పోలవరం కోసమే ప్యాకేజీకి ఓకే

6 Jan, 2017 04:35 IST|Sakshi
పోలవరం కోసమే ప్యాకేజీకి ఓకే

సీఎం చంద్రబాబు స్పష్టీకరణ
పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సీఎం శంకుస్థాపన


సాక్షి ప్రతినిధి, కాకినాడ:  ప్రత్యేక హోదాలో ఏమైతే ఉన్నాయో అవన్నీ ప్రత్యేక ప్యాకేజీలో ఉండడం వల్లే తాను ఆ ప్యాకేజీకి ఒప్పుకున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించి ఉండి ఉంటే ఈ రోజు మనం పోలవరం ప్రాజెక్టును సాధించుకునే వాళ్లమే కాదని చెప్పారు. ఆయన గురువారం తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో రూ.1,600 కోట్లతో తలపెట్టిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. అప్పుడు ఎన్టీఆర్, తరువాత తాను చేపట్టిన ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేసే బాధ్యతను తీసుకున్నానన్నారు.

ఆయనేం చెప్పారంటే..
రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేశారు. అది నేనే టేకప్‌ చేశాను, సపోర్టు కూడా చేశాను. ప్రజలు 50 రోజులు డబ్బులకు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు డబ్బుల కొరత తగ్గిపోయింది.  ఇప్పుడు రాష్ట్రంలో 25 శాతం నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయి. మార్చి నాటికి 50 శాతం జరుగుతాయి. నేను ప్రపంచమంతా స్టడీ చేశాను. భారతదేశంలో మొదట నగదు రహిత లావాదేవీలు విజయవాడలో ప్రారంభించాను.

అన్ని ప్రాజెక్టులను పూర్తిచేస్తాం
పట్టిసీమ ఎత్తిపోతల పథకం మాదిరిగానే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పరిధిలో రైతులకు న్యాయం చేస్తాం. ఏడాది తిరగకుండానే పట్టిసీమను పూర్తి చేసినట్టే తొమ్మిది నెలల్లో పురుషోత్తపట్నం ఎత్తిపోతలను పూర్తిచేస్తాం. రాయలసీమ, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో అన్ని ప్రాజెక్టులను పూర్తిచేసి రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం.

ఇదీ అసలు సంగతి..
పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి, తామే పూర్తిచేస్తామని విభజన సమయంలో కేంద్రం ప్రకటించి, విభజన చట్టంలోనూ చేర్చింది. ఇదే అంశాన్ని సాక్షాత్తు ప్రధాని రాజ్యసభలో ప్రకటించారు. దీంతోపాటు ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని పార్లమెంట్‌ సాక్షిగా ప్రకటించారు. ఈ రెండే కాకుండా వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ రైల్వే జోన్, వైఎస్సార్‌ జిల్లాలో స్టీల్‌ ఫ్యాక్టరీ.. ఇలా అనేక అంశాలను విభజన చట్టంలో పేర్కొన్నారు.

పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తిచేస్తుందని, ప్రత్యేక హోదా ఇస్తుందని దీని భావం. హా ఐదేళ్లు సరిపోదు, తాము అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు హోదా ఇస్తామని  వెంకయ్య నాయుడు పేర్కొ న్నారు.

ఐదేళ్లు పదేళ్లలో ఒరిగేదేమీ ఉండదు, రాష్ట్రానికి 15 ఏళ్లు హోదా కావాల్సిందేనని  చంద్రబాబు ఎన్నికల ప్రచార సభల్లో  మోదీ సమక్షంలోనే డిమాండ్‌ చేశారు.

ఎన్నికల ప్రచార సభల్లోనూ బీజేపీ పెద్దలు పోలవరంపై హామీలిచ్చారు. తాము అధికారంలోకి వస్తే కేంద్ర నిధులతోనే ప్రాజెక్టును పూర్తిచేస్తామని చెప్పారు.

ఏపీకి హోదా ఇవ్వకుండా, విభజన చట్టంలోని ఒక్క హామీనీ పట్టించుకోకుండా, పోలవరం ప్రాజెక్టును నిర్మించకుండా... కేవలం నాబార్డు నుంచి రుణంగా ఇప్పించిన రూ.1,981 కోట్లను ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం అని చెప్పడం విచిత్రం. పోలవరం నా కల అని సీఎం మాట్లాతుండడం మరో వింత.  

కేంద్రంలో ఎన్డీయే, రాష్ట్రంలో టీడీపీ గద్దెనెక్కిన తర్వాత ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించేందుకు చంద్రబాబు ఇష్టపడలేదు. కమీషన్ల యావతో తామే సొంతంగా పోలవరం నిర్మిస్తామన్నారు. తమకు కావాల్సిన కాంట్రాక్టర్లకే ప్రాజెక్టు పనులు అప్పగించారు.

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్టు కోసం రూ.5,135.87 కోట్లు ఖర్చు పెట్టారు. ఇందులో సత్వర సాగునీటి ప్రయోజన పథకం(ఏఐబీపీ) కింద కేంద్రం ఇచ్చిన నిధులు 562.47 కోట్లు మాత్రమే మిగతా నిధులన్నీ రాష్ట్రమే భరించింది. 144 కిలోమీటర్ల మేర పోలవరం కుడి కాలువ, 135కి.మీ మేర ఎడమ కాలువ నిర్మాణం వైఎస్‌ హయాంలోనే పూర్తయ్యింది. బాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండున్నరేళ్లలో చేసిన వ్యయం రూ.1,900 కోట్లే. ఈ నిధులూ కేంద్రం ‘నాబార్డు’ నుంచి రుణంగా ఇప్పించింది.

మరిన్ని వార్తలు