ఉన్నతాధికారులకు ప్రతివారం ‘కాఫీ టుగెదర్‌’ : సీఎం జగన్‌

27 Aug, 2019 14:50 IST|Sakshi

కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం జగన్‌ సూచనలు

సాక్షి, అమరావతి : జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కాఫీ టుగెదర్‌ కార్యక్రమం పేరుతో ప్రతివారం కలుసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. తద్వారా అధికారుల మధ్య సమన్వయం కుదిరి భూవివాదాల పరిష్కారానికి అవకాశముంటుందని అన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన స్పందన రివ్యూ కార్యక్రమంలో  ఆయన మాట్లాడుతూ..

‘ప్రతి మంగళవారం ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ‘కాఫీ టుగెదర్‌’ కార్యక్రమం పేరుతో కలుసుకోవాలి. భూవివాదాలకు సంబంధించిన జాబితా ఇచ్చి పుచ్చుకోవాలి. ఈ జాబితాను తహశీల్దార్లకు బుధవారం పంపాలి. గురువారం తహశీల్దార్, ఎస్సై, సర్వేయర్, ఆర్‌ఐ, వీఆర్వోలు కలిసి కూర్చోవాలి. భూవివాదాల పరిష్కారంపై దృష్టిపెట్టాలి. చాలా చోట్ల భూవివాదాలు శాంతి భద్రతల సమస్యగా మారాయి. ప్రకాశం జిల్లా కలెక్టర్, ఎస్పీలు చేసిన ఈ  ప్రతిపాదనలు బాగున్నాయి. మిగతా అధికారులు ఇది పాటించాలి. మళ్లీ చెప్తున్నా.. ఎక్కడా అవినీతి ఉండకూడదు’ అన్నారు.

సెప్టెంబర్‌లో ప్రారంభం..
వచ్చే నెల (సెప్టెంబర్‌) నుంచి నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకాకుళంలో మొదటగా ప్రారంభిస్తామని సీఎం జగన్‌ తెలిపారు. ఇప్పటిదాకా ప్రజలకు అందించే బియ్యంలో నాణ్యత లేక వారు తినడంలేదని చెప్పారు. ప్రజలు తినగలిగే బియ్యాన్నే ప్రభుత్వం ఇవ్వాలని స్పష్టం చేశారు. చిత్రావతిలో నీళ్లు నిలపాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. అందుకోసం రూ.52 కోట్లు అవసరమవుతాయని కలెక్టర్‌ అడిగితే వెంటనే ఇవ్వండని అధికారులకు చెప్పానని గుర్తు చేశారు. ఇక ఈ కార్యక్రమంలో మంత్రులు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు