సీఎం రాకతో రిసెప్షన్‌లో సందడి

23 Oct, 2019 06:19 IST|Sakshi

విశాఖలో జరిగిన అరకు ఎంపీ మాధవి రిసెప్షన్‌కు హాజరైన సీఎం

వధూవరులు  ఎంపీ మాధవి,  శివప్రసాద్‌ను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

పార్టీ నేతలకు ఆత్మీయ పలకరింపు

సీఎం స్వాగతానికి వెల్లువెత్తిన పార్టీ నేతలు

అన్నా.. ఎలా ఉన్నారు, అమ్మా.. అంతా ఓకే కదా.. అంటూ ఆద్యంతం ఉత్సాహంగా అందరినీ పేరుపేరునా పలకరించడంతో వారంతా   ఆనందంతో పులకించిపోయారు. అలా పలకరించిన నేత.. సాక్షాత్తు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కావడమే వారి ఆనందానికి కారణం. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలనే కాదు.. కార్యకర్తలను కూడా ఆత్మీయంగా, ఎంతో ఆదరంగా ఒక్కొక్కరినీ పేరు పెట్టి పిలిచిన అధినేతను చూసి సంబరపడ్డారు. ఈనెల 17న వివాహం చేసుకున్న అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, శివప్రసాద్‌లను ఆశీర్వదించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు నేరుగా ఢిల్లీ నుంచి విచ్చేశారు. ఎయిర్‌పోర్టులోనూ, వివాహ రిసెప్షన్‌ వేదిక వద్ద.. తనను కలిసేందుకు, చూసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరినీ సీఎం ఆత్మీయంగా పలకరించారు.  కేకే రాజు ది గ్రేట్‌.. అంటూ ఉత్తర నియోజకవర్గ అభ్యర్ధి కేకే రాజును, గౌరమ్మా ఎలా ఉన్నావంటూ పార్టీ నగర మహిళా అధ్యక్షురాలు గరికిన గౌరిని, గురువులన్నా ఎలా ఉన్నావ్‌.. అంటూ కోలా గురువులును.. ఇలా ప్రతి ఒక్కరినీ పేరు పెట్టి పిలిచి ప్రేమగా పలకరించారు.     –సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం

సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి రాకతో అరకు పార్లమెంట్‌ సభ్యురాలు గొడ్డేటి మాధవి రిసెప్షన్‌ వేదిక వద్ద సందడి వాతావరణం నెలకొంది. రిసెప్షన్‌కు హాజరయ్యేందుకు మంగళవారం  సాయంత్రం 6 గంటలకు విశాఖ విమాశ్రయానికి సీఎం చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గంలో రుషికొండలోని సాయిప్రియ రిసార్ట్స్‌కు సాయంత్రం 6.43 గంటలకు చేరుకున్నారు. వధూవరులు ఎంపీ మాధవి, శివప్రసాద్‌ను ఆశీర్వదించారు.  నూతన దంపతులు, వారి కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి కాసేపు మాట్లాడారు. మాధవి, శివప్రసాద్‌ దంపతులు ముఖ్యమంత్రి జగన్‌కు పాదాభివందనం చేశారు.

వివాహానికి హాజరైన  పార్టీ శ్రేణులకు, ప్రజలకు సీఎం అభివాదం చేశారు. రిసెప్షన్‌కు డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాసు, ఎంపీలు డా.భీశెట్టి వెంకట సత్యవతి, వంగా గీత, గోరంట్ల మాధవ్, డా.సంజీవ్‌కుమార్, చంద్రశేఖర్, ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యేలు చెట్టి ఫాల్గుణ, కొట్టగుళ్ల భాగ్యలక్ష్మి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలచారి, పార్టీ నేతలు అక్కరమాని విజయనిర్మల, పరిక్షిత్‌ రాజు, కుంభా రవిబాబు, కొయ్య ప్రసాదరెడ్డి, సతీష్‌వర్మ, సుధాకర్, ఏయూ వీసీ ప్రసాదరెడ్డి తదితరులు హాజరయ్యారు.  

జిల్లా సమస్యలపై సీఎంతో చర్చించిన దాడి 
సాక్షి, విశాఖపట్నం:   ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత దాడి వీరభద్రరావు భేటీ అయ్యారు. మంగళవారం నగరానికి వచ్చిన సీఎంతో కారులో ప్రయాణిస్తూ జిల్లా సమస్యలపై మాట్లాడారు. విశాఖ నగరంలో రోజురోజుకీ కాలుష్యం పెరిగిపోతోందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఒకప్పుడు పాతబస్తీకే పరిమితమైన కాలుష్యం ఇప్పుడు ఎంవీపీ కాలనీ వరకు విస్తరించిందని వివరించారు. దాని నియంత్రణపై ప్రభుత్వపరమైన చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు. దాడి చెప్పిన సమస్యలపై స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వెంటనే కలెక్టర్‌ వినయ్‌చంద్‌తో మాట్లాడారు. తక్షణమే నగర కాలుష్యంపై అధ్యయనం చేసి నివేదిక అందించాలని ఆదేశించారు. అనంతరం పథకాల అమలుపై సీఎం జగన్‌.. దాడి వీరభద్రరావుని ఆరాతీశారు.


ముఖ్యమంత్రిని సత్కరించి అభివాదం చేస్తున్న ద్రోణంరాజు శ్రీనివాస్‌ 

దీనిపై దాడి మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టలేదనీ, తన రాజకీయ అనుభవంలో ఇన్ని పథకాలు అమలు చేసిన ప్రభుత్వాన్ని చూడలేదని చెప్పారు. గతంలో కొన్ని వర్గాల ప్రజలకే మేలు జరిగేదనీ, కానీ ప్రస్తుతం అన్ని వర్గాల ప్రజలూ జీవితాంతం చెప్పుకునేలా పథకాలు అమలు చేస్తున్నారనీ.. ప్రజలందరి నుంచీ మంచి స్పందన వస్తోందని తెలిపారు. రైతు భరోసా పథకం గురించి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి ప్రస్తావించగా.. లక్షలాది మంది రైతులకు ఆర్థిక భరోసా కల్పించడంతో అన్నదాతల్లో ఎనలేని సంతోషం కనిపిస్తోందనీ దాడి చెప్పారు.   

మరిన్ని వార్తలు