వైద్య రంగంలో సంస్కరణలకు సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

29 Oct, 2019 16:07 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : ప్రజల సమస్యలను తెలుసుకుని సత్వర చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన (ప్రజా పరిష్కార వేదిక) కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాల జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈక్రమంలో రాష్ట్ర వైద్య రంగంలో సంస్కరణలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  కీలక ఆదేశాలు జారీచేశారు.

వైద్య రంగంలో సంస్కరణల అమలుకు కమిటీని నియమిస్తున్నట్టు సీఎం జగన్‌ చెప్పారు. కమిటీ చైర్మన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను నియమిస్తున్నట్టు ఆదేశాలు జారీ చేశారు.  కో చైర్మన్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ సుజాతారావును నియమించారు. వివిధ విభాగాలకు చెందిన 10 మందిని సభ్యులుగా నియమిస్తున్నట్టు సీఎం వెల్లడించారు.  దీంతోపాటు రాష్ట్రంలోని బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రులను స్వయం ప్రతిపత్తి సంస్థలుగా మార్చేందుకు సీఎం ఒక కమిటీని నియమించారు. వైద్యవిద్య డైరెక్టర్‌, ఏపీవీవీపీ కమిషనర్‌, మాజీ వీసీ ఐవీ రావు, ఎన్‌ఆర్‌హెచ్‌ఎం ఎండీ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈమేరకు వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

ఇక రాష్ట్ర విద్యారంగంలో సంస్కరణలపై ఏర్పాటైన కమిటీతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో తాము గుర్తించిన అంశాలపై కమిటీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.బాలకృష్ణన్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈసందర్భంగా..  అమ్మఒడి, నాడు-నేడు కార్యక్రమాలపై సంస్కరణల కమిటీ ప్రశంసలు కురిపించింది.

మరిన్ని వార్తలు