ఎంపీ మాధవి వివాహ రిసెప్షన్‌లో సీఎం జగన్‌

22 Oct, 2019 19:28 IST|Sakshi

దంపతులను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి

సాక్షి, విశాఖపట్నం: అరకు పార్లమెంట్‌ సభ్యురాలు గొడ్డేటి మాధవి, కుసిరెడ్డి శివప్రసాద్‌ వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. మాధవి, శివప్రసాద్‌ దంపతులను సీఎం ఆశీర్వదించారు. సాయిప్రియా రిసార్ట్స్‌లో మంగళవారం సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది. రిసెప్షన్‌ వేడుకలో బంధుమిత్రులతో పాటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.  కాగా, ఎంపీ మాధవి, శివప్రసాద్‌ వివాహం కొయ్యూరు మండలం శరభన్నపాలెంలోని మాధవి స్వగృహంలో శుక్రవారం తెల్లవారుజామున (3.15 గంటలకు) జరిగిన సంగతి తెలిసిందే. 
(చదవండి : ఘనంగా ఎంపీ గొడ్డేటి మాధవి వివాహం)

పాతికేళ్ల వయసులోనే మాధవి పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎన్నిక అయ్యారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక​ ఎన్నికల్లో  గొడ్డేటి మాధవి అరకు పార్లమెంట్‌ నుంచి భారీ ఆధిక్యతతో ఎంపీగా విజయం సాధించారు. ఉపాధ్యాయురాలిగా ప్రస్థానం ప్రారంభించిన మాధవి... ఈ ఎన్నికల్లో ముప్ఫై ఏళ్లుగా రాజకీయ చక్రం తిప్పిన కిశోర్‌ చంద్రదేవ్‌ని ఓడించారు. ఆమె తండ్రి మాజీ ఎమ్మెల్యే  దేముడు. కాగా, కుసిరెడ్డి శివప్రసాద్‌.. మాధవి చిన్ననాటి స్నేహితుడు కావడం విశేషం.
(చదవండి : ఒప్పించారు ఒక్కటయ్యారు)

ముఖ్యమంత్రికి అభినందనలు..
ఢిల్లీ పర్యటన ముగించుకుని విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం జగన్‌ను చైతన్య స్రవంతి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు డాక్టర్‌ షిరీన్‌ రెహమాన్‌  కలిశారు. సంపూర్ణ మద్య నిషేధం దిశగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అడుగులు వేయడాన్ని ఆమె అభినందించారు. కాగా, షిరీన్‌ విశాఖ టీడీపీ నగరాధ్యక్షుడు ఎస్‌.ఏ. రెహమాన్‌ భార్య కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు