సహాయ చర్యలు వేగిరం చేయండి

4 Aug, 2013 02:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: గోదావరి, దాని ఉపనదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. సహాయ కార్యక్రమాలను వేగవంతం చేయాలని సూచించారు. గోదావరి వరదలు, రిజర్వాయర్లలో నీటిమట్టం, సహాయ కార్యక్రమాలపై శనివారం క్యాంపు కార్యాలయంలో సీఎం ఉన్నతాధికారులతో సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల వారిని పునరావాస శిబిరాలకు తరలించి, పకడ్బందీగా సహాయ కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
 
 వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన మందులు, వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. అయితే... సహాయ కార్యక్రమాల కోసం రెండు హెలికాప్టర్లను వినియోగిస్తున్నామని సీఎస్ మహంతి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో 155 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయని, వరదలు తగ్గుముఖం పట్టకపోవడంతో.. సహాయ కార్యక్రమాల నిర్వహణ కష్టమవుతోందని, దాంతో హెలి కాప్టర్ల ద్వారా ఆహారపొట్లాలను జారవిడుస్తున్నామని చెప్పారు. కొత్తగా ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో 63 పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి 7,257 మందికి పునరావాసం కల్పించామన్నారు. కాగా, వరదల వల్ల మరణించిన వారి సంఖ్య అధికారిక గణాంకాల ప్రకారం 28కి చేరింది. 20,654 ఇళ్లు దెబ్బతినగా, 1.82 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు.

మరిన్ని వార్తలు