మాట నిలబెట్టుకున్నారు..

4 Sep, 2019 11:17 IST|Sakshi
పాదయాత్రలో కిడ్నీ రోగులతో మాట్లాడుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

అధికారంలోకి వచ్చిన  100 రోజుల్లోనే అమలు కాబోతున్న పాదయాత్ర హామీలు

 కిడ్నీ రోగులకు ఇప్పటికే రూ. 10వేల పింఛన్‌ అమలు

 తాజాగా 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని పలాసలో నెలకొల్పేందుకు నిర్ణయం 

ఆస్పత్రితో అనుసంధానంగా రీసెర్చ్‌ సెంటర్, డయాలసిస్‌ సెంటర్లు

మంజూరుతో పాటు రూ. 50 కోట్ల నిధులు కేటాయింపు    

రాజకీయం మారుతోందా..? అవుననే అనిపిస్తోంది. నాయకుడు మాటిస్తాడు, మర్చిపోతాడు అన్నదే జనాలకు తెలుసు. హామీ ఎన్నికల ఆయుధమన్నదే ప్రజల నమ్మిక. కానీ ఈ రాజకీయం వేరు. ఈ నాయకత్వం భిన్నం. ఈ పాలన వినూత్నం. కష్టం చెప్పుకున్న వారి చెంపలపై జారిన కన్నీళ్లు ఆయనకు ఇంకా గుర్తున్నాయి. చేతులు పట్టుకుని సాయం చేయమని కోరిన వారి మాటలు ఆయన చెవిలో ఇంకా మార్మోగుతూనే ఉన్నాయి. అన్నింటి కంటే ముఖ్యంగా వారి సమస్యలు పరిష్కరిస్తానని ఇచ్చిన హామీలు ఇంకా ఆయన గుండెల్లోనే ఉన్నాయి. గెలిచి మూడు నెలలైంది. అప్పుడే ఉద్దానాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారిపై యుద్ధం ప్రకటించారు. తిత్లీలో నష్టపోయి సాయం అందక, న్యాయం పొందక నిస్సహాయులుగా మిగిలిన వారిని ఆదుకుంటున్నారు. దశాబ్దాలుగా వేధిస్తున్న తాగునీటి సమస్య పరిష్కారానికి దారి చూపారు. రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని సిక్కోలు ప్రజలు వేనోళ్ల కీర్తిస్తున్నారు.  

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: దశాబ్దాల ఉద్దానం సమస్యకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పరిష్కారం చూపించారు. కిడ్నీ బాధితులకు అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలను నిలబెట్టుకున్నారు. ఇప్పటికే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ. 10వేలు పింఛను అందజేస్తున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తాజా గా మరో ముందడుగు వేసింది. కిడ్నీ బాధితుల కోసం పలాసలో 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, దానికి అనుసంధానంగా రీసెర్చ్‌ సెంటర్, డయాలసిస్‌ యూనిట్‌ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తం యూనిట్‌కు రూ. 50 కోట్లు కేటాయిస్తూ జీఓ కూడా జారీ చేసింది. వాటికి అవసరమైన వైద్య పోస్టులను కూడా మంజూరు చేసింది.  ఉద్దానంలో కిడ్నీవ్యాధిగ్రస్తుల బతుకులు, వెతలు మాటలకు అందనివి. ఈ పరిస్థితులను వైఎస్‌ జగన్‌  పాదయాత్ర సమయంలో దగ్గరుండి చూశారు. వెతలు చూసి చలించిపోయారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ. 10వేల పింఛను, ఆ వ్యాధి మూలాలు తెలుసుకునేందుకు రీసెర్చ్‌ సెంటర్, రోగులకు దగ్గరలో డయాలసిస్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఆ మాటను ఇప్పుడు నిలబెట్టుకున్నారు. కిడ్నీ వ్యాధి బారిన పడిన కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ప్రభుత్వాలు మా రినా ఇక్కడి పరిస్థితులు ఏ మాత్రం మారలేదు. టీడీపీ పాలనలోనైతే పరిస్థితి మరింత దయనీయంగా ఉండేది. మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టి ఆరోగ్యశ్రీలో పథకం వైద్యం అందించే అవకాశం ఉండేది. కానీ చంద్రబాబు ప్రభుత్వం వ్యాధుల కత్తిరింపుల నేపథ్యంలో కి డ్నీ వ్యాధిగ్రస్తులకు న్యాయం జరగలేదు.

గత ప్రభుత్వంలో అరకొర సాయం..
జిల్లాలో ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, వజ్రపుకొత్తూరు, పలాస, మందస, సోంపేట మండలాల్లో 16వేలకు పైగా కిడ్నీ రోగులు ఉన్నారు. అందులో మందస మండలం ఒక్క లోహరిబందలోనే 1500మందికి పైగా కిడ్నీ రోగులు ఉన్నా రు. గత ప్రభుత్వం ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు 370మందికి  రూ. 2500 పింఛ ను ఇస్తూ ఉండేది. ఎన్నికలకు రెండు నెలలు ఉండగా దాన్ని రూ. 3500కు పెంచింది. అదనంగా మరో 220 మందికి లబ్ధి చేకూర్చింది. కానీ ఈ డబ్బు బాధితులకు ఎంత మాత్రమూ సరిపోయేది కాదు. పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో ప్రజాసంకల్ప పాదయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేనున్నానంటూ కిడ్నీ రోగులకు భరోసా ఇచ్చారు. ప్రతి కిడ్నీ రోగికి అధికారంలోకి రాగానే రూ. 10వేలు పింఛ ను ఇస్తానని, దగ్గరలోనే డయాలసిస్‌ యూనిట్‌తో పాటు కిడ్నీ రీసె ర్ఛ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. అంతేకాకుం డా కిడ్నీ వ్యాధి తీవ్రంగా ఉన్నందున 200 పడకలతో ఆస్పత్రి కూడా నెలకొల్పుతానని, అధికారంలోకి వచ్చిన వెంటనే శంకుస్థాపన చేసి పనులు చేపడుతానని హామీ ఇచ్చారు. అక్కడితో ఆగకుండా తాగునీరు కలుషితమైనందున ప్రతి గ్రామానికి శుద్ధ జలాలను అందిస్తామని ధైర్యం కలిగించారు.

మాట మర్చిపోకుండా.. 
వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే కి డ్నీ వ్యాధిగ్రస్తులనే ప్రాధాన్యత అంశంగా తీసుకున్నారు. నెలవారీ ఇచ్చే పింఛనును రూ. 10వేలకు పెంచారు. వెంటనే అమల్లోకి తెచ్చి బాధితులకు అందజేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రిలో డ యాలసిస్‌ చేసుకుంటున్న 507మందికి, ప్రైవే టు ఆస్పత్రిలో డయాలసిస్‌ చేసుకుంటున్న 219 మందికి నెలకి రూ. 10వేలు చొప్పున మొత్తం 726 మందికి అందజేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో డయాలసిస్‌ రోగుల కోసం పింఛ ను కింద రూ. 20లక్షలు వెచ్చించగా, అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పింఛన్ల కింద నెలకి రూ. 72లక్షల 60వేలు ఖర్చు పెడుతోంది. 

అంతటితో ఆగని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  వైద్యులు, నిపుణులు, మేధావులు, అధికారులతో సుదీర్ఘ అధ్యయనం చేసి బాధ్యతలు స్వీకరించిన 100 రోజుల్లోనే  ఒక పరిష్కార మార్గాన్ని అన్వేషించారు. వ్యాధిని అదుపులోకి తీసుకురావాలంటే మూలాలు తెలుసుకోవాలని, దాని కోసం ఏకంగా రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే, దగ్గరలో డయాలసిస్‌ సెంటర్‌తో పాటు 200 పడకల సూపర్‌ స్పెషాలటీ ఆస్పత్రిని కూడా నెలకొల్పాలని నిర్ణయించారు. ప్రకటన చేయడమే కాకుండా దానికి సంబంధించిన జీఓ కూడా విడుదల చేశారు. దానితో పాటే రూ. 50కోట్ల నిధులు, వైద్యపోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మంజూరైన పోస్టులివి..
రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో ప్రభుత్వ సిబ్బందిని నియమించాలని నిర్ణయించింది. రెగ్యులర్‌ ప్రాతిపదికన ఐదు పోస్టులు, కాంట్రాక్ట్‌ పద్దతి కింద 98, సర్వీస్‌ ఔట్‌సోర్స్‌ కింద 60పోస్టులను మంజూరు చేసింది. 

రెగ్యులర్‌ పోస్టులు..
అడిషనల్‌ డైరెక్టర్‌ హోదాలో మెడికల్‌ సూపరింటెండెంట్, సీఎస్‌ఆర్‌ఎంఓ, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్, ఇద్దరు సీనియర్‌ అసిస్టెంట్ల పోస్టులను రెగ్యులర్‌ హోదాలో భర్తీ చేయనుంది.

 కాంట్రాక్ట్‌ పోసులు..
యూరాలిజిస్టు పోస్టులు రెండు, వాస్క్యూలర్‌ సర్జన్‌ పోస్టు ఒకటి, జనరల్‌ ఫిజీషియన్‌ పోస్టులు నాలుగు, జనరల్‌ సర్జన్‌ పోస్టులు రెండు, అనస్తీటిస్టు పోస్టులు నాలుగు, రేడియోలజిస్టు పోస్టు ఒకటి, పెథాలజిస్టు పోస్టు ఒకటి, మైక్రో బయాలజిస్టు పోస్టు ఒకటి, బయో కెమిస్టు పోస్టు ఒకటి, జనరల్‌ డిప్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు 12, నూట్రీషనిస్టు పోస్టు ఒకటి, 60 స్టాఫ్‌ నర్సు పోస్టులు, ఇద్దరు రీసెర్చ్‌ ల్యాబ్‌ ప్రాజెక్టు మేనేజర్‌ పోస్టులు, రీసెర్చ్‌ సైంటిస్టు పోస్టులు రెండు, సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో పోస్టులు రెండు, జూనియర్‌ రీసెర్స్‌ ఫెలో పోస్టులు–2ను కాంట్రాక్ట్‌ పద్దతిలో భర్తీ చేయనున్నారు. మిగతా 60 పోస్టులను ఔట్‌ సోర్స్‌ పద్ధతిలో నియమించనున్నారు.

మరో అడుగు ముందుకు..
ఉద్దానంలో కిడ్నీ సమస్యను అధిగమించేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో ముందడుగు వేశారు. వ్యాధుల విజృంభణకు ప్రాథమిక కారణంగా చెబుతున్న మంచినీటి సమస్యను పరి ష్కరించాలని నిర్ణయించారు. ఉద్దానంలోని ఇ చ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, పలాస మండలాల్లోని 807 గ్రామాలకు శుద్ధ జలాలను అందించేందుకు రూ. 600కోట్లతో భారీ మంచినీటి పథకాన్ని నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి జీవో కూడా విడుదల చేశారు. తొమ్మిది క్లస్టర్లలో నీటిసరఫరాకు ప్రణాళిక రూపొందించారు.  

సమస్యలు తీరుతాయి..
ఇచ్ఛాపురం నియోజకవర్గంలో కిడ్నీవ్యాధి బారిన పడిన వారు విశాఖ, శ్రీకాకుళం వెళ్లి వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. దీంతో ప్రయాణ ఖర్చులు, మందుల ఖర్చులతో ఆర్థికంగా చితికిపోతున్నాం. ప్రస్తు తం ప్రభుత్వం  రూ.పది వేల పింఛన్‌ అందజేస్తుండడంతో మాలాంటి వారికి  ఎంతో  ఆసరా కలిగింది. పలాసలో   కిడ్నీ రోగుల కోసం ఆస్పత్రి నిర్మిస్తే మా వంటి వారికి ఎంతో ఉపయోగపడుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి  ఈ ప్రాంత ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. 
– బైరి కూర్మారావు, బెంకిలి, డయాలసిస్‌ రోగి

చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు..
దశాబ్దాల పాటు ఉద్దానం ప్రాంతాన్ని పీడిస్తున్న కిడ్నీ వ్యాధి బారిన పడి వందలాది మంది ఉద్దానం వాసులు కాటికెళ్లారు. ప్రభుత్వాలు మారాయి కానీ ఈ ప్రాంత రోగుల గురించి ప ట్టించుకునే నాథుడే లేకపోయారు. కానీ నాడు జగతిలో జరిగిన సమావేశంలో మావంటి రోగుల పక్షాన నిలిచి, ఇచ్చిన మాటకు కట్టుబడిన ఏకైక రాజకీయ నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఆయన ఇప్పుడు మా కోసం తీసుకున్న నిర్ణయం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది. 
– చంద్రు మజ్జి,  కిడ్నీ వ్యాధిగ్రస్తుడు, తిప్పనపుట్టుగ, ఇచ్ఛాపురం మండలం 

మరిన్ని వార్తలు