సమస్యలు ఆలకిస్తూ.. భరోసా ఇస్తూ..

1 Oct, 2019 04:47 IST|Sakshi
సీఎంకు వినతిపత్రాన్ని అందిస్తున్న ఎన్‌జీవో మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి

రేణిగుంట విమానాశ్రయం వద్ద ప్రజల బాధలను విన్న సీఎం

వెంటనే పరిష్కరించాలని అక్కడికక్కడే కలెక్టర్‌కు ఆదేశాలు

యువకుని వైద్యానికి 10 లక్షలు

రేణగుంట (చిత్తూరు జిల్లా): తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించేందుకు సోమవారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. విమానాశ్రయం వెలుపల ఏర్పాటుచేసిన గ్యాలరీలో ఉన్న అర్జీదారుల సమస్యలను ఎంతో ఓర్పుగా ఆలకించారు. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన ముఖ్యమంత్రి.. గ్యాలరీలో ఉన్న అందరి వద్దకు వెళ్లి ఒక్కొక్కరి అర్జీని స్వీకరించి వారి సమస్యను అడిగి తెలుసుకుని పరిష్కారానికి భరోసా ఇచ్చారు. అర్జీలను జిల్లా కలెక్టర్‌ భరత్‌గుప్తాకు అందించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. దీంతో తమ సమస్యలపై సీఎం స్పందించిన తీరుకు వారంతా ముగ్థులయ్యారు.  

ప్రాణభిక్ష పెట్టండి సారూ..
గ్యాలరీలో ఇద్దరు చెల్లెళ్లు తమ అన్నకు ప్రాణభిక్ష పెట్టండి అని అడిగిన తీరు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కదిలించింది. సీఎం వారి దగ్గరకు రాగానే.. ‘మా అన్న హరికృష్ణ తిరుపతి రవీంద్రభారతి స్కూల్‌లో 10వ తరగతి చవివేవాడు. 2015 నవంబర్‌ 21న స్కూల్‌ సిబ్బంది భవనం పైనుంచి కిందకు తోసేశారు. మూడేళ్లపాటు కోమాలో ఉన్నాడు.. చెన్నై ఆస్పత్రిలో తొమ్మిది ఆపరేషన్లు చేశారు. చికిత్స కోసం రూ.10 లక్షలు ఆర్థిక సాయం కావాలి’.. అని  బాధితుని ఇద్దరు చెల్లెళ్లు చాందిని, రంజని సీఎంను వేడుకున్నారు. గత ప్రభుత్వంలో అనేకమార్లు విన్నవించినా న్యాయం జరగలేదని వివరించారు. దీంతో రూ.10లక్షలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. చాందిని, రంజని చదువులు, కుటుంబ ఖర్చుల నిమిత్తం మరో రూ.5లక్షలు ఇస్తామని చెప్పారు. 

గెస్ట్‌ టీచర్లకు న్యాయం
ఇక తిరుపతిలోని టీటీడీ విద్యాసంస్థలలో గెస్ట్‌ టీచర్లుగా పనిచేస్తున్న 20మంది తమను కాంట్రాక్టు టీచర్లుగా పరిగణించి ఉద్యోగ భరోసా కల్పించాలని సీఎంకు విన్నవించారు. దీంతో ఆయన సానుకూలంగా స్పందించి న్యాయం చేస్తామన్నారు. వీరితోపాటు ఏపీ ఎస్సీ కార్పొరేషన్‌ ఫెసిలిటేటర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు.. 2008 డీఎస్సీలో క్వాలిఫై అయిన అభ్యర్థులూ ముఖ్యమంత్రికి తమ సమస్యలను చెప్పుకున్నారు.

>
మరిన్ని వార్తలు