విద్యుత్‌ చార్జీలు పెంచొద్దు 

4 Dec, 2019 05:04 IST|Sakshi

విద్యుత్‌ శాఖకు సీఎం ఆదేశాలు 

సాక్షి, అమరావతి: ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్‌ చార్జీలు పెంచొద్దని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి తెలిపారు. అనవసర వ్యయాన్ని తగ్గించి, వినియోగదారులపై భారం పడకుండా చూడాలని సీఎం సూచించినట్టు తెలిపారు. ఏపీ డిస్కమ్‌లు బుధవారం ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి 2020ృ21 వార్షిక ఆదాయ అవసర నివేదిక సమర్పించనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్‌ సంస్థల ఆర్థిక పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

వచ్చే ఏడాదికి కావాల్సిన ఆదాయ, ఖర్చు వివరాలను ఏటా డిసెంబర్‌ మొదటి వారం కల్లా డిస్కమ్‌లు ఏపీఈఆర్‌సీకి సమర్పించాలి. దీనిపై కమిషన్‌ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి, మార్చి 31 నాటికి కొత్త టారిఫ్‌ ఆర్డర్‌ను ప్రకటిస్తుంది. ఇది ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ ప్రాతిపదికన రెండు డిస్కమ్‌లు వచ్చే ఏడాదికి రూ.47 వేల కోట్ల రెవెన్యూ అవసరమని లెక్కగట్టాయి. ఇందులో ప్రస్తుత టారిఫ్‌ ప్రకారం రూ.30 వేల కోట్ల ఆదాయం లభిస్తుందని పేర్కొన్నాయి. మిగిలిన రూ.17 కోట్ల ఆర్థిక లోటును భర్తీ చేయాల్సి ఉందని కమిషన్‌కు స్పష్టం చేశాయి. రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి 2017 వరకూ ఏటా విద్యుత్‌ చార్జీలు పెరిగాయి. అయితే, ఈసారి ఒక్క పైసా కూడా చార్జీలు పెంచకుండా ప్రభుత్వం ముందే ఆదేశాలు ఇవ్వడం విశేషం.  

>
మరిన్ని వార్తలు