అంచనాల్లోనే వంచన! 

19 Jun, 2019 08:17 IST|Sakshi
లైనింగ్‌ లేని తెలుగుగంగ కాలువ, సీఎం రమేశ్‌

సాక్షి, కర్నూలు సిటీ : ఇటీవలి ఎన్నికల ముందు వరకు టీడీపీ నాయకులు ఆడిందే ఆట..పాడిందే పాట. ప్రభుత్వ నిబంధనలు సైతం వారికి అనుకూలంగా మారుతూ వచ్చేవి. ప్రజాశ్రేయస్సు, అభివృద్ధిలో పారదర్శకత అనేవి ఏ కోశానా ఉండేవి కాదు. ఇక సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఇష్టారాజ్యం నడిచింది. అంచనాలు అమాంతం పెరిగిపోయేవి. తమ వారికి పనులు దక్కేలా టెండర్‌ నిబంధనలను ఎలా పడితే అలా మార్చేసే వారు. అధికార అండతో పనులు దక్కించుకుని రూ.కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారు. తెలుగు గంగ లైనింగ్‌ పనుల విషయంలోనూ ఇదే తరహా దోపిడీకి ఎత్తుగడ వేశారు. 

అమాంతం పెరిగిన అంచనాలు 
తెలుగుగంగ ప్రాజెక్టు కింద  జిల్లాలో 1.14 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రధాన కాలువ ప్రారంభం నుంచి 18.20 కి.మీ. వరకు లైనింగ్, 18.20 కి.మీ నుంచి 42.566 కి.మీ. వరకు గతంలో లైనింగ్‌ చేయని పనుల పూర్తి, బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ (బీసీఆర్‌) నుంచి వెలుగోడు రిజర్వాయర్‌ వరకు 7.380 కి.మీ మేర లైనింగ్‌ పనులు చేపట్టాలని నిర్ణయించారు. 2014 ఉత్తర్వుల ప్రకారం ఈ పనుల విలువ రూ.172.99 కోట్లు మాత్రమే. అయితే.. 2018 మార్చి 9న జారీ చేసిన ఉత్తర్వుల్లో రూ.180.48 కోట్లుగా అప్పటి ప్రభుత్వం ఖరారు చేసింది. అంతటితో వ్యవహారం ఆగలేదు. స్వయాన అప్పటి సీఎం చంద్రబాబు ఇంజినీర్లపై ఒత్తిడి చేసి మరీ అంచనాలను రూ.280.27 కోట్లకు పెంచేలా చేశారు. ఈ మేరకు 2018 జూన్‌ 8వ తేదీన ఉత్తర్వులు ఇచ్చారు. కేవలం మూడు నెలల వ్యవధిలోనే అంచనాలను ఏకంగా రూ.99.79 కోట్లు పెంచారంటే గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల్లో దోపిడీకి ఏ స్థాయిలో గేట్లు ఎత్తిందో అర్థం చేసుకోవచ్చు. అంచనాల పెంపునకు జల వనరుల శాఖ ఇంజినీర్లు కొందరు అభ్యంతరం చెప్పినా ఆనాడు చంద్రబాబు ఏ మాత్రమూ పట్టించుకోలేదన్న విమర్శలు వచ్చాయి.  

రూ.7 కోట్లతో అయ్యే పనులకు రూ.12.16 కోట్లు 
తెలుగుగంగ ప్రధాన కాలువకు 18.20 కి.మీ. వరకు మాత్రమే కొత్తగా లైనింగ్‌ చేపట్టాల్సి ఉంది. ఆ తర్వాత 18.20 కి.మీ. నుంచి 42.566 కి.మీ. మధ్యలో కేవలం 800–900 మీటర్లు, బీసీఆర్‌ నుంచి లింక్‌ చానల్‌(వెలుగు రిజర్వాయర్‌ వరకు ఉన్న కాలువ)లో 650 మీటర్లు మాత్రమే లైనింగ్‌ పనులు చేయాల్సి ఉంది. మొత్తం 19.650 కి.మీ. పొడవు మాత్రమే లైనింగ్‌ చేయాలి. వాస్తవానికి కి.మీ. లైనింగ్‌ పనులకు రూ.7 కోట్లకు మించి ఖర్చు కాదని ఇంజినీరింగ్‌ వర్గాలు చెబుతున్నాయి. కానీ అప్పటి ప్రభుత్వం ఏకంగా రూ.12.16 కోట్లు కేటాయించింది. దీంతో పాటు కాంట్రాక్టర్‌కు జీఎస్టీ, లేబర్‌ సెస్, సీనరేజీ చార్జీల రూపంలో రూ.36.29 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. మొత్తమ్మీద సుమారు రూ.100 కోట్ల అదనపు దోపిడీకి ‘అధికారిక’ అనుమతి ఇచ్చింది. 

సీఎం రమేష్‌కు లబ్ధి చేకూర్చేలా.. 
చంద్రబాబు సన్నిహితుడు, టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌కు లబ్ధి చేకూర్చేలా తెలుగుగంగ లైనింగ్‌ టెండర్ల వ్యవహారం సాగింది. మొదటి సారి టెండర్లు పిలిచినప్పుడు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ ప్రాజెక్టస్‌ తప్పుడు పత్రాలు దాఖలు చేసింది. ఈ విషయం బహిర్గతం కావడంతో  వివాదాస్పదంగా మారింది. అయితే.. రిత్విక్‌కే టెండర్‌ దక్కేలా మరోసారి నోటిఫికేషన్‌ జారీ చేయాలని చంద్రబాబు సూచించిన మేరకు ఇంజనీర్లు 2018 జూలైలో ఓపెన్‌ టెండర్‌ పిలిచారు. వాస్తవానికి టెండర్‌ నిబంధనల్లో ‘పేపర్‌’ అనే యంత్రంతో కాలువ లైనింగ్‌ చేసిన అనుభవం ఉన్న కాంట్రాక్టర్లే బిడ్‌ దాఖలు అర్హులని పేర్కొనాలి. కానీ పేపర్‌తో పాటు ‘షార్ట్‌ క్రీటింగ్‌’ విధానంలో పనులు చేసిన అనుభవం ఉండాలనే నిబంధన కూడా పెట్టి సీఎం రమేష్‌ కంపెనీకి దక్కేలా చేశారు. ఆ కంపెనీతో ఎన్నికలకు కొద్ది రోజుల ముందే అంటే ఈ ఏడాది మార్చి 7వ తేదీన అగ్రిమెంట్‌ చేసుకున్నారు. మూడు నెలలు గడిచినా ఇంత వరకు పనులు మొదలు పెట్టలేదు. దీంతో ఇంజినీర్లు ఇటీవలే నోటీసులు ఇచ్చారు. పనులు మొదలు పెట్టకపోవడంతో కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల టెండర్‌ రద్దయ్యే అవకాశం ఉన్నట్లు ఇంజినీరింగ్‌ వర్గాలు చెబుతున్నాయి.  

>
మరిన్ని వార్తలు