కరోనా : సీఎం జగన్‌ వీడియో సందేశం

4 Apr, 2020 17:45 IST|Sakshi

సాక్షి,  అమరావతి : ఢిల్లీలోని మర్కజ్‌ సమావేశానికి వెళ్లిన వారిలో ఎక్కువ మందికి కరోనా వైరస్‌ సోకడం దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కరోనా కాటుకు కుల, మత, ప్రాంత బేధాలు లేవని, అందరు కలిసి ఐక్యంగా యుద్దం చేస్తేనే ఈ మహమ్మారిని తరిమేయడం సాధ్యమవుతుందన్నారు. కరోనా సృష్టిస్తున్న విపత్కర పరిస్థితిలో సీఎం  జగన్‌ శనివారం రాష్ట్ర  ప్రజలకు వీడియో సందేశాన్ని ఇచ్చారు.  భౌతిక దూరం పాటిస్తూ కరోనాపై పోరాటం చేయాలని కోరారు.

‘ఢిల్లీలో జరిగిన ఒక సమావేశానికి అనేక దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. కొందరు విదేశీ ప్రతినిధులకు కరోనా వైరస్‌ఉండటంతో మన దేశంలోని ప్రతినిధులకు కరోనా వైరస్‌ సోకింది. మన దేశంలో కూడా అనేక మంది ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు. ఏ ఆధ్యాత్మిక కేంద్రంలో అయినా ఇలాంటివి జరగొచ్చు. జరిగిన సంఘటనను దురదృష్టకరంగా చూడాలి తప్ప ఏ ఒక్కరికి ఆపాదించవద్దు. ఈ సమయంలో భారతీయులంతా ఒక్కటిగా ఉండాలి. కరోనా కాటుకు కుల, మత, ప్రాంత బేధాల్లేవు. కంటికి కనిపించని శత్రువుతో మనం పోరాటం చేస్తున్నాం. అందరూ కలిసి ఐక్యంగా యుద్దం చేయాలి. కరోనా బాధితులను తప్పు చేసినట్లుగా భావించవద్దు . మనమంతా వారి పట్ల ఆపాయ్యతను చూపాలి’ అని సీఎం జగన్‌ అన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆదివారం నాడు ప్రతి ఒక్కరు దీపాలు, క్యాండిల్స్‌, టార్చిలైట్‌, సెల్‌ఫోన్‌లైట్‌ వెలిగించాలని కోరారు. మనం ఇచ్చే ఈ సంకేతం గొప్ప ఆదర్శంగా ఉంటుందని సీఎం జగన్‌ పేర్కొన్నారు. 

వారికి పూర్తి జీతం
రాష్ట్రంలో కరోనా మహమ్మారిపై పోరాటంలో ముందు వరుసలో నిలిచిపోరాడుతున్న వైద్య ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులపై సీఎం జగన్ ప్రశంసల జల్లు కురిపించారు. వైద్య ఆరోగ్య, పోలీసు, పారిశుద్ధ్య సిబ్బందికి మరింత ప్రోత్సాహం, మద్దతు అందించే చర్యల్లో భాగంగా పూర్తి జీతం ఇస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఎంతో కష్టమైనా కూడా వారికి అండగా నిలవాలని నిర్ణయించామని తెలిపారు. ఇక ఇతర ఉద్యోగులకు జీతాలు వాయిదా వేశామని, ఈ విషయంపై అందరితో చర్చించి, వారి అంగీకారం కూడా తీసుకుంటామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు