పండుగలా వస్తున్నాడు

28 Dec, 2019 08:05 IST|Sakshi

ఉత్తరాంధ్ర ప్రగతి సాధకుడి ఘనస్వాగతానికి ఏర్పాట్లు

24 కి.మీ. పొడవునా మానవహారంతో  పూలజల్లులు

సీఎం రాక.. విశాఖ ఉత్సవాలతో ఊరంతా సంబరం

కార్యనిర్వాహక రాజధానితో  వెనుకబాటు నుంచి  ఉత్తరాంధ్రకు విముక్తి

ఎగ్జిక్యూటివ్‌ రాజధాని ప్రతిపాదన తర్వాత తొలిసారి విశాఖకు వైఎస్‌ జగన్‌

రూ.1300 కోట్ల అభివృద్ధి పనులకు నేడు శ్రీకారం 

సాక్షి, విశాఖపట్నం:  అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ప్రతిపాదన చేసిన అనంతరం తొలిసారిగా నగరానికి వస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జేజేలు పలికేందుకు ప్రజానీకం ఎదురుచూస్తోంది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి బాటలు వేస్తున్న ముఖ్యమంత్రి ఘన స్వాగతాన్ని అందించి కృతజ్ఞతలు తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. చిన్నా, పెద్దా, ఊరు వాడా ఏకమై  రహదారికి ఓవైపున నిలబడి ఒకటి. ఏకంగా 24 కిలోమీటర్ల మేర మానవహారంగా ఏర్పడి స్వాగత తోరణం కట్ట నున్నారు. రాజధానిగా ప్రతిపాదించిన కొద్ది రోజుల్లోనే విశాఖ అభివృద్ధికి బీజం వేస్తూ  ఏకంగా రూ.1285.32 కోట్ల పనులు ఆయన చేతుల మీదుగా శ్రీకారం చుట్టుకోనున్నాయి.  విశాఖ ఉత్సవ్‌ను కూడా ముఖ్యమంత్రితో  ప్రారంభించి  సంబరాల్ని అంబరాన్ని తాకేలా నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు  పూర్తి చేసింది.   కార్య నిర్వాహక రాజధాని ప్రతిపాదన తర్వాత తొలిసారిగా విశాఖ నగరానికి వస్తున్న ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధమయ్యారు.

ముఖ్యమంత్రికి అపూర్వ స్వాగతం చెప్పేందుకు పార్టీ లు, రాజకీయాలకతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. శనివారం మధ్యాహ్నం 3.20 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి బయలుదేరనున్న సీఎంకు దారిపొడవునా కృతజ్ఞతా పూర్వక స్వా గతం పలికేందుకు జనం సన్నద్ధమయ్యాయి. ఎన్‌ఏడీ జంక్షన్, తాటిచెట్లపాలెం, రైల్వేస్టేషన్‌ రోడ్డు, తెలుగుతల్లి ఫ్లైఓవర్, సిరిపురం జంక్షన్, చినవాల్తేరు, కురుపాం టూంబ్, అప్పూఘర్‌ జంక్షన్‌ మీదుగా కైలాసగిరి చేరుకోనున్న ముఖ్యమంత్రికి కనీవినీ ఎరుగని రీతిలో 24 కిలోమీటర్ల మేర మానవహారంలా నిలబడి స్వాగతం పలకనున్నారు. కైలాసగిరి నుంచి సెంట్రల్‌పార్క్‌కు, సెంట్రల్‌ పార్క్‌ నుంచి ఆర్‌కేబీచ్‌కు ఇలా సీఎం వచ్చే దారిలో స్వాగత మానవ తోరణంతో  సీ ఎంకు థాంక్స్‌ చెప్పనున్నారు. కాన్వాయ్‌ వా హనంలో ముఖ్యమంత్రి  ఎడమవైపున ఉంటారు. దీంతో రోడ్డుకు ఒకవైపున మాత్రమే నిలబడి ఆత్మీయ కృతజ్ఞతలు తెలియజేయనున్నారు.

పండగలా అభివృద్ధి పనులకు శ్రీకారం  
విశాఖపై ఆది నుంచీ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి  రాజధాని ప్రతిపాదన తర్వాత విశ్వ నగరాన్ని ప్రపంచానికి కొత్తగా పరిచయం చేసేలా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఒకేసారి ఏకంగా రూ.1285.32 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి నేరుగా కైలాసగిరికి వెళ్లనున్న సీఎం అక్కడ వీఎంఆర్‌డీఏ ఆధ్వర్యంలో చేపట్టనున్న రూ.379.82 కోట్ల పనులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడ నుంచి బయలుదేరి నేరుగా  వైఎస్సార్‌ సెంట్రల్‌ పార్క్‌కు వెళ్లి జీవీఎంసీ చేపట్టనున్న రూ.905.50 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 

ఉత్సవ తరంగం: విశాఖ ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా ఇనుమడింపజేసేలా రెండు రోజుల పాటు ఆర్‌కే బీచ్‌లో నిర్వహించనున్న విశాఖ ఉత్సవ్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. సీఎం రాకతో సాగర తీరం జనసందోహంలా మారనుంది. థాంక్యూ సీఎం నినాదం హోరెత్తనుంది. ఇందుకు తగిన ఏర్పాట్లను ప్రభుత్వ యంత్రాంగంతో పాటు పార్టీ శ్రేణులు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఏర్పాటు చేయనున్న లేజర్‌ షో  విశాఖ ఉత్సవ్‌కి హైలైట్‌గా నిలవనుంది.  దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు నివాళులర్పించిన అనంతరం  ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకాల్ని వివరిస్తూ.. లేజర్‌ స్పెషల్‌ షో ప్రదర్శిస్తారు. స్థానికత ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలతో ముఖ్యమంత్రికి స్వాగతం పలకనున్నారు. ముఖ్యమంత్రి వచ్చినప్పటి నుంచి తిరుగు ప్రయాణం అయినంత వరకూ అభిమానాన్ని అంబరాన్ని తాకేలా అందించేందుకు ఉత్తరాంధ్ర యావత్‌ ప్రజానీకం, పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సిద్ధమవుతున్నారు. 

ముఖ్యమంత్రికి స్వచ్ఛందంగా స్వాగతం
ఎన్‌ఏడీ జంక్షన్‌ (విశాఖ పశ్చిమ): విశాఖను ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా ప్రతిపాదించిన తర్వాత విశాఖ వస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి స్వచ్ఛందంగా స్వాతం పలకడానికి ఉత్తరాంధ్ర వాసులు సన్నద్ధమయ్యారని రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. విశాఖ విమానాశ్రయంలో శుక్రవారం ఆయనకు వైఎస్సార్‌సీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా   మాట్లాడుతూ శనివారం సీఎంకు పలికే స్వాగతం విశాఖ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా ఉంటుందన్నారు.  విమానాశ్రయం నుంచి నేరుగా బీచ్‌ రోడ్డుకు వెళ్లి ఏర్పాట్లు పరిశీలించారు.    ఎమ్మెల్యేలు గుడివాడ అమర్‌నాథ్, తిప్పలనాగిరెడ్డి, ఆ పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణశ్రీనివాస్, సమన్వయకర్తలు మళ్ల విజయప్రసాద్, కేకే రాజు, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు గరికిన గౌరి , నాయకులు కొయ్య ప్రసాదరెడ్డి, రొంగలి జగన్నాథం, జియ్యాని శ్రీధర్‌ పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు