చట్టం.. వారికి చుట్టం

5 Sep, 2019 06:45 IST|Sakshi

నిబంధనలు ఉల్లంఘించి మరీ రెవెన్యూ చట్టాన్ని తోసిపుచ్చిన వైనం

సీఎం రమేష్‌ కుటుంబీకుల పేరిట ఇనాం భూముల బదలాయింపు

రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు

గత ప్రభుత్వ హయాంలో నిర్వాకం

సాక్షి, కడప : అవి కుల వృత్తులు చేసుకుంటూ జీవించే నిరుపేదలకు దక్కాల్సిన సర్వీస్‌ ఇనాం భూములు. ఎంతో విలువైనవి కావడంతో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ కుటుంబీకుల కన్ను పడింది. ఇంకేముంది....తమ రాజకీయ పలుకుబడిని వినియోగించారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు చట్టాన్ని చుట్టచుట్టి ప్రక్కన పెట్టి వాటిని వ్యవసాయేతర అవసరాలకు మళ్లిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది.

పూర్వం గ్రామాల్లో కుల వృత్తులు ఉండేవి. ప్రజలకు ఆయా సేవలు అందించే వీరి జీవనోపాధి కోసం అప్పటి రాజులు కొన్ని భూములను ఇనాములుగా కేటాయించారు. కుల వృత్తి నిర్వహిస్తున్నంత కాలం ఆ భూములను సాగు చేసుకునే హక్కు వారికి ఉంటుంది. వీటిని సర్వీసు ఇనాములుగా పరిగణిస్తారు. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామంలో కూడా ఇలాంటి సర్వీస్‌ ఇనాం భూములు ఉన్నాయి. ఆ గ్రామానికి చెందిన చరణ్‌తేజ నాయుడు సతీమణి జ్యోతి తేజస్వి కొన్ని సర్వే నెంబర్లలోని 12ఎకరాల 60 సెంట్ల వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు బదలాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలంటూ రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు.

ఇందుకోసం కన్వర్షన్‌ ఫీజు కింద రూ.3,74,814 చెల్లిస్తూ 2015 నవంబరు 20వ తేదిన చలానాలు కట్టారు. ప్రభుత్వ బేసిక్‌ వాల్యూ ప్రకారం ఎకరా 3,30,000 రూపాయలు చేస్తుంది. బహిరంగ మార్కెట్‌లో అనధికారికంగా ఈ భూముల విలువ ఇంకా అధికంగానే ఉంటుందన్నది నిర్వివాదాంశం. ఈ ఫైలు అప్పటి కలెక్టర్‌ కేవీ రమణ వద్దకు వెళ్లింది. రీ సర్వే అండ్‌ రీసెటిల్‌మెంట్‌ రిజిష్టర్‌ ప్రకారం అర్జీదారు పొందుపరిచిన సర్వే నెంబర్లలో కొన్ని పట్టా భూములు కాగా, మరికొన్ని సర్వీస్‌ ఇనామ్‌ భూములు ఉన్నాయని కలెక్టర్‌ గుర్తించారు. సర్వీస్‌ ఇనాం భూములను వ్యవసాయేతర అవసరాలకు మళ్లించడం వీలు కాదని కలెక్టర్‌ స్పష్టం చేశారు. గవర్నమెంటు అమెండ్‌మెంట్‌ యాక్ట్, 16/2013 ప్రకారం సర్వీస్‌ ఇనాం భూములు బదలాయించరాదని పేర్కొంటూ ఆ ప్రతిపాదనలు తిరస్కరించారు. పట్టా భూములు ఉన్నట్లయితే పరిశీలించి కొత్తగా ప్రతిపాదనలు తయారు చేసి పంపాలంటూ కలెక్టర్‌ 2015 డిసెంబరు 14వ తేది కడప ఆర్డీఓకు ఆదేశాలు జారీ చేశారు.

బదలాయించిన భూములు
దరఖాస్తుదారు ప్రతిపాదించిన సర్వే నెంబర్లలో మొత్తం 13.15 ఎకరాల భూమి ఉండగా, అందులో 12.62 ఎకరాల వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు బదలాయిస్తూ 2016 జనవరిలో అప్పటి ఆర్డీఓ చిన్నరాముడు ప్రొసీడింగ్స్‌ జారీ చేశారు. ఇందులోని సర్వే నెంబరు 840, 841, 847, 849, 851, 859లలోని భూములు ఆర్‌ఎస్‌ఆర్‌ ప్రకారం సర్వీస్‌ ఇనాంలు. ఎంతో విలువైన ఇలాంటి భూములు అక్రమార్కుల పాలిట కాకుండా రెవెన్యూ ఉన్నతాదికారులు, విజిలెన్స్‌ అధికారులు నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు.

రాజకీయ ఒత్తిళ్లు
దరఖాస్తుదారైన జ్యోతి తేజస్వి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు స్వయాన అన్న సురేష్‌నాయుని కోడలు. తమకున్న రాజకీయ బలంతో అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది.  అప్పటి ఎర్రగుంట్ల తహసీల్దార్‌ హడావుడిగా 2015 డిసెంబరు 31వ తేది పై అధికారులకు నివేదిక పంపారు. భూమి బదలాయింపు ప్రతిపాదన ఫైలు తిప్పి పంపిన కలెక్టర్‌ కేవీ రమణ నెలన్నర రోజులకే మనసు మార్చుకోవాల్సి వచ్చింది. ఏపీ ల్యాండ్‌ కన్వర్షన్‌ యాక్ట్‌–2006 ప్రకారం సదరు ప్రతిపాదనల ఆమోదానికి చర్యలు చేపట్టాలని 2016 జనవరి 30వ తేది కడప ఆర్డీఓకు ఆదేశాలు ఇవ్వడం గమనార్హం.

ఒక అధికారి చట్టంలోని నిబంధనలను పేర్కొంటూ తిరస్కరించిన ప్రతిపాదనలను అప్పీలేట్‌ అథారిటీ రద్దు చేయవచ్చు. కానీ అలాంటిదేమీ లేకుండానే కలెక్టర్‌ తాను తిరస్కరించిన ప్రతిపాదనలను తానే ఆమోదం తెలుపడం వెనుక చాలా కథే నడించిదంటున్నారు. ల్యాండ్‌ కన్వర్షన్‌ ప్రక్రియ ప్రారంభించాలంటూ కలెక్టర్‌ కడప ఆర్డీఓకు జారీ చేసిన ఉత్తర్వుల్లోని సూచికలో గతంలో అదే ఫైలును ఎందుకు తిరస్కరించిందీ, ఇప్పుడు ఎందుకు ఆమోదించారో కారణాలు తెలుపకపోవడం గమనార్హం. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఒక స్పీకింగ్‌ ఆర్డర్‌ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ అలా జరగలేదంటే అప్పటి అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు ఏ మేరకు పనిచేశాయో అర్థమవుతోంది. ఈ సందర్బంగా గుర్తొచ్చే విషయం ఏంటంటే గతంలో ఇదే పోట్లదుర్తి గ్రామంలోని ప్రభుత్వ భూముల్లో కల్యాణ మండపాలు నిర్మించారు. ఇందుకు సంబంధించి రెవెన్యూ అధికారులపై ఛార్జెస్‌ ఫేమ్‌ అయ్యాయి. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ మొదలు తహసీల్దార్‌ వరకు పది మందిపై అభియోగాలు ప్రభుత్వ స్థాయిలో పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు