ఆశల పల్లకి

30 Aug, 2019 10:38 IST|Sakshi
రోడ్డు లేకపోవడంతో కాలినడకన ఏజెన్సీలోని ఓడ్రుబంగి గ్రామానికి వెళ్తున్న గర్భిణులు, బాలింతలు

గత ప్రభుత్వ పాలనలో జిల్లాలో పడకేసిన అభివృద్ధి

జిల్లాపై ప్రస్తుత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి

సాలూరులో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం

కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్‌ కళాశాల

పార్వతీపురంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి

నేడు జిల్లాలో సమస్యలపై మంత్రుల సమీక్ష

విజయనగరం... మొదటినుంచీ వెనుకబడిన ప్రాంతంగా ముద్రపడిన జిల్లా. గత ప్రభుత్వ హయాంలో ఆ ముద్ర కాస్తా మరింత ఎక్కువైంది. ఇక్కడి అభివృద్ధిని పూర్తిగా పడకేయించారు. విభజన హామీలతో జిల్లాకు రావాల్సిన అవకాశాలను వదిలేశారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికోసం విడుదలైన నిధులు సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఇక్కడి ప్రజల సమస్యలను పట్టించుకోవడం మానేశారు. తాజాగా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక అసలు అభివృద్ధి అంటే ఏమిటో జిల్లావాసులు తెలుసుకుంటున్నారు. ఇంకా మిగిలిన సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు జిల్లాకు చెందిన మంత్రులతోపాటు... ఇన్‌చార్జి మంత్రి శుక్రవారం రానున్నారు. 

సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లాపై రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. పూర్తిగా వెనుకబడిన జిల్లాను అభివృద్ధి పథాన పయనింపజేయడానికి పలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా సాలూరులో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతుండగా కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్‌ కళాశాల, పార్వతీపురంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సింది గా అధికారులను ఆదేశించారు. మంత్రులు సైతం జిల్లాను ప్రత్యేకంగా చూస్తున్నారు. జిల్లాలోని సమస్యల్ని పరి ష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. రహదారుల అభివృద్ధి, తాగునీటి సమస్యల పరిష్కారంపై చర్యలు తీసుకోవాల్సి ఉం ది. ఈ క్రమంలో జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు, ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, మంత్రి బొత్స సత్యనారాయణ నిర్వహించనున్న సమీక్షకు ప్రాధాన్యం సంతరించుకుంది. జిల్లాలోని నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలపై జిల్లావాసులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

విజయనగరం రోడ్ల విస్తరణ అస్తవ్యస్తం..
విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో అభివృద్ధి, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ పేరిట టీడీపీ పాలకవర్గం హయాంలో 2014 నుంచి ఇప్పటి వరకు సుమారు రూ. 50 కోట్లతో  15 రోడ్లు విస్తరించేందుకు ప్రతిపాదించింది. అందులో నాలుగు మార్గాల్లో మాత్రమే శతశాతం పనులు పూర్తికాగా మరో నాలుగు రోడ్లలో పనులు చివ రి దశలో ఉన్నాయి. మిగిలిన మార్గాల్లో విస్తరణకోసం భవనాలు తొలగించి వదిలివేయటం తో అంతా అస్తవ్యస్తంగా తయారైంది. దీనివల్ల నగర ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు.  పలు రహదారుల్లో నష్టపోయిన బాధితులకు ఇచ్చిన పరిహారంలో టీడీపీ పాలకవర్గం వివక్ష చూపించటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపాధి కల్పించే రెండు ప్రధాన జూట్‌మిల్లులు మూతపడి నాలు గేళ్లవుతున్నా నాటి పాలకులు పట్టించుకోకపోవడంతో సుమారు 12వేల కార్మిక కుంటుంబాలు ఉపాధిని కోల్పోయాయి.

నీటి పథకాలున్నా... ఆయకట్టుకు అవస్థలే...
బొబ్బిలి నియోజకవర్గంలో వీఆర్‌ఎస్‌ అదనపు ఆయకట్టు ద్వారా 5వేల ఎకరాలకు సాగునీరందించాలని తలపెట్టిన పనులను కాంట్రాక్టర్‌ మధ్యలోనే విడిచిపెట్టేశారు. పాత ఆయకట్టులోని కాలువలను మరమ్మతు చేయకపోవడం, పూడికలు తీయకపోవడం వల్ల రైతులు శ్రమదానం చేసుకోవాల్సి వస్తోంది. గ్రోత్‌సెంటర్‌లో 1240 ఎకరాల ఏపీఐఐసీ భూములను కంపెనీలు ఏర్పాటు చేస్తామని రైతుల వద్ద అతి చౌకగా కొనుగోలు చేసినవారు ఇప్పుడు వాటి చుట్టూ ప్రహారీ నిర్మించి స్థలాలను సొంతం చేసుకున్నారు తప్ప పరిశ్రమలు మాత్రం ఏర్పాటు చేయలేదు.

రోగాల జోన్‌గా సాలూరు..
సాలూరు ప్రాంతంలో ఆరోగ్యపరంగా రెడ్‌జోన్‌గా అధికారులు ప్రకటించారు. ఈ ఏడాది జిల్లాలోనే అధికంగా 28 డెంగీ కేసులు ఇక్కడ నమోదయ్యాయి. అనధికారికంగా వందకు పైగా డెంగీ కేసులుండవచ్చు. గురుకులాల్లో నేటికీ విద్యార్థులకు నోట్‌పుస్తకాలు, యూనిఫాం రాలేదు. గురుకులాలను తాగునీటి సమస్య వెంటాడుతోంది. వెంగళరాయ సాగర్‌ అక్విడెక్టు, ఆండ్ర, వెంగళరాయిసాగర్, పెద్దగెడ్డ ఆధునికీకరణ, పెద్దగెడ్డ ఎడమకాలువ పనులు చేయాల్సి ఉంది. గిరిశిఖర గ్రామాల్లో చెక్‌డ్యాంలు నిర్మించాలి. చీపురుపల్లిలో ఇందిరమ్మ సుజలధార పథకం పైప్‌లైన్లు శిథిలమయ్యాయి. దీనివల్ల నిత్యం లీకులతో పట్టణానికి సక్రమంగా సాగునీరు అందడం లేదు.

రహదారుల్లేని గిరిజన ప్రాంతాలు..
కురుపాం నియోజకవర్గంలో ప్రధానంగా రహదారి సౌకర్యాలు వేధిస్తున్నాయి. కొన్ని గిరిశిఖర గ్రామాలకు రోడ్డు ఫార్మేషన్‌ పనులు చేపట్టినప్పటికీ, మెటల్, తారు రోడ్డు వంటి నిర్మాణాలు చేపట్టకుండా వదిలేశారు. పాఠశాలలకు పక్కా భవనాలు లేవు. కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం వద్ద నిర్మించిన జంఝావతి ప్రాజెక్టు లక్ష్యం నేటికీ పూర్తికాలేదు. ఒడిశాతో ఉన్న వివాదాన్ని దృష్టిలో ఉంచుకుని దివంగత మహానేత 2006లో రూ.5కోట్లతో రబ్బర్‌ డ్యాం ద్వారా తాత్కాలికంగా నీటిపారుదల సౌకర్యం కల్పించారు. కానీ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావాల్సి ఉంది. ముఖ్యంగా పూర్ణపాడు–లాబేస్‌ వంతెన నిర్మాణం జరిగితే కొమరాడ, జియ్యమ్మవలస, కురుపాం, గుమలక్ష్మిపురం మండలాల ప్రజల సమస్య పరిష్కారం అవుతుంది.

కష్టాల్లో భీమసింగి..
భీమసింగి సహకార చక్కెర కర్మాగారం కష్టాల్లో ఉంది. దీనిని ఆధునికీకరణ చేసి, రైతులకు భరోసా కల్పించాల్సి ఉంది. శాసనాపల్లి–పెదవేమలి, అలమండ–జె.డి.వలస మధ్య వంతెనలు నిర్మించాల్సి ఉంది. ఎస్‌.కోట, వేపాడ మండలాల పరిధిలోని గిరిజన గ్రామాలను షెడ్యూల్‌ ఏరియాల్లో చేర్చాలన్న డిమాండ్‌ ఉంది. చిలకలగెడ్డ ఆనకట్ట నిర్మించడం ద్వారా 2000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు వస్తుంది. రైవాడ జలాశయం నుంచి అదనపు ఆయకట్టు 2000 ఎకరాలకు నీరందించే ప్రతిపాదన అమలుకోసం ఎదురు చూస్తోంది.

చుట్టూ ప్రాజెక్టులున్నా... సాగు సున్నా...
పార్వతీపురానికి సమీపంలోనే జంఝావతి, వరహాల గెడ్డ ఉన్నప్పటికీ సాగునీరు అందక నిత్యం అక్కడ కరువు తాండవిస్తోంది. పార్వతీపురం పురపాలక సంఘం పరిధిలో నిత్యం ఎప్పుడు బురదనీరే సరఫరా అవుతోంది. గజపతినగరం నియోజకవర్గానికి సాగునీటి కొరత వేధిస్తోంది. తాగు నీటికి సైతం మహిళలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. నెల్లిమర్ల పట్టణాన్ని తాగునీటి సమస్య పట్టిపీడిస్తోంది. పట్టణ జనాభాకు సరిపడినన్ని పథకాలు లేకపోవడం స్టోరేజీ ట్యాంకులు కూడా పూర్తిస్థాయిలో లేకపోవడంతో ఇబ్బంది కలుగుతోంది. రామతీర్థం, సారిపల్లి గ్రామాలకు సంబంధించిన తాగునీటి పథకాలు చంపావతి నదిలో ఉన్నాయి. నదిలో భూగర్బ జలాలు గణనీయంగా తగ్గిపోవడంతో ఈ పంచాయితీలకు కూడా తాగునీటి సమస్య ఏర్పడింది.

మరిన్ని వార్తలు