‘పాదయాత్రలో ఇచ్చిన హామీ నెరవేరింది’

8 Jan, 2020 13:26 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : పాదయాత్ర సమయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ నేడు సఫలీకృతమైందని మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. పాకిస్తాన్‌ జైలు నుంచి విడుదలైన 20 మత్స్యకారులు సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ని కలిసి కృతఙ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 22 మంది మత్స్యకారులు దురదృష్టవశాత్తూ పాకిస్తాన్‌ కోస్ట్‌గార్డ్స్‌కి చిక్కారని గుర్తు చేశారు. 22 మందిలో 20 మందిని తీసుకోచ్చామని... మిగిలిన ఇద్దరు కూడా త్వరలోవస్తారని తెలిపారు. మత్స్యకారులు వాఘా బోర్డర్‌ వద్దకు రాగానే ఆనందం వెల్లివిరిసిందని చెప్పారు. నేడు వారందరూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ని కలిసి కృతజ్ఞతలు చెప్పారని తెలిపారు.

‘ఎందుకు గుజరాత్‌కు వెళ్లాల్సివచ్చిందో సీఎం మత్స్యకారులను అడిగి తెలుసుకున్నారు. ఫిషింగ్‌ హార్బర్‌, జెట్టీలు లేకపోవడంతోనే గుజరాత్‌ వెళ్లామని వారు చెప్పడంతో.. జెట్టీల నిర్మాణం చేపట్టాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పాకిస్తాన్ భారత్ మధ్య సంబంధాలు బాగా లేకపోయినా సీఎం చొరవ చూపారు. ఇది జీవితంలో తాము మర్చిపోలేని సంఘటన అని మత్స్యకారులు సీఎం జగన్‌తో చెప్పారు. రాష్ట్రంలోని మేజర్, మైనర్ జెట్టీలను అందుబాటులోకి తెస్తాం’అని మంత్రి మోపిదేవి అన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో మత్స్యకారులు విడుదలయ్యారని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. ప్రతియేటా 50 వేల మంది శ్రీకాకుళం నుంచి గుజరాత్ వెళ్లి ఫిషింగ్ చేస్తుంటారని ఆయన తెలిపారు. వారికి ఇక్కడే ఉపాధి చూపేందుకు జెట్టీల నిర్మాణానికి కృషి చేస్తామని సీఎం హామినిచ్చారని గుర్తు చేశారు. మత్స్యకారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రూ. 5 లక్షల సాయం అందించారని ఎంపీ తెలిపారు. 

>
మరిన్ని వార్తలు