ల జనాభా ఉన్న మలేసియాలోనే విశాలమైన రోడ్లు వేసుకుంటే భారత్‌లో నాలుగు వరసల రోడ్లు వేస్తే దేశం అభివృద్ధి చెందుతుందని వాజ్‌పేయికి చెప్పా. దీంతో ఆయన చెన్నై–నెల్లూరు నాలుగు లేన్ల రోడ్డుకు శ్రీకారం చుట్టారు’ అని సీఎం చెప్పుకున్నారు. 

సివిల్‌ పనులు ఫిబ్రవరికే పూర్తి చేయండి: గడ్కరీ
అనంతరం.. కేంద్రమంతి నితిన్‌ గడ్కరీ మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు సివిల్‌ పనులను ఫిబ్రవరి లోగా పూర్తి చేయాలని చంద్రబాబుకు స్పష్టం చేశారు. కేంద్రం అన్ని విధాలా సహకరిస్తూనే ఉందన్నారు. ఎన్నికల్లో ఎవరి రాజకీయాలు వారివని.. కానీ, అభివృద్ధిలో వాటిని తీసుకురావడం సరికాదన్నారు. కాగా, కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఏర్పడ్డ ఘర్షణ వాతావరణం కొద్దిసేపు ఉద్రిక్తతకు దారితీసింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు