రైతుల సొమ్ము రాజధాని పాలు

21 May, 2016 02:03 IST|Sakshi
రైతుల సొమ్ము రాజధాని పాలు

సొమ్మొకరిది.. సోకొకరిది.. అన్న చందంగా ఉంది కృష్ణాజిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సమితి (విజయ డెయిరీ) పెద్దల తీరు. సంస్థకు వచ్చిన లాభాల్లో రైతులకు చెల్లించే పాల సేకరణ ధర అర్ధ రూపాయి పెంచాలని కోరినా అంగీకరించని పాలకవర్గం రాజధాని నిర్మాణం కోసం మరో రూ.5 కోట్లు విరాళం సమర్పించింది. గతంలో ఇచ్చిన రూ.5.80 కోట్లకు ఈ మొత్తం అదనం. పాలకవర్గంలో ముఖ్యులు టీడీపీకి చెందినవారు కావడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పాడి రైతులు విమర్శిస్తున్నారు.
 
 
 
సాక్షి, విజయవాడ : నూతనంగా నిర్మిస్తున్న రాజధానికి విరాళాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునివ్వడంతో కృష్ణా మిల్క్ యూనియన్ పాలకవర్గంలో కొంతమంది ఎక్కువగా స్పందిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో తొలి విడత రూ.2 కోట్లు, మరోసారి రూ.2 కోట్లు, పాల సహకార సంఘాల నుంచి రూ.1.80 కోట్లు వసూలు చేసి మొత్తం రూ.5.80 కోట్లు రాజధానికి విరాళంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. ఇది చాలదన్నట్టు తాజాగా మరో రూ.5 కోట్లు ఇచ్చారు.

 నిబంధనలకు నీళ్లొదిలి...
వాస్తవంగా విరాళం ఇవ్వాలంటే యూనియన్ బోర్డులో ముందుగా ఆమోదం పొందాలి. ఆ తరువాత దానిని జనరల్ బాడీలో ప్రవేశపెట్టి నిర్ణయం తీసుకోవాలి. అయితే రాజధాని నిర్మాణానికి రూ.5 కోట్లు ఇస్తున్న విషయం బోర్డు సమావేశంలో కాకుండా గత నెల 18న జరిగిన జనరల్ బాడీలో ప్రవేశపెట్టారు. జనరల్ బాడీ మీటింగ్‌లోనూ చాకచక్యంగా వ్యవహరించారు. సమావేశం జరిగే హాలులోకి వెళ్లాలంటే బయట ఉన్న రిజిస్టర్‌లో పాల సహకార సంఘాల అధ్యక్షులు సంతకం చేయాలి. ఈ సంతకాలనే అడ్డుపెట్టుకుని రూ.5 కోట్ల విరాళం ఇచ్చేందుకు జరనల్ బాడీ ఆమోదించినట్లు మినిట్స్‌లో రాసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


 సమావేశంలో ఏం జరిగిందంటే...
జిల్లాలో 427 పాల సహకార సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల ద్వారా జిల్లాలోని రైతుల నుంచి లక్షా 70 వేల లీటర్ల పాలు సేకరిస్తున్నారు. 427 సంఘాల అధ్యక్షులకు జనరల్ బాడీలో ఓటు వేసే హక్కు, రైతుల సమస్యలను పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. జనల్‌బాడీలో పాల్గొన్న సహకార సంఘాల అధ్యక్షుల్లో కొంతమంది రాజధాని నిర్మాణానికి రూ.5 కోట్లు ఇవ్వడాన్ని వ్యతిరేకించారని, గతంలో రూ.5.80 కోట్లు ఇచ్చి ఇప్పుడు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారని సమాచారం. తాము వ్యతిరేకిస్తున్నట్లు మినిట్స్‌లో నమోదు చేయాలంటూ 11 సంఘాల అధ్యక్షులు పట్టుబట్టడంతో గందరగోళం నెలకొని జనరల్‌బాడీ సమావేశం వాయిదా పడింది. మినిట్స్‌లో మాత్రం రూ.5 కోట్ల విరాళానికి ఆమోదం లభించినట్లు రాసేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


 రైతులకు అర్ధ రూపాయి పెంచమంటే...
 ఎండలు తీవ్రంగా ఉండి నీటిఎద్దడి ఏర్పడటంతో గ్రామాల్లో నీరు, పచ్చగడ్డి, ఎండుగడ్డి లభించక పాడి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాల దిగుబడి తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో యూనియన్ లీటర్ పాలకు చెల్లిస్తున్న ధర రూ.58ని రూ.60కి పెంచాలని రైతులు కోరారు. గత నెల 18న జరిగిన జనరల్‌బాడీలో రెండు రూపాయలు కాకపోయినా రైతుల కోరిక మేరకు కనీసం అర్ధ రూపాయి పెంచాలని అన్ని సంఘాల అధ్యక్షులు పట్టుబట్టారు. దీనిని పాలకవర్గంలో ముఖ్యులు, అధికారులు తోసిపుచ్చారు. తరువాత సొసైటీలకు బోసస్ ఇస్తామని సర్దిచెప్పారు. వాస్తవంగా బోసస్ ఇవ్వడం వల్ల సహకార సంఘానికి, పాల రేటు పెంచితే రైతులకు ఉపయోగమని పాలసంఘాల అధ్యక్షులు చెబుతున్నారు.


 తెర వెనుక కథ ఇదీ
యూనియన్ పాలకవర్గానికి వచ్చే సెప్టెంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. యూనియన్ పాలకవర్గమంతా అధికార తెలుగుదేశం పార్టీ నేతల చేతుల్లోనే ఉంది. యూనియన్ కీలక పదవుల్లో ఉన్నవారు ముఖ్యమంత్రిని ఆకర్షించి తిరిగి తమ పదవులను కాపాడుకునేందుకు రూ.11 కోట్ల విరాళాలు ఇచ్చారని విజయ డెయిరీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. రైతులకు తక్షణం బోసస్ ఇవ్వకుండా ఆగస్టులో ప్రకటించి తద్వారా రైతుల ప్రాపకం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. రైతుల కష్టం నుంచి వచ్చిన సొమ్మును రాజధానికి ధారాదత్తం చేయడంపై రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఒకే దెబ్బకు రెండు పిట్టలు...
ప్రస్తుతం రాజధాని నిర్మాణానికి రూ.5 కోట్లు ఇవ్వడం వెనుక పెద్ద పథకమే ఉందని యూనియన్‌లోని కొంతమంది సభ్యులు ఆరోపిస్తున్నారు. పాల డెయిరీలో సుదీర్ఘకాలం పాతుకుపోయి కీలకమైన పోస్టులో ఉన్న ఒక ముఖ్య నేత తిరిగి ఆ పదవి పొం దేందుకు ముఖ్యమంత్రి దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. దీంతో పాటు ఆయన మనుమడికి  క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్‌డీఏ)లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ రెండు అంశాల్లోనూ లబ్ధి పొందేందుకు ముఖ్యమంత్రికి రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చారని      
 
 
 కోర్టుకు వెళ్లొచ్చు
రాజధానికి విరాళం ఇవ్వటాన్ని 12 మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. రైతుల డబ్బేమీ ఇవ్వలేదు. రైతుల వాటా రైతులకు పంచేస్తున్నాం. యూనియన్‌కు వచ్చే నగదులోనే ఇస్తున్నాం. ఇప్పటికే రూ.200 కోట్లు రైతులకు బోనస్ రూపంలో చెల్లిస్తున్నాం. మిగిలిన డెయిరీలతో పోలిస్తే మేమే రైతులకు ఎక్కువ ధర ఇస్తున్నాం. అంతా చట్టప్రకారమే చేస్తున్నాం. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే కోర్టుకు వెళ్లొచ్చు. - మండవ జానకిరామయ్య, చైర్మన్, కృష్ణాజిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సమితి

మరిన్ని వార్తలు