రేపు విశాఖ నగరానికి సీఎం జగన్‌ రాక

3 Dec, 2019 08:07 IST|Sakshi

సాక్షి, ప్రతినిధి, విశాఖపట్నం: పాకిస్థాన్‌పై విజయానికి ప్రతీకగా ఏటా డిసెంబర్‌ 4న నిర్వహించే నౌకాదళ దినోత్సవానికి ఈ ఏడాది ముఖ్య అతి«థిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు. విశాఖ రామకృష్ణా బీచ్‌లో ఈసారి సీఎం సమక్షంలో  నేవీ డే విన్యాసాలు నిర్వహించనున్నారు. తూర్పు నౌకాదళ(ఈఎన్‌సీ) చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ అతుల్‌ కుమార్‌ జైన్‌ ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి హాజరు కావడం ఖరారైంది. ఆ మేరకు సీఎం కార్యాలయం నుంచి బుధవారం నాటి పర్యటన షెడ్యూల్‌ విడుదలైంది. బుధవారం మధ్యాహ్నం 2గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి ముఖ్యమంత్రి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరుతారు. 2.20 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు.

విమానంలో మధ్యాహ్నం 3.10 గంటలకు విశాఖ విమానాశ్రయం చేరుకుని 3.40 గంటలకు సర్క్యూట్‌ హౌస్‌కు విచ్చేస్తారు. సాయంత్రం 4 గంటలకు సర్క్యూట్‌ హౌస్‌ నుంచి నేవీ విన్యాసాలు జరిగే ఆర్‌కే బీచ్‌కు  బయలుదేరుతారు. సాయంత్రం 5.30 గంటల వరకు అక్కడ జరిగే నేవీ డే విన్యాసాలు, ప్రదర్శనలను తిలకిస్తారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి సర్క్యూట్‌ హౌస్‌కు చేరుకుంటారు.  6.10 గంటలకు నేవీ హౌస్‌కు బయలుదేరతారు. 6.20 నుంచి 7 గంటల వరకు అక్కడ జరిగే ఎట్‌ హోం  కార్యక్రమంలో పాల్గొంటారు. ఏడు గంటలకు నేవీ హౌస్‌ నుంచి నేరుగా విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరుతారు. రాత్రి 7.30 గంటలకు విమానంలో బయలుదేరి 8.10 గంటలకు విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రాత్రి 8.40గంటలకు తాడేపల్లిలోని సీఎం నివాసం చేరుకుంటారు. ఈ మేరకు సీఎం పర్యటన ఖరారైనట్టు జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ వెల్లడించారు

సీఎం దంపతులకు ఆహ్వానం
నేవీ డే ఉత్సవాలకు సతీసమేతంగా హాజరుకావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఈఎన్‌సీ చీఫ్‌ జైన్‌ కోరారు. ఇటీవల అమరావతిలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ ఉత్సవాలకు సీఎం దంపతులు విచ్చేయాలని ఈఎన్‌సీ చీఫ్‌ అభిలషించారు.  

మరిన్ని వార్తలు