ప్రగతిపథాన పులివెందుల

20 Sep, 2019 08:33 IST|Sakshi
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

వివిధ అభివృద్ధి పనులకు సీఎం ఓకే

కీలక నిర్ణయాలు తీసుకున్న జగన్‌

30 రోజులకోసారి అభివృద్ధిపై భేటీ

విజయవాడలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి

సాక్షి, కడప : పులివెందుల నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కార్యక్రమాల అమలును వేగవంతం చేయాలని కలెక్టర్‌ హరికిరణ్, వివిధ శాఖల కార్యదర్శులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డితో కలిసి వివిధ ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్, పాడా ఓఎస్‌డీలతో ఆయన పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈనెల 2న పులివెందులలో సీఎం సమీక్షించిన  అంశాలు, ప్రతిపాదనలపై  కలెక్టర్‌ కార్యచరణను సమర్పించారు.

దీనిపై సీఎం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ కుడి కాలువ, పులివెందుల బ్రాంచ్‌ కెనాల్, గండికోట ఎత్తిపోతల పథకం, మైక్రో ఇరిగేషన్‌ పథకాలకు సంబంధించి ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి, గతంలో పనులు చేపట్టిన ఏజెన్సీలు ముందుకు రాకపోతే దీనికి సంబంధించి కొత్త ప్రతిపాదనలు సమర్పించాలని సీఎం ఆదేశించారు.  సీబీఆర్‌ కింద సూక్ష్మసేద్యం అమలు 59,400 ఎకరాలకు గాను ఐదు వేల ఎకరాల్లో మాత్రమే అమలు చేయడం జరిగిందన్నారు.  పీబీఆర్‌ కింద 96,900 ఎకరాలకుగాను 10 వేల ఎకరాలలో పథకం అమలైందన్నారు. ఈ రెండు ప్రాజెక్టుల కింద మిగిలిన అన్ని ఎకరాలలో ఈ పథకం అమలుకు వెంటనే కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.

రూ.1197 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు
జీఎన్‌ఎస్‌ఎస్‌ పథకం ద్వారా చక్రాయపేట ఎత్తిపోతల పథకం కింద చక్రాయపేట, రామాపురం, రాయచోటి ప్రాంతాలకు సాగు, తాగునీరు ఇవ్వడానికి హంద్రీ–నీవా కాలువ ద్వారా నీటిని నింపడానికి రూ.1197 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు తయారు చేయాలని సీఎం జగన్‌ చెప్పారు. గాలేరు–నగరి సుజల స్రవంతి మెయిన్‌కాలువ ద్వారా పులివెందుల బ్రాంచ్‌ కెనాల్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా అలవలపాడు, పెండ్లూరు, వేంపల్లెకు సాగునీరు ఇవ్వడానికి రూ. 50 కోట్ల అంచనాలు సిద్దం చేయాలన్నారు. సీబీఆర్‌ నుంచి ఎర్రబల్లె ట్యాంకు లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు నీటిని అందించడానికి రూ.108 కోట్ల అంచనాలు వేయాలన్నారు.

సీబీఆర్‌ నుంచి ప్రత్యేకంగా పైపులైన్‌ ద్వారా మైక్రో ఇరిగేషన్, యూసీఐఎల్‌ ప్రభావిత ఏడు గ్రామాలకు నీటిని అందించేందుకు ప్రాధాన్యత పరంగా ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. రూ.30 కోట్ల అంచనాతో గ్రౌండ్‌ వాటర్‌ రీఛార్జి నిర్మాణాలు, చెరువులు, చెక్‌డ్యాముల అభివృద్ది, రూ.30 కోట్లతో భూగర్బజల సంరక్షణ పనులు, మోగమూరు వంక వద్ద 48 కిలోమీటర్ల వరకు ఇరువైపుల వాగులు, వంకలు, చెక్‌డ్యాములలో వరద ప్రవాహ నీటిని నిల్వ చేసుకోవడానికి, వేసవిలో తాగునీటి రవాణాకు గతంలో ఉన్న పెండింగ్‌ బిల్లులు రూ. 2 కోట్ల చెల్లింపులకు,  సీపీడబ్లు్యఎస్‌ పథకం మరమ్మత్తులకు రూ.2.15 కోట్ల నిధుల విడుదలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. వేంపల్లె, సింహాద్రిపురం గ్రామ పంచాయతీల్లోభూగర్బ డ్రైనేజీకి, నియోజకవర్గంలో బీటీ రోడ్లు, వివిధ రహదారులను కలిపే అప్రోచ్‌ బీటీ రోడ్లకు రూ.184 కోట్ల మంజూరుకు అంగీకారం తెలిపారు.  పులివెందులలో వైద్యకళాశాల ఏర్పాటుకు..డయాల్సిస్‌ యూనిట్‌ మంజూరుకు జగన్‌ ఆమోదం తెలిపారు. ఽ

సబ్‌స్టేషన్ల పనులు చేపట్టండి
వేముల మండలం నల్లచెరువుపల్లె గ్రామంలో 132 కేవీ సబ్‌స్టేషన్,  33/11 కేవీ సామర్థ్యం గల 16 సబ్‌స్టేషన్లు జగన్‌ మంజూరు చేశారు. వీటిలో మొదటి దశలో ఉన్న ఐదు సబ్‌స్టేషన్ల పనులను వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. రూ.54 కోట్ల అంచనాతో పులివెందుల మున్సిపాలిటీలో మిగిలిపోయిన భూగర్బ డ్రైనేజీ పనులు, రూ. 6.15 కోట్లతో 16 స్మశాన వాటికల ప్రహారీగోడల నిర్మాణం, నియోజకవర్గంలో ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న పెండింగ్‌ పనులకు రూ.7 కోట్ల నిధుల మంజూరుకు సీఎం అంగీకరించారు.

పాఠశాలల అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ. 25.87 కోట్లు, వేంపల్లె జెడ్పీ హైస్కూలు తరగతి గదులు, ఇతర మౌలిక వసతుల కల్పనకు రూ. 3.55 కోట్లు, బాలికల జెడ్పీ హైస్కూలులో తరగతి గదులు, ఇతర మౌలిక సదుపాయాలకు రూ. 2.25 కోట్లు, వేముల, చక్రాయపేటలలో ఆదర్శ పాఠశాలలు, వేంపల్లెలో కేజీబీవీ పాఠశాలకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆదేశించారు. వేంపల్లెలో ఉర్దూ జూనియర్‌ కళాశాల మంజూరుకు, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో సివిల్, ఇతర పనులకు రూ. 9.97 కోట్లు, సింహాద్రిపురంలో పాలిటెక్నిక్‌ కళాశాలలో సివిల్‌ ఇతర పనులకు రూ. 4.57 కోట్లతో పనులు చేపట్టేందుకు అంగీకారం తెలిపారు. తొండూరు, లింగాల మండలంలోని ఇప్పట్ల, చక్రాయపేట మండలంలోని గండి, పులివెందుల మండలంలోని బెస్తవారిపల్లెలో ఉన్న ఏపీ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల మరమ్మతులకు రూ. 11.30 కోట్లను మంజూరు చేశారు.

వీటితోపాటు వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్, ఏపీ కార్ల్, పశుసంవర్దకశాఖ, పర్యాటకం, దేవాదాయశాఖ, గృహ నిర్మాణం, రవాణా, బీసీ కార్పొరేషన్, సాంఘిక సంక్షేమశాఖ, ఇతర శాఖలకు సంబంధించిన వివిధ పనులు చేపట్టేందుకు, వాటి అమలుకు సంబంధించిన అంశాలపై సమీక్షించి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఇప్పటి నుంచి ప్రతి 30 రోజులకు ఒకసారి పులివెందుల నియోజకవర్గ అభివృద్దిపై సమీక్షిస్తామని, ప్రస్తుత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వచ్చే సమావేశంలో ఎంతమేర పురోగతి సాధించారో తెలియజేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కార్యదర్శులు ధనుంజయరెడ్డి, సాల్మన్‌ ఆరోగ్యరాజ్, ఇరిగేషన్‌శాఖ చీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ దాస్, బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కరికాలవలవన్, పలు శాఖల ప్రిన్సిపల్‌ సెక్రటరీలు, పరిపాలన కార్యదర్శులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు