ఏం తమాషా చేస్తున్నారా.. బీ కేర్‌ఫుల్‌

7 Dec, 2018 01:56 IST|Sakshi

న్యాయం చేయాలన్న డీఎస్సీ అభ్యర్థులకు సీఎం హెచ్చరిక

సాక్షి, తిరుపతి: ‘ఏం తమాషా చేస్తున్నారా.. బీ కేర్‌ఫుల్‌’ అంటూ డీఎస్సీ అభ్యర్థులను సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. వెయ్యి రూపాయల నిరుద్యోగ భృతి తీసుకుంటున్నారు గా.. అంటూ వెటకారమాడారు. ఎన్నికల హామీ మేరకు న్యాయం చేయాలని కోరినందుకు.. వారిపై చంద్రబాబు వీరంగమేశారు. తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ మైదానంలో గురువారం ‘పేదరికంపై గెలుపు’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగిం చారు. ఇదే సమయంలో డీఎస్సీ అభ్యర్థులు ఒక్కసారిగా వేదిక ముందుకు చేరుకుని ప్లకార్డులతో నిరసన తెలిపారు. ‘ఉయ్‌ వాంట్‌ జస్టిస్‌’ అంటూ సభా ప్రాంగణం మార్మోగేలా నినాదాలు చేశారు. ‘బాబొస్తే జాబొస్తుందన్నావ్‌. అదే నమ్మకంతో నిన్ను గెలిపించాం. అధికారంలోకి వచ్చావ్‌. నీ కొడుక్కి ఉద్యోగం ఇప్పించావ్‌. మమ్మల్ని మాత్రం రోడ్లపాలు చేసి అడుక్కునేలా చేశావ్‌..’ అంటూ అభ్యర్థులు గట్టిగా తమ గోడు వెళ్లగక్కారు. దీంతో సీఎం చంద్రబాబు అభ్యర్థులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దేశంలో ఎక్కడా లేనన్ని పోస్టులిచ్చాను. ఏ ప్రభుత్వం డీఎస్సీని భర్తీ చేయలే దు. అయినా నేను చేశాను. నిరుద్యోగ భృతి తీసు కుంటున్నారుగా. ఏ రాష్ట్రంలోనైనా వెయ్యి రూపా యల నిరుద్యోగ భృతి ఇస్తున్నారా? సభకు వచ్చి నినాదాలు చేయటం సరికాదు. ఏం తమాషా లాడుతున్నారా? బీ కేర్‌ఫుల్‌. మీలో క్రమశిక్షణ లేదు’ అంటూ వారిని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. దీంతో డీఎస్సీ అభ్యర్థులు స్పందిస్తూ.. ‘నీ వెయ్యి రూపాయల భృతి మేం తీసుకోవటం లేదు. కావాలంటే అది కూడా నీ కొడుక్కి ఇవ్వు.. సరిపోతుందేమో’ అంటూ ఎద్దేవా చేశారు. 

50 వేల మంది ఎస్జీటీలుంటే 2 పోస్టులు భర్తీ చేస్తావా?
50 వేల మందికిపైగా ఎస్జీటీ అభ్యర్థులుంటే.. కేవలం 2 పోస్టులు భర్తీ చేస్తాననడం జిల్లాకు చెందిన ముఖ్యమంత్రిగా మీకు న్యాయంగా ఉందా? అంటూ సీఎంను ఆందోళనకారులు నిలదీశారు. ముఖ్యమంత్రిగా మీరు న్యాయం చేస్తారని వస్తే.. హెచ్చరికలు జారీ చేస్తావా? మాలో క్రమశిక్షణ లేదంటావా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీలాంటి లక్షల మందికి క్రమశిక్షణతో కూడిన విద్యను నేర్పేవాళ్లం. మమ్మల్నే అంటావా?’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇంతలో పోలీసులు రంగ ప్రవేశం చేసి నిరసన తెలుపుతున్న ఆరుగురిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారిని విడుదల చేయాలంటూ అభ్యర్థులు పెద్దపెట్టున నినాదాలు చేయగా.. వారిని పోలీసులు చెదరగొట్టారు. 

న్యాయం చేస్తారనుకుంటే..  అరెస్టు చేయించారు
సొంత జిల్లా నిరుద్యోగులకు సైతం సీఎం శఠగోపం పెట్టారు. కోచింగ్‌లు తీసుకుంటూ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మాకు డీఎస్సీ నోటిఫికేషన్‌ తీవ్ర నిరాశకు గురిచేసింది. జిల్లాలో వేల పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం రెండు ఎస్జీటీ పోస్టులే ఇచ్చారు. న్యాయం చేస్తారేమో అని వస్తే నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేశారు.     
– శాంభవి, డీఎస్సీ అభ్యర్థి

కాళ్లరిగేలా తిరిగినా కనికరించలేదు..
ముఖ్యమంత్రిని కలిసేందుకు అమరావతి చుట్టూ కాళ్లరిగేలా తిరిగాం. అయినా కనికరించలేదు. మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేశాము. అయినా మా విజ్ఞప్తిని పట్టించుకోలేదు. 
– రేఖ, డీఎస్సీ అభ్యర్థి 

మరిన్ని వార్తలు