వంతెనల నిర్మాణాలకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌

24 Aug, 2019 09:45 IST|Sakshi
ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దులో వంతెన నిర్మాణ ప్రాంతాలను పరిశీలిస్తున్న అధికారులు

సాక్షి, పి.గన్నవరం(తూర్పుగోదావరి) : ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దుల్లో నివసిస్తున్న లంక గ్రామాల ప్రజల కోసం వశిష్ట, వైనతేయ నదీపాయలపై పుచ్చల్లంక–అయోధ్యలంక, ఆనగర్లంక–యర్రంశెట్టి వారిపాలెం వంతెనల నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. రెండు ప్రాంతాలకు చెందిన ప్రజలు పడుతున్న ఇబ్బందులను గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు ఇటీవల జగన్‌ మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లిన నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా పంచాయతీ రాజ్‌ శాఖ ఈఈ భాస్కర కుమార్, డీఈఎంఎస్‌ నాగవర్మలు శుక్రవారం ఈ వంతెనల నిర్మాణ ప్రాంతాలను శుక్రవారం బోట్లపై వెళ్లి పరిశీలించారు.

గత టీడీపీ ప్రభుత్వం పుచ్చల్లంక, ఆనగర్లంక వంతెనలకు అట్టహాసంగా శంకుస్థాపనలు చేసి గాలికి వదిలేసింది. ఈ వంతెనల నిర్మాణానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పి.గన్నవరం మండలం మొండెపులంక సరిహద్దులో ఉన్న పశ్చిమ జిల్లా పుచ్చల్లంక నుంచి అయోధ్యలంక వంతెనకు రూ.50 కోట్ల వ్యయంతో గత టీడీపీ ప్రభుత్వం శంకుస్థాపన చేసి, అనంతరం విస్మరించింది. ప్రస్తుత నిర్మాణ వ్యయం రూ.70 కోట్లకు పెరిగింది. అలాగే టీడీపీ ప్రభుత్వం వదిలేసిన పశ్చిమ గోదావరి జిల్లా ఆనగర్లంక నుంచి పి.గన్నవరం మండలం యర్రంశెట్టివారిపాలెం వంతెన నిర్మాణానికి కూడా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వంతెన నిర్మాణ ప్రాంతాల పరిశీలన కార్యక్రమంలో మంత్రి తనయుడు చెరుకువాడ నర్సింహరాజు (నరేష్‌రాజు), వైఎస్సార్‌ సీపీ నాయకులు సుంకర సీతారామ్, కె.సత్యనారాయణ, ఎం.రాంబాబు, జి.బాలకృష్ణ, వై.ప్రసాద్, ఆర్‌.చంటి, పీఆర్‌ అధికారులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు