జిల్లా సమగ్రాభివృద్ధికి చర్యలు

4 Sep, 2019 08:08 IST|Sakshi
వైఎస్‌ వివేకా విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేస్తున్న సీఎం జగన్‌

డిసెంబర్‌లో పులివెందుల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

ఇదేనెలలో కుందూ ఎత్తిపోతల.. ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన

యురేనియం ప్రాజెక్టు పరిధిలో రక్షణ చర్యలకు ఆదేశం

నెలనెలా సమీక్షిస్తామన్న సీఎం వైఎస్‌ జగన్‌

ఇడుపుల పాయలో వైఎస్సార్‌కు నివాళి

పులివెందులలో వైఎస్‌ వివేకా విగ్రహావిష్కరణ

సాక్షి, కడప : జిల్లా సమగ్రాభివృద్ధి లక్ష్యంగా జగన్‌ ప్రభుత్వం మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. కడప, పులివెందుల అభివృద్ధికి ఇప్పటికే రూ.250 కోట్ల బడ్జెట్‌  ప్రకటించిన ప్రభుత్వం జిల్లాలో అన్ని పట్టణాలు, ప్రాంతాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించేందుకు సిద్ధమైంది. త్వరలోనే పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు. యురేనియం ప్రాజెక్టు పరిధిలో రక్షణ చర్యల విషయంలో ఉపేక్షించేది లేదని, గతంలో ప్రజలకు హామీ ఇచ్చిన మేరకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి యురేనియం ప్రతినిధులను ఆదేశించారు.

సోమవారం పులివెందుకు వచ్చిన ముఖ్యమంత్రి స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో యురేనియం సమస్యలతో పాటు పులివెందుల అభివృద్ధిపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.  దింవగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పదవ వర్ధంతి సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబ సభ్యులతో కలిసి పులివెందులకు వచ్చారు. ఇడుపులపాయలోని వైఎస్‌ ఘాట్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పార్థనల్లో పాల్గొన్నారు. తర్వాత పులివెందులలో దివంగత  వైఎస్‌ వివేకానందరెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను  పలకరించారు.  వైఎస్‌ వివేకా విగ్రహాన్ని ఆవిష్కరించారు. మధ్యాహ్నం ప్రాంతంలో ఆయన  రోడ్ల భవనాలశాఖ అతిథి గృహానికి చేరుకున్నారు.

రక్షణ చర్యలపై నిర్లక్ష్యాన్ని సహించను– సీఎం
యురేనియం ప్రాజెక్టు వల్ల నష్టం, అన్యాయం జరిగితే సహించేది లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ యురేనియం ప్రాజెక్టు ప్రతినిధులకు తేల్చి చెప్పారు. వేముల మండలం తుమ్మలపల్లి ప్రాంతాలలో ఉన్న యురేనియం ప్రాజెక్టు  సమస్యలపై సీఎం సోమవారం సమీక్ష నిర్వహించారు.  ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాలుష్య సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలన్నారు.  సమస్య పెద్దది కాక మునుపే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఎక్స్‌ఫర్ట్‌ కమిటీ వేసిందన్నారు. కమిటీకి పూర్తి సహకారం అందించి డేటా ఇవ్వాలని సూచించారు. ఈ సమస్యపై ప్రతి నెలా సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు. యురేనియం గ్రామాలకు చిత్రావతి నీరు లింగాల కుడికాలువ నుంచి సరఫరా చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.

పులివెందుల అభివృద్ధిపై..
పులివెందుల అభివృద్ధికి సంబంధించి పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ (పాడ) అధికారులతో సమీక్ష  జరిపారు. పులివెందుల అభివృద్ధికి తీసుకోవాల్సి చర్యలపై ఎంపీ అవినాష్‌రెడ్డి తో పాటు మిగిలిన నేతలు,అధికారులను అడిగి తెలుసుకున్నారు. 15 రోజుల్లో  ఆయా ప్రభుత్వ విభాగాల అధికారులతో మరోమారు సమావేశం కావాలని సీఎం  సూచించారు. ఈ లోపు పనులపై స్పష్టతకు రావాలన్నారు. డిసెంబర్‌లో  జిల్లా వ్యాప్తంగా పలు అభివృద్ధి్ద పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. దీంట్లో బాగంగా  బ్రహ్మం సాగర్‌కు కుందూ నుంచి  ఎత్తిపోతల పథకం, స్టీలు ప్లాంట్‌లకు శంకు స్థాపన చేయనున్నారు. పులివెందులలో పలు అభివృద్ధి పనులకు సైతం శంకుస్థాపన చేయాలని సీఎం నిర్ణయించారు.

సమీక్ష అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌  రోడ్ల భవనాల శాఖ అతిథి గృహంలో అర్జీలతో వేచిఉన్న ప్రజల దగ్గరకు వచ్చి  చిరునవ్వుతో పలకరించారు. వారు ఇచ్చిన వినతులు స్వీకరించారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఎంపీ అవినాష్‌రెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, కలెక్టర్‌ హరికిరణ్, ఎస్పీఅభిషేక్‌ మహంతి, జేసీ గౌతమి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథరెడ్డి, రాచమల్లు శివప్రసాదరెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, రఘురామిరెడ్డి, వెంకటసుబ్బయ్య,  మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌ బాబు, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.    

వైఎస్‌ వివేకా విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం
వేముల : పులివెందులలోని పాల కేంద్రం సమీపంలో మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి విగ్రహాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. తొలుత వివేకా సతీమణి వైఎస్‌ సౌభాగ్యమ్మను పరామర్శించి కుటుంబ సభ్యులతో కాసేపు గడిపారు. ఉదయం 11.15గంటలకు వివేకానందరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులర్పించారు.  వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త శివప్రకాష్‌రెడ్డి, వైఎస్‌ సోదరి విమలమ్మలు పూలమాలలు వేశారు.  కార్యక్రమంలో  జిల్లా ఎమ్మెల్యేలు, కదిరి ఎమ్మెల్యే డాక్టర్‌ సిద్ధారెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి,   వైఎస్‌ వివేకా సోదరులు రవీంద్రనాథరెడ్డి, సుధీకర్‌రెడ్డి, నర్రెడ్డి శివప్రకాష్‌రెడ్డి, డాక్టర్‌ వైఎస్‌ అభిషేక్‌రెడ్డి  పాల్గొన్నారు. 

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీ
ఆర్చరీ క్రీడ (విలువిద్య)కు సంబంధించి ప్రతిభ చూపిన క్రీడాకారులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గోల్డ్‌ మెడల్స్‌ను అందించారు. న్యూజిల్యాండ్‌లో జరిగిన వరల్డ్‌ ఇండోర్‌ ఆర్చరీ చాంపియన్‌షిప్‌–2019లో కడపకు చెందిన ఆర్‌కే సిద్దారెడ్డి (17), పీవీ సాయి శ్రీనివాస్‌ (9) గోల్డ్‌ మెడల్‌ సాధించారు.  సీఎం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో వీరికి గోల్డ్‌ మెడల్స్‌ను అందించి అభినందించారు.  ముఖ్యమంత్రి సహాయ నిధి కింద తొమ్మిది మంది లబ్ధి్దదారులకు సుమారు రూ. 20 లక్షల విలువైన చెక్కులను జగన్‌ అందించారు. ఎస్‌.మహబూబ్‌బీ(పులివెందుల)కి రూ. 5 లక్షలు ..ఎస్‌.నుజ్రత్‌బేగం(కడప) , రామయ్యలకు, కటారి లక్షిమదేవి(చెన్నూరు మండలం రాచిన్నాయపల్లె , ఇ.మల్లేనాయక్‌(కల్లూరుపల్లె), టి.అనసూయ( ఆర్‌.తుమ్మలపల్లె), సుభద్రమ్మ(పైడిపాలెం), వెంకటరమణ(బూచుపల్లె)లకు రూ.2 లక్షలు వంతున, జె.కళావతి(రాచమర్రిపల్లె)కి రూ.లక్ష చెక్కులను అందజేశారు.   

>
మరిన్ని వార్తలు