బాబోయ్ ..!

13 Jun, 2015 01:23 IST|Sakshi
బాబోయ్ ..!

సాక్షి ప్రతినిధి, గుంటూరు : ఓటుకు నోటు వ్యవహారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చిక్కుకోవడం నవ్యాంధ్ర రాజ ధాని నిర్మాణంపై ప్రభావ ం చూపుతోంది. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు, పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, స్థలాలను కొనుగోలు చేసిన పెట్టుబడిదారులు, తాజా రాజకీయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. రేపు ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో  బాబు చిక్కుకుంటే తమ జీవితాలు తారుమారు అవుతాయనే ఆందోళన వారిలో కనపడుతోంది. టీడీపీ నాయకులు ఎవరు ఎదురైనా దీనిపై ప్రశ్నలు సంధిస్తున్నారు.

తెలంగాణ ఏసీబీ చంద్రబాబుకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా? సీఎం అరెస్టు అవుతారా?  తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల్లో కొందరు ఖరీఫ్‌కు సమాయత్తం అవుతున్నారు. ముఖ్యంగా విత్తనాలు సేకరణ, మెట్ట దుక్కులు దున్నుకోవడం వంటి పనుల్లో నిమగ్నం అయ్యారు. ఇప్పటికే 33,347 ఎకరాల భూ సమీకరణ చేసిన ప్రభుత్వం 22 వేల ఎకరాలకు సంబంధించిన రైతులకు కౌలు డీడీలు పంపిణీ చేసింది.

ఆరువేల ఎకరాలకు సంబంధించి కౌలు డీడీలు ఇవ్వడానికి కొన్ని సమస్యలు ఎదురవడంతో వాటిని పెండింగ్‌లో పెట్టారు. మిగిలిన 5 వేల ఎకరాలకు సంబంధించి మారిన రాజకీయ నేపథ్యంలో రైతులు కౌలు డీడీలు తీసుకునేందుకు విముఖత చూపుతున్నారు. ఓటుకు నోటులో  సీఎం పాత్ర ఉందని రుజువైతే, రాజధాని నిర్మాణం ఆగిపోయినట్టేనని రైతులు అంటున్నారు. దీంతో తమ భూములను తిరిగి తామే సాగుచేసు కోవాలనుకొంటున్నారు.

ఈ వివాదం వల్ల రాజధాని నిర్మాణానికి కొన్ని నెలలు ఆటంకం ఏర్పడే అవకాశం లేకపోలేదని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. దీంతో రైతులు రాజధాని నిర్మాణానికి ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. భూమిపూజ అనంతరం నేటి వరకు మంత్రులు కానీ, ఉన్నతాధికారులు కానీ రాజధాని ప్రాంతంలో పర్యటించకపోవటం రైతుల్లో ఉన్న అనుమానాలకు బలం చేకూరుతోంది.

 రియల్టర్లకు అడుగడుగునా ఆటంకాలు ...
 జిల్లాలోని రియల్టర్లకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. కొన్నాళ్లు రాజధాని గ్రామాల్లోని స్థలాలు, భూములు రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం నిలిపి వేసింది. గ్రామకంఠంకు అర కిలోమీటరు పరిధిలోని స్థలాలకే ప్లాన్ ఇవ్వాలని, అర కిలోమీటరు పరిధి దాటిన లే-అవుట్లకు అనుమతి ఇవ్వవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని ఈ ప్రాంతంలో రావడంతో భూముల ధరలు అనూహ్యంగా పెరుగుతా యని, స్థలాలు, అపార్టుమెంట్ల నిర్మాణాలు పెరుగుతాయని మొదటి నుంచి రియల్టర్లు భావించారు. అయితే తరచూ ఏదో ఆటంకం ఎదురుకావడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం ముందుకు సాగడం లేదు. మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా ఓటుకు నోటు వివాదంలో సీఎం చిక్కుకోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా పడిపోయింది.

 వ్యవసాయ కార్మికుల వలస ...
 రాజధాని గ్రామాల్లో వ్యవసాయ పనులు జరిగే అవకాశాలు లేకపోవడంతో  వ్యవసాయ కార్మికులు ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు వలస వెళుతున్నారు. ఆ జిల్లాల్లో వ్యవసాయ పనులు ముందుగా ప్రారంభమయ్యే అవకాశం ఉండటంతో అక్కడికి వెళుతున్నారు.

మరిన్ని వార్తలు