విడుదలైన జాలర్లకు సాయం

8 Jan, 2020 04:29 IST|Sakshi
మంత్రి మోపిదేవి

పాక్‌ చెర నుంచి విడుదలైన ఒక్కొక్కరికి రూ.5లక్షలు ఇచ్చేందుకు సీఎం సుముఖం

ఆత్మస్థైర్యం నింపేందుకేనన్న మంత్రి మోపిదేవి వెంకటరమణ

గన్నవరం: పధ్నాలుగు నెలలు పాకిస్తాన్‌ చెరలో ఉండి విముక్తి పొందిన ఉత్తరాంధ్ర జాలర్లలో మానసికంగా ఆత్మస్థైర్యం నింపేందుకు, వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు సీఎం వైఎస్‌ జగన్‌ సుముఖంగా ఉన్నారని.. ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం సాయం అందించనున్నట్లు మంత్రి మోపిదేవి వెంకటరమణారావు వెల్లడించారు. సీఎం కృషి ఫలితంగానే 20 మంది పేద మత్స్యకారులకు విముక్తి లభించి స్వస్థలాలకు చేరుకుంటున్నారని ఆయన తెలిపారు.

పాకిస్తాన్‌ నుంచి విడుదలైన వీరిని భారత్‌–పాక్‌ సరిహద్దు ప్రాంతమైన వాఘా వద్ద నుంచి వెంటపెట్టుకుని హైదరాబాద్‌ వచ్చిన మంత్రి.. అక్కడి నుంచి అధికారుల బృందంతో కలిసి మంగళవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 14 నెలలుగా జైలుశిక్ష అనుభవిస్తున్న 22 మంది మత్స్యకారుల్లో 20 మందిని  ఆ దేశ సైన్యం భారత భద్రతా దళాలకు అప్పగించిందని చెప్పారు. వీరిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన 15 మంది, విజయనగరం జిల్లాకు చెందిన ఐదుగురు ఉన్నట్లు తెలిపారు.
ఢిల్లీ విమానాశ్రయంలో మత్స్యకారులతో విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌  

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మరో ఇద్దరి పత్రాల పరిశీలనలో జాప్యం కారణంగా వారు విడుదల కాలేదని ఆయన తెలిపారు. వీరు కూడా పది రోజుల్లో విడుదలవుతారని చెప్పారు. విడుదలైనవారంతా ముందు సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలియజేయనున్నట్లు తెలిపారు. కాగా, ఢిల్లీ విమానాశ్రయంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ దగ్గరుండి మత్స్యకారులను విమానం ఎక్కించారు.

మరిన్ని వార్తలు