రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చేయూతనివ్వండి

6 Oct, 2019 04:19 IST|Sakshi

ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి

గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద అదనంగా రూ.40 వేల కోట్లు ఇవ్వండి

కృష్ణా–గోదావరి అనుసంధానం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మేలిమలుపు.. దీనికి నిధులివ్వండి

పోలవరంలో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.838 కోట్లు ఆదా అయ్యాయి

పోలవరం సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించండి.. ఈ ఏడాది రూ.16 వేల కోట్లు విడుదల చేయండి

వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఇవ్వాల్సిన రూ.1,050 కోట్లు ఇవ్వండి

రాజధానికి నిధులిచ్చి సహకరించాలి

15న ‘రైతు భరోసా’ ప్రారంభించేందుకు రాష్ట్రానికి రావాలని ఆహ్వానం

రాష్ట్ర సమస్యలపై 1.20 గంటలపాటు ప్రధానితో సుదీర్ఘంగా సీఎం చర్చ

సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: వారసత్వంగా వచ్చిన కొన్ని సమస్యలతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఆంధ్రప్రదేశ్‌కు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద అదనపు నిధులు విడుదల చేసి రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తోడ్పాటు అందించాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. కేంద్రం నుంచి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద రూ.61,071.51 కోట్లు అవసరమని గత సర్కారు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో పేర్కొందని, తమ ప్రభుత్వం సమర్పించిన పూర్తి స్థాయి బడ్జెట్‌లోనూ ఇదే విషయాన్ని తెలియ చేశామన్నారు. కానీ ఇప్పటివరకు కేంద్రం నుంచి వచ్చింది రూ. 6,739 కోట్లు మాత్రమేనన్నారు. గత ప్రభుత్వం వివిధ పనులు, పథకాలు, కార్యక్రమాలకు సంబంధించి రూ.50 వేల కోట్ల బిల్లులను పెండింగ్‌లో పెట్టిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

అందువల్ల గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద అదనంగా మరో రూ.40 వేల కోట్లు ఇవ్వాలని కోరారు. శనివారం మధ్యాహ్నం ఢిల్లీ వచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాయంత్రం 4.30 గంటల సమయంలో 7, లోక్‌ కళ్యాణ్‌మార్గ్‌లోని ప్రధాని మోదీ నివాసానికి చేరుకుని ఆయనతో సమావేశమయ్యారు. సుహృద్భావ వాతావరణంలో సాయంత్రం 5.50 గంటల వరకు ఈ సమావేశం జరిగింది. గోదావరి–కృష్ణా అనుసంధానం, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రెవెన్యూ లోటు భర్తీతోపాటు పలు అంశాలపై సమగ్రంగా చర్చించిన ముఖ్యమంత్రి జగన్‌ ఈ మేరకు వినతిపత్రం కూడా సమర్పించారు. ప్రధాని మోదీతో సీఎం జగన్‌ చర్చించిన ముఖ్యాంశాలు ఇవీ..

కృష్ణా – గోదావరి అనుసంధానానికి నిధులివ్వండి..
►కృష్ణా పరీవాహక ప్రాంతం నీటి కొరతను ఎదుర్కొంటోంది. రాయలసీమ ప్రాంతానికి సాగు, తాగునీటి వనరైన శ్రీశైలం రిజర్వాయర్‌లోకి వరద ప్రవాహం గత 52 ఏళ్లుగా చూస్తే 1,230 టీఎంసీల నుంచి 456 టీఎంసీలకు పడిపోయింది. కృష్ణా జలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టుల ఆయకట్టును స్థిరీకరించాల్సి ఉంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మేలిమలుపు తిప్పే కృష్ణా–గోదావరి నదుల అనుసంధానానికి కేంద్రం ఆర్థికంగా సాయం చేసి ఆదుకోవాలి.
►గత 30 ఏళ్లుగా ఏటా సగటున ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 2,780 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. గోదావరి జలాలను నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు తరలించడం ద్వారా కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు దుర్భిక్ష రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు సాగునీరు సమృద్ధిగా లభిస్తుంది.

పోలవరం సవరించిన అంచనాలను ఆమోదించండి..
►పోలవరం పనుల్లో 2014–19 మధ్య అక్రమాలు చోటుచేసుకున్న నేపథ్యంలో నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు పాత కాంట్రాక్టు ఒప్పందాలను రద్దు చేసి రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించాం.
►పోలవరంలో రివర్స్‌ టెండరింగ్‌ వల్ల ఇప్పటికే రూ.838 కోట్లు ఆదా అయ్యాయి. ఇందులో హెడ్‌ వర్క్స్, హైడ్రో పవర్‌ ప్రాజెక్టు పనుల్లో రూ.780 కోట్లు ఆదా కాగా, లెఫ్ట్‌ కనెక్టివిటీ(65వ ప్యాకేజీ) పనులకు సంబంధించిన రూ.58 కోట్లు ఆదా అయ్యాయి.
►పోలవరం కోసం రాష్ట్రం వెచ్చించిన రూ.5,103 కోట్లను తక్షణమే రీయింబర్స్‌ చేయాలి.
►పోలవరాన్ని 2021 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించాం. వరదలు తగ్గగానే పనులు ప్రారంభించి శరవేగంగా చేసేందుకు ఈ ఏడాది రూ.16 వేల కోట్లు విడుదల చేయాలి. ప్రాజెక్టు కోసం ఇంకా భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంది.
►రూ.55,548 కోట్లతో ప్రతిపాదించిన పోలవరం సవరించిన అంచనాలను ఆమోదించి ఆ మేరకు నిధులు విడుదల చేయాలి. ఇందులో భూసేకరణ, పునరావాస కార్యక్రమాలకే దాదాపు రూ.30 వేల కోట్లు ఖర్చు అవుతుంది.

ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయండి..
►విభజన చట్టం ప్రకారం కడప స్టీల్‌ ప్లాంట్, దుగ్గరాజపట్నం పోర్టులను కేంద్రమే నిర్మించాలి. దుగ్గరాజపట్నం వద్ద పోర్టు ఏర్పాటు సాధ్యం కాదని, ప్రత్యామ్నాయ స్థలం చూడాలని నీతి ఆయోగ్‌ సూచించింది. దీనికి బదులుగా రామాయపట్నం వద్ద పోర్టు నిర్మించాలి.  
►విశాఖ– చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్, కాకినాడ పెట్రోలియం కాంప్లెక్స్‌లకు తగిన రీతిలో నిధులు విడుదల చేయాలి. సకాలంలో ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేలా సంబంధిత శాఖలను ఆదేశించాలని కోరుతున్నాం.

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఊతమివ్వండి..
►ఏపీలోని వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్, కలహండి తరహాలో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. జిల్లాలు, వాటి ఖర్చు ప్రాతిపదికన ఈ ప్యాకేజీని రూపొందించారు.  బుందేల్‌ఖండ్, కలహండిలో తలసరి రూ.4 వేలు కేటాయించారు. కానీ, ఏపీలో మాత్రం ఆ మొత్తం కేవలం రూ.400 మాత్రమే. అందువల్ల ఈ ప్యాకేజీ మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
►ఉత్తరాంధ్ర, రాయలసీమలోని 7 వెనుకబడ్డ జిల్లాలకు ఆరేళ్లలో రూ.2,100 కోట్లు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.1,050 కోట్లు మాత్రమే వచ్చాయి. మిగతా నిధులు విడుదల చేసి ఈ జిల్లాల అభివృద్ధికి ఊతమివ్వాలి.

నవరత్నాలకు చేయూత ఇవ్వండి..
రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం, సమగ్రాభివృద్ధి కోసం ప్రకటించిన నవరత్నాలు కొత్త శకానికి నాంది పలుకుతున్నాయి. ఇవన్నీ జాతీయస్థాయిలో అమలు చేయదగ్గవి కాబట్టి రాష్ట్రంలో పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టాలని సంబంధిత శాఖలను ఆదేశించాలి. కేంద్రం తరఫున సహకారం అందించాలి.

హోదాతోనే సమగ్రాభివృద్ధి..
ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆవశ్యకత గురించి మీకు ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేశాం. విభజనతో రాష్ట్రం చాలా నష్టపోయింది. ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చినట్లుగా ఆంధ్రప్రదేశ్‌కు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలి. ప్రత్యేక హోదాతోనే పరిశ్రమలకు రాయితీలు వచ్చే అవకాశం ఉంది. తద్వారా పెట్టుబడులను ఆకర్షించవచ్చు.

రాజధాని నిర్మాణానికి నిధులివ్వాలి..
రాజధాని నిర్మాణం కోసం రూ. 2,500 కోట్లు ఇస్తామని కేంద్రం ప్రకటించింది. ఇప్పటిదాకా రూ.1,500 కోట్లు ఇచ్చారు. రాజధాని నిర్మాణం పేరుతో జరిగిన అవకతవకలపై విచారణ చేస్తున్నాం. విచారణ పూర్తయ్యాక శాస్త్రీయ దృక్పథంతో రాజధాని నిర్మాణానికి కావాల్సినవి కోరతాం. ఆ మేరకు నిధులు విడుదల చేసి రాజధాని నిర్మాణానికి తోడ్పాటు అందించాలి.

రెవెన్యూ లోటు భర్తీ చేయండి..
రెవెన్యూ లోటు కింద ఇంకా రూ.18,969.26 కోట్లను విడుదల చేయాలి. సవరించిన లెక్కల మేరకు రెవెన్యూ లోటును భర్తీ చేయాలి.

రైతు భరోసా ప్రారంభోత్సవానికి ప్రధానికి ఆహ్వానం..
వ్యవసాయ పెట్టుబడి కింద రైతులకు ఆర్థిక సాయం అందించే రైతు భరోసా పథకాన్ని నెల్లూరు జిల్లాలో ప్రారంభించేందుకు ఈనెల 15న రాష్ట్రానికి రావాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి జగన్‌ ఆహ్వానించారు. అయితే చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్‌ ఈనెల 11 నుంచి మూడు రోజులపాటు భారత్‌లో పర్యటిస్తుండటం... మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ ఊపిరిసలపనంత బిజీగా ఉన్నందున రైతు భరోసా ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదని పీఎంవో వర్గాలు పేర్కొన్నాయి.

ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి జగన్‌ వెంట వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, బాలశౌరి, రఘురామ కృష్ణంరాజు, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్, అదనపు కార్యదర్శి కె. ధనుంజయరెడ్డి, ఏపీ భవన్‌ ఓఎస్డీ భావన సక్సేనా తదితరులున్నారు. ఢిల్లీ పర్యటనను ముగించుకుని శనివారం రాత్రి 9.25 సమయంలో ముఖ్యమంత్రి జగన్‌ తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు.

కృష్ణా పరీవాహక ప్రాంతం నీటి కొరతను ఎదుర్కొంటోంది. శ్రీశైలం రిజర్వాయర్‌లోకి వరద ప్రవాహం గత 52 ఏళ్లుగా చూస్తే 1,230 టీఎంసీల నుంచి 456 టీఎంసీలకు పడిపోయింది. కృష్ణా జలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టుల ఆయకట్టును స్థిరీకరించాల్సి ఉంది. ఆర్థిక వ్యవస్థను మేలిమలుపు తిప్పే కృష్ణా–గోదావరి నదుల అనుసంధానానికి కేంద్రం ఆర్థికంగా సాయం చేసి ఆదుకోవాలి.
– సీఎం వైఎస్‌ జగన్‌

మరిన్ని వార్తలు