తమాషాగా ఉందా..!

6 Sep, 2015 23:52 IST|Sakshi
తమాషాగా ఉందా..!

సమస్యలు చెప్పుకునేందుకు వచ్చి  ప్రజలపై సీఎం ఆగ్రహం
పనిచేయని అధికారులకు హెచ్చరికలు
విశాఖలో పారిశుధ్యం, కాలుష్యం, అభివృద్ధి పనుల పరిశీలన

 
‘ఏయ్.. తమాషాగా ఉందా.. తెలివిగా మాట్లాడుతున్నాననుకుంటున్నావా.. నువ్వేంటమ్మా.. విను ముందు.. మీకు టాయిలెట్లు ఉన్నా బయటకే వెళతారు. నాకు తెలియదా..మాట్లాడకండి.’అంటూ విశాఖ వాసులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 విశాఖపట్నం: విశాఖ నగర అభివృద్ధిపై భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించేందుకు స్పష్టమైన అవగాహన తెచ్చుకోవడానికంటూ   విశాఖ నగరంలో సీఎం ఆదివారం పర్యటించారు. ఒక బస్సులో నగరంలోని కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులను, మూడు బస్సుల్లో అధికార యంత్రాంగాన్ని వెంటబెట్టుకుని ఉదయం 6.30 గంటలకు సర్క్యూట్‌హౌస్ నుంచి ప్రత్యేక బస్సులో బయలు దేరి భీమిలి వరకూ వెళ్లి  మధ్యాహ్నం 2గంటలకు  కలెక్టరేట్ వద్దకు వచ్చారు. ఏడున్నర గంటల పాటు అనేక ప్రాంతాల్లో కలియతిరిగారు. వివిధ ప్రాంతాలను ఆకస్మిక తనిఖీ చేశారు. రాంనగర్ సెవెన్‌హిల్స్ ఆసుపత్రి సమీపంలో మురుగు కాలువను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం  చేశారు. డ్రెయిన్‌కు మరమ్మతులు చేపట్టి చుట్టూ మొక్కలు నాటాల్సిందిగా జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌ను ఆదేశించారు.   ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంభాలకు భారీగా కేబుల్స్ ఉండటాన్ని గమనించి వాటిని తొలగించాలని అక్కడే ఉన్న ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఆర్.ముత్యాలరాజుకు సూచించారు. అండర్‌గ్రౌండ్ విద్యుత్ ప్రాజెక్టు ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించగా,  ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని సీఎండీ బదులిచ్చారు.

రహదారులు మరమ్మతులు చేస్తున్నప్పుడే అండర్‌గ్రౌండ్ విద్యుత్ పనులు చేసుకోవాల్సిందిగా సీఎం సూచించారు. అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దనున్న వుడా సెంట్రల్ పార్కును సందర్శించారు. పార్కును ఆధునీకరించడానికి ప్రణాళికలు తయారు చేయడంతో పాటు నగరానికి చిహ్నంగా ఎక్కడోచోట డాల్ఫిన్ అక్వేరియం ఏర్పాటు చేయాలని   అధికారులను ఆదేశించారు. పార్కులో యోగా సెంటర్ కావాలని వాకర్స్ కోరగా యోగా సెంటర్‌తో పాటు ధ్యాన మందిరాన్ని కూడా కట్టిస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద చేపల మార్కెట్‌ను పరిశీలించి మార్కెట్ ఆధునీకరణకు చర్యలు తీసుకుంటామన్నారు.  ఆదివారం మాత్రమే కాకుండా  రోజూ చేపలు విక్రయించవచ్చుకదా అని అడగగా సౌకర్యాలు లేవని వారు బదులిచ్చారు. 29వ వార్డు అచ్చెయ్యమ్మపేటలోని దిడ్డి జగన్నాధరావు కల్యాణ మండపం వద్ద మురుగు కాల్వ పనులను పరిశీలించారు. అక్కడి యాచకురాలికి తన సొంత డబ్బులు రూ.2 వేలు అందజేశారు.

పనిచేయకుంటే ఇంటికి పంపిస్తా
24గంటల్లో పనులు పూర్తిచేయకపోతే ఉద్యోగం ఉండదని జోనల్ కమిషనర్ వై.శ్రీనివాసరావును హెచ్చరించారు. ప్రజామరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. స్థానికుల అభ్యర్థన మేరకు కల్యాణ మండపాన్ని పరిశీలించారు. దానితో పాటు నగరంలోని 29 కల్యాణ మండపాలను  స్వాధీన పరుచుకుని ఆధునీకరించి, తక్కువ ధరకు ప్రజలకు అందుబాటులో ఉంచాలని జీవీఎంసీ అధికారులకు సూచించారు. విశాఖ పోర్టు సమీపంలో బొగ్గు నిల్వలను సీఎం పరిశీలించారు. కాలుష్య నివారణకు చర్యలు చేపట్టాల్సిందిగా పోర్టు డిప్యూటీ చైర్మన్ పి.ఎల్.హరినాథ్‌ను ఆదేశించారు. ఎస్సార్ కంపెనీ వల్ల ఏర్పడుతున్న కాలుష్యంపై సంస్థతో పాటు సంబంధిత అధికారులు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. సింహాచలం రోడ్డులో స్థానికులు తమను ఆలయ నిర్వాహకులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పుకున్నారు. వారికి ఎలాంటి భరోసా ఇవ్వకుండానే సీఎం ముందుకు కదిలారు.

సింహాచలం బీటీఆర్ కారిడార్ రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆధికారులను ఆదేశించారు.   విమ్స్‌ను బస్సులో నుంచే సందర్శించి అసంతృప్తి వ్యక్తం చేశారు. భీమిలి పార్కును పరిశీలించి సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. భీమిలి-విశాఖ బీచ్ రోడ్డును పరిశీలించారు. బీచ్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న ఏయు కన్వెన్షన్ సెంటర్‌ను పరిశీలించారు.  నిధుల మంజూరు చేస్తామని,  డిసెంబర్ 20లోగా నిర్మాణం పూర్తి చేయాలన్నారు.
 
 

మరిన్ని వార్తలు