జంట పథకాలతో రైతన్నకు పంట

7 Sep, 2019 07:42 IST|Sakshi
దువ్వూరు మండలం జొన్నవరం, రాజోలి వద్ద అధికారులతో కలెక్టర్‌ హరి కిరణ్‌

కరువు ప్రాంత రైతులకు కొండంత భరోసా

మరో రెండు సాగునీటి పథకాల నిర్మాణానికి ప్రభుత్వం సై

కుందూనదిపై రాజోలి రిజర్వాయర్‌

కుందూ నుంచి తెలుగుగంగకు ఎత్తిపోతల

డిసెంబరులో శంకుస్థాపన చేయనున్న సీఎం

ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు పట్టణాలకు తాగునీటి వసతి

కరువు కష్టాలనుంచి గట్టెక్కించేందుకు జగన్‌ సర్కార్‌ సమాయత్తమైంది. అవకాశమున్నంత మేర జిల్లాలో సాగునీటి వనరుల ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. కేసీ కెనాల్‌ ఆయకట్టు స్థిరీకరణ కోసం రాజోలి వద్ద కొత్తగా రిజర్వాయర్‌ నిర్మాణంతోపాటు తెలుగుగంగ ఆయకట్టు స్థిరీకరణకు కుందూనదినుంచి ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు సర్వం సిద్ధం చేస్తోంది.  రెండు పథకాలకు డిసెంబర్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు. కలెక్టర్‌ సి.హరికిరణ్‌  ఇరిగేషన్‌  అధికారులతో కలిసి శుక్రవారం రాజోలి రిజర్వాయర్‌ నిర్మాణంతోపాటు కుందూ ఎత్తిపోతల పథకం నిర్మాణ ప్రాంతాలను పరిశీలించారు. ఇవ్వని హామీలను సైతం నెరవేర్చేందుకు ప్రభుత్వం పూనుకోవడాన్ని జిల్లా రైతాంగం స్వాగతిస్తోంది.

సాక్షి, కడప : వరుస కరువులతో అల్లాడిపోతున్న రైతాంగానికి ఇది తీపి కబురు. సాగునీటి వనరులపై వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మరో అడుగు వేయనుంది. కేసీ ఆయకట్టును స్థిరీకరించేందుకు పథకం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం కుందూనదిపై కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం రాజోలి సమీపంలో రిజర్వాయర్‌ నిర్మించాలని నిర్ణయించింది. 2.95 టీఎంసీల సామర్ద్యంతో నిర్మించే ఈ ప్రాజెక్టుకు రూ. 830.47 కోట్లు వెచ్చించనుంది. డిసెంబరులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. కేసీ కెనాల్‌ కింద అధికారికంగా 83,489 ఎకరాల ఆయకట్టు ఉంది. కృష్ణా జలాలపై ఆధారపడిన ఈ ఆయకట్టుకు అడపా దడపా మాత్రమే నీరు చేరుతోంది. ఎగువన భారీ వర్షాలు కురిసి శ్రీశైలం ప్రాజెక్టు నిండితే తప్ప కేసీ ఆయకట్టుకు నీరు వదిలే పరిస్థితి లేదు.

దీంతో కుందూనదిపై రాజోలు రిజర్వాయర్‌ను బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌గా నిర్మించాలని చాలాకాలంగా కేసీ ఆయకట్టు రైతాంగం కోరుతోంది. గత ప్రభుత్వం అన్నదాతల గోడు పట్టించుకోలేదు. కానీ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే  ఈ ప్రాంత రైతాంగం శ్రేయేస్సును దృష్టిలో ఉంచుకుని రాజోలి రిజర్వాయర్‌ నిర్మాణానికి తలపెట్టింది. ప్రాజెక్టు నిర్మించి 2.95 టీఎంసీల నీటిని నిల్వ ఉంచితే  కేసీ ఆయకట్టు స్థిరీ కరించినట్లు అవుతుంది. దీంతోపాటుగా ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు తాగునీరు కూడా ప్రాజెక్టు ద్వారా అందించనున్నారు.  కలెక్టర్‌ హరి కిరణ్, స్పెషల్‌ కలెక్టర్‌ సతీష్‌చంద్ర, తెలుగుగంగ కడప ఎస్‌ఈ శారద, నంద్యాల ఎస్‌ఈ శ్రీనివాసరెడ్డి, ఈఈ మాధవరావు, డీఈ రమణ తదితరులు శుక్రవారం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. భూ సేకరణతోపాటు టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్‌ ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు. త్వరలోనే ప్రాజెక్టు నిర్మాణానికి సం బంధించి అన్ని కార్యక్రమాలను అధికారులు పూర్తి చేయనున్నారు. రాజోలి రిజర్వాయర్‌ నిర్మాణంతో కేసీ ఆయకట్టుకు మరింత ఉపయోగం చేకూరనుండడంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది.

కుందూ నుండి ఎత్తిపోతల
మరోవైపు 1.58 లక్షల ఎకరాల తెలుగుగంగ ప్రాజెక్టు ఆయకట్టును స్థిరీకరించేందుకు కుందూఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దువ్వూరు మండలం జొన్నవరం క్రాసింగ్‌ వద్ద ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా ఐదు టీఎంసీల నీటిని కుందూ నదినుంచి తెలుగుగంగ మెయిన్‌ కెనాల్‌ ద్వారా బ్రహ్మంసాగర్‌ రిజర్వాయర్‌కు తరలించనున్నారు. తొలి అంచెగా ఎనిమిది మోర్టార్లు ఏర్పాటు చేసి ఆరు కిలోమీటర్ల పొడవుతో నాలుగు వరుసల పైపులైన్లు వేసి దువ్వూరు ట్యాంకుకు నీటిని తరలిస్తారు. తర్వాత అక్కడి నుంచి మరో ఎనిమిది మోర్టార్లతో రెండు కిలోమీటర్ల మేర పైపులైన్‌ వేసి తెలుగుగంగ ప్రధాన కాలువలోకి కుందూ నీటిని తరలిస్తారు.

బ్రహ్మంసాగర్‌కు ఐదు టీఎంసీల నీటిని తరలించడం వల్ల బద్వేలు, మైదుకూరు నియోజకవర్గాల్లో ఆయకట్టుకు సాగునీరు అందించడంతోపాటు బద్వేలు, మైదుకూరు పట్టణాలకు తాగునీరు అందించే అవకాశం ఉంటుంది. ఈ పథకానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిసెంబరులోనే శంకుస్థాపన చేయనున్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్‌ సి.హరి కిరణ్‌ అటు రాజోలి రిజర్వాయర్‌ నిర్మాణ ప్రాంతంతోపాటు దువ్వూరు వద్ద కుందు ఎత్తిపోతల పథకం నిర్మాణ ప్రాంతాన్ని సైతం పరిశీలించారు. కుందూ ఎత్తిపోతల పథకానికి సంబంధించి భూ సేకరణతోపాటు టెండర్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని ఇరిగేషన్‌ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. రాజోలి రిజర్వాయర్‌ నిర్మాణంతో 83,489 ఎకరాల కేసీ ఆయకట్టుతోపాటు కుందూ ఎత్తిపోతల పథకంతో 1,58,000 ఎకరాలు తెలుగుగంగ ఆయకట్టుకు సైతం నీరు చేరనుంది. పై రెండు పథకాల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 1270.47 కోట్లు ఖర్చు చేయనుంది. ప్రభుత్వ నిర్ణయంతో ఈ ప్రాంత రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది

మరిన్ని వార్తలు