యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు

4 Aug, 2019 03:32 IST|Sakshi

అధికారులకు సీఎం జగన్‌ ఆదేశం

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి

వరద బాధితులకు తక్షణమే నిత్యావసర సరకులు

గోదావరి వరద ఉధృతిపై ఇజ్రాయెల్‌ నుంచి ఎప్పటికప్పుడు వాకబు  

సాక్షి, అమరావతి: గోదావరి వరద ఉధృత రూపం దాల్చిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల వారిని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించి బసతోపాటు భోజన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ముంపు బాధిత కుటుంబాలకు తక్షణమే నిత్యావసర సరుకులు అందిం చాలని సూచించారు. ఇజ్రాయెల్‌ పర్యటనలో ఉన్న సీఎం జగన్‌ గోదావరి వరద పరిస్థితి, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో శనివారం వాకబు చేశారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా విపత్తు నిర్వహణ సిబ్బంది, ఉభయగోదావరి జిల్లాల అధికారులను సన్నద్ధం చేయాలన్నారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనా ల్సిందిగా ఆయా ప్రాంతాల మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం ఆదేశించారు.

గోదావరి వరదలకు ప్రభావితమైన దేవీపట్నం మండ లంలోని 32 ఆవాసాలు సహా ఉభయగోదావరి జిల్లాల్లోని ముంపు గ్రామాలకు సహాయం అందించాలని పేర్కొన్నారు. దీంతో ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యంతోపాటు, 2 లీటర్ల కిరోసిన్, కేజీ కందిపప్పు, లీటరు పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళాదుంపలు ఇవ్వాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించేందుకు తగు ఏర్పాట్లు చేయాలని పౌరసరఫరాల శాఖ ఎక్స్‌ అఫిషియో ప్రిన్సిపుల్‌ సెక్రటరీ, పౌర సరఫరాల సంస్థ వైస్‌ చైర్మన్‌ కమ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్లను ఆదేశించారు.

సహాయ బృందాలు సిద్ధం
వరద పరిస్థితిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహాయక బృందాలను రంగంలోకి దించింది. తూర్పుగోదావరి జిల్లాలో 90 మంది ఎన్డీఆర్‌ఎఫ్, 124 మంది ఎస్టీఆర్‌ఎఫ్, అగ్నిమాపక విభాగం నుంచి 90 మంది సిబ్బంది, పశ్చిమగోదావరిలో 30 మంది ఎన్డీఆర్‌ఎఫ్, 34 మంది ఎస్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక విభాగం నుంచి 49 మంది సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. శాటిలైట్‌ ఫోన్లు, డ్రోన్‌ కెమేరాలను వరద పర్యవేక్షణ కోసం సిబ్బంది వినియోగిస్తున్నారు. 

పోలీసు యంత్రాంగం అప్రమత్తం: డీజీపీ 
గోదావరికి భారీగా వరద నీరు వస్తుండటంతోపాటు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినందున రాష్ట్ర పోలీసు యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉందని డీజీపీ సవాంగ్‌ చెప్పారు. ఎటువంటి పరిస్థితిని అయినా సరే ఎదుర్కొనేందుకు పోలీసులతోపాటు ఎస్‌డీ ఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఫైర్‌ సర్వీసు బృందాలు సమాయత్తంగా ఉన్నాయని తెలిపారు.  

మరిన్ని వార్తలు